శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అభ్యుదయ సాహిత్య స్వరం గడ్డం సుశీల

1 గంట క్రితం

susila
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అభ్యుదయ సాహిత్యానికి, మార్క్సిస్టు భావజాలానికి జీవితాంతం అంకితమైన గడ్డం (మిక్కిలినేని) సుశీల శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో కన్నుమూశారు. ఉద్యమ స్ఫూర్తిని, సాహిత్య చైతన్యాన్ని తన జీవితంలో విడదీయరాని భాగంగా మలచుకున్న ఆమె అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, సంపాదకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా విశిష్ట సేవలందించారు. మార్క్సు 'కాపిటల్' గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన మేధావి మిక్కిలినేని అక్కయ్య చౌదరి కుమార్తె అయిన ఆమె, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు అభ్యుదయ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు.

కృష్ణా జిల్లా పెదమద్దాలి గ్రామంలో జన్మించిన సుశీల బాల్యం నుంచే అభ్యుదయ భావాలతో పెరిగారు. రాజమండ్రి, మంతెన, విజయవాడలలో పాఠశాల విద్య పూర్తిచేసి, విజయవాడ ప్రభుత్వ కళాశాల, ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., గ్రంథాలయ శాస్త్రంలో పట్టాలు పొందిన ఆమె, అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయంలో 'మార్క్సిస్టు దృక్పథంలో మహాప్రస్థానం' అంశంపై ఎం.ఫిల్. పట్టా సాధించారు. విద్యార్థి దశలోనే రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ ఎన్నికల్లో విజయం సాధించి, విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ప్రజాస్వామ్య, అభ్యుదయ విలువలను విద్యార్థి ఉద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం నిజామాబాద్, రామచంద్రపురం, గన్నవరం ప్రభుత్వ కళాశాలల్లో సుమారు మూడున్నర దశాబ్దాలపాటు అధ్యాపకురాలిగా సేవలందించి, అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. తరువాత సాహిత్య వ్యాసంగం కొనసాగించారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌తో ఆమె అనుబంధం నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1980లలో సంపాదక మండలి సభ్యురాలిగా పనిచేసిన ఆమె, తరువాత సంపాదకుడు గడ్డం కోటేశ్వరరావుతో కలిసి అనేక విలువైన గ్రంథాల సంపాదకత్వం, పరిష్కరణలో కీలక పాత్ర పోషించారు. మార్క్సు 'కాపిటల్' తెలుగు అనువాద రూపకల్పనలో, 'ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర (1920–48)' పునర్ముద్రణలో, 'మార్క్స్–ఎంగెల్స్ సంకలిత రచనలు' సంపాదనలో ఆమె విశేష కృషి చేశారు. తండ్రి మిక్కిలినేని అక్కయ్య చౌదరి రచించిన 'కాపిటల్' తెలుగు అనువాదం, 'టాల్‌స్టాయ్ జీవితచరిత్ర' వంటి గ్రంథాల రూపకల్పనలోనూ ఆమె సహకరించారు.

మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్య విమర్శను అభివృద్ధి చేయడంలో సుశీల విశిష్ట సేవలందించారు. 'సమకాలీన సమాజం–సందర్భం–సందేశం', 'సమర్థనం', 'మార్క్సిస్టు దృక్పథంలో మహాప్రస్థానం' వంటి రచనలు చేశారు. అనేక నవలలు, కథాసంకలనాలు, అనువాద గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. బోధన, రచన, సంపాదకత్వం, ఉద్యమ జీవితం అనే నాలుగు రంగాల్లోనూ సమానమైన నిబద్ధతతో పనిచేసిన ఆమె, అభ్యుదయ భావాలను కొత్త తరాలకు చేరవేసిన మేధావిగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోతారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్