ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమాజాన్ని ప్రతిబింబించిన ‘మనుగడ’

20 సెప్టెంబర్, 2026

book
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 08:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సమాజంలో ప్రస్తుతం ఎదురవుతున్న సంఘటనలను కథా ఇతివృత్తాలుగా తీసుకుని రచయిత పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఇటువంటి కథలను అందరూ ఇష్టపడకపోవచ్చు. అయితే రచయిత కథలను నడిపించిన తీరు పాఠకులను కట్టిపడేస్తుంది. పరిచయం అక్కరలేని రచయిత సింహప్రసాద్‌. ఇప్పటికే పలు బహుమతులు అందుకున్న ఆయన వెలువరించిన 15వ కథా సంపుటి ‘మనుగడ’. ఇందులోని కథలు సమకాలీన సామాజిక సమస్యలను, మానవ సంబంధాలను, జీవన విలువలను ప్రతిబింబిస్తాయి.

పదేళ్ల వయస్సులో ప్రతి ఒక్కరి లక్ష్యాలు, కలలు గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు తాము గడుపుతున్న జీవితం కంటే ఉన్నత స్థితికి చేరుకోవాలని కలలు కంటారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబాన్ని నడిపించడంలో ‘‘గమ్యం గమనం’’ కథలో గణేశ్‌ పాత్ర ద్వారా రచయిత తెలియజేశారు.​

అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలికి న్యాయం జరగాలని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించే సమాజం, నిందితుడు తమ కుటుంబసభ్యుడైతే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది? ఎలా ప్రవర్తిస్తుంది? అనే ప్రశ్నలను ‘‘తీర్పు’’ కథ లేవనెత్తుతుంది. అభివృద్ధి పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు అడవులను విచ్చలవిడిగా నరికివేస్తున్న ప్రభుత్వాల తీరును ‘‘మనుగడ’’తో ప్రశ్నించారు. మణిపూర్‌ హింసాకాండ నేపథ్యంలో సాగిన ఈ కథలో తెగల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, మహిళలపై జరిగిన దారుణాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలను కథా రూపంలో ఆవిష్కరించారు. ఇటువంటి సున్నితమైన అంశాలను కథగా మలచడం కత్తిమీద సామే. అయితే తెగ నాయకురాలు అమేలియా పాత్ర ద్వారా కథను నడిపించిన తీరు పాఠకులను ఆసాంతం చదివిస్తుంది.

ఇంట్లోనైనా, కార్యాలయంలోనైనా అన్నీ తన వల్లే నడుస్తున్నాయనే భ్రమ నుంచి బయటపడాలని ‘ఏ రూమ్‌ ఆఫ్‌ దెయిర్‌ ఓన్‌’ కథ సూచిస్తుంది. మహిళలకు తమకంటూ ప్రత్యేకమైన స్వేచ్ఛ, వ్యక్తిగత స్థలం ఉన్నప్పుడే వారు పువ్వులా వికసించగలరని రచయిత తెలియజేశారు. ​‘‘వెలుగుