అస్సాంకు చెందిన పార్వతి బరువా చిన్ననాటి నుంచి బొమ్మలతో కాదు... నిజమైన ఏనుగులతోనే పెరిగింది. వాటి మధ్యే తిరిగింది. వాటి భాషను అర్థం చేసుకుంది. వాటి సంరక్షణనే జీవిత ధ్యేయంగా మార్చుకుంది. పురుషుల ఆధిపత్యం ఉన్న ఏనుగు మావటి వృత్తిలో అడుగుపెట్టి భారతదేశపు తొలి మహిళా మావటిగా చరిత్ర సృష్టించింది. దాదాపు ఐదు వందలకు పైగా ఏనుగులకు శిక్షణనిస్తూ, అడవి ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చి, మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించడంలో విశేష కృషి చేసింది. అందుకే ఆమెను అస్సాంలో ప్రేమగా 'హస్తి కన్య' (ఏనుగుల కుమార్తె) అని పిలుస్తారు. 2024లో భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
పార్వతి బరువా 1953 మార్చి 14న అస్సాంలోని గౌరీపూర్ రాజకుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రకృతీశ్ చంద్ర బరువా (లాల్‌జీ) గౌరీపూర్ రాజవంశానికి చెందిన చివరి పాలకుడు. గౌహతి విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పట్టా పొందిన పార్వతికి విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నా, ఆమె ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. అడవులు, వన్యప్రాణులు, ముఖ్యంగా ఏనుగులే ఆమెను ఆకర్షించాయి. చిన్నతనంలో వారి రాజభవనంలోని అశ్వశాలల్లో దాదాపు 40 ఏనుగులు ఉండేవి. వాటిని తండ్రి అడవులకు తీసుకెళ్లిన ప్రతిసారీ పార్వతి కూడా వెంట వెళ్లేది. ఏనుగుల ప్రవర్తనను గంటల తరబడి గమనించేది. వాటి స్వభావం, సంకేతాలు, అలవాట్లు తెలుసుకుంటూ వాటితో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకుంది. సాధారణంగా ఏనుగులను మచ్చిక చేయడం, శిక్షణ ఇవ్వడం, వాటిని నియంత్రించడం అత్యంత ప్రమాదకరమైన పని. అందుకే ఈ వృత్తి పూర్తిగా పురుషుల ఆధీనంలోనే కొనసాగింది. అయితే పార్వతి ఆ సంప్రదాయాన్ని సవాలు చేసింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే అస్సాంలోని కొచుగావ్ అడవుల్లో తన తొలి అడవి ఏనుగును మచ్చిక చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏనుగులను అదుపు చేయడానికి శారీరక బలం కంటే వాటి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, సరైన మెళకువలు తెలుసుకోవడం ముఖ్యమని ఆమె చెబుతారు.
1975 నుంచి 1978 మధ్యకాలంలో అస్సాంలో సాంప్రదాయంగా అనుసరించే 'మేలా షికార్' పద్ధతిలో 14 అడవి ఏనుగులను మచ్చిక చేయడంలో పార్వతి కీలక పాత్ర పోషించారు. ఈ పద్ధతిలో మత్తుమందు తుపాకులు ఉపయోగించరు. తాడు ఉచ్చు (లాసో) సాయంతో ఏనుగులను పట్టుకుని క్రమంగా వాటిని శిక్షణ ఇస్తారు. అనంతరం అస్సాంలోని దర్రాంగ్, కొచుగావ్ అటవీ ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి, డార్జిలింగ్ ప్రాంతాల్లో కూడా ఏనుగుల సంరక్షణ, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాలక్రమేణా 500కు పైగా ఏనుగులకు శిక్షణనిచ్చి దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన మావటిల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
అడవుల్లో గడిపిన అనుభవాల గురించి పార్వతి చెబుతూ, 'దట్టమైన అడవుల్లో ప్రతి రోజు కొత్త సవాలే. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేం. అయినా నేను వెనక్కి తగ్గలేదు. ఏనుగులను నా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాను. ప్రతిరోజూ వాటికి స్నానం చేయిస్తాను. శిక్షణ ఇస్తాను. వాటికి ఇష్టమైన హడియా (పులియబెట్టిన బియ్యం నీరు) తయారుచేసి తాగిస్తాను. వాటి భావాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. అందుకే అవి కూడా నన్ను విశ్వసిస్తాయి. నేను ఒక్కసారి పిలిస్తే చాలు... పరుగెత్తుకుంటూ వస్తాయి' అని పేర్కొన్నారు. ఈ వృత్తిలో ప్రతి క్షణం ప్రాణాపాయం పొంచి ఉంటుందని, అడవిలో అడుగుపెట్టిన ప్రతిసారీ అదే చివరి ప్రయాణమైపోవచ్చని భావించినా, ఏనుగులను విడిచి జీవించలేనని ఆమె అంటారు.
ఆ ఆపరేషన్ మర్చిపోలేనిది..
2003 మార్చిలో ఛత్తీస్‌గఢ్‌లో అడవిని విడిచి గ్రామాల్లోకి వచ్చిన ఓ ఏనుగు పలువురిపై దాడులు చేసి ప్రాణనష్టం కలిగించింది. దానిని అదుపులోకి తీసుకురావడానికి అటవీశాఖ అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆ ఏనుగును అంతమొందించాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్‌లో పార్వతి కూడా పాల్గొన్నారు. వందలాది ఏనుగులను సంరక్షించిన తన జీవితంలో ఒక ఏనుగును కాల్చివేయాల్సి రావడం అత్యంత బాధాకరమైన సంఘటనగా మిగిలిపోయిందని ఆమె చెబుతారు. మరోసారి పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో సుమారు 50 ఏనుగుల గుంపు దారి తప్పి గ్రామాల్లోకి ప్రవేశించింది. పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అటవీ అధికారులు పార్వతి సహాయం కోరారు. ఆమె అక్కడికి చేరుకుని రెండు వారాలపాటు ఏనుగుల కదలికలను పరిశీలిస్తూ, వాటి ప్రవర్తనను అర్థం చేసుకుంటూ, ఒక్కో అడుగు జాగ్రత్తగా ముందుకు వేసింది. చివరకు మొత్తం ఏనుగులను మళ్లీ అడవివైపు మళ్లించడంలో విజయవంతమయ్యారు. ఈ సంఘటన తనకు అత్యంత సంతృప్తినిచ్చిన విజయాల్లో ఒకటని ఆమె చెబుతారు.
ఏనుగుల సంరక్షణలో ఆమె చేసిన విశేష కృషిని ప్రపంచం కూడా గుర్తించింది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని బీబీసీ 'క్వీన్ ఆఫ్ ది ఎలిఫెంట్స్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ సందర్భంగా మీడియా ఆమెను 'ఏనుగులంటే ఎందుకంత ఇష్టం?' అని ప్రశ్నించగా, 'ఆ ప్రేమను మాటల్లో చెప్పలేను. అవి చాలా స్థిరమైనవి, విశ్వసనీయమైనవి, ఆప్యాయమైనవి, క్రమశిక్షణ కలిగిన జీవులు. వాటితో గడిపిన ప్రతిక్షణం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బహుశా అందుకేనేమో వాటిని ఇంతగా ప్రేమిస్తున్నాను' అని సమాధానమిచ్చారు. ఏనుగుల సంక్షేమానికి ఆమె అందించిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2024లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఏనుగులను ప్రేమతో అర్థం చేసుకోవడమే వాటిని సంరక్షించే గొప్ప మార్గమని తన జీవితంతో చాటి చెప్పిన పార్వతి, వన్యప్రాణుల సంరక్షణలో భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు.








కామెంట్‌లు (0)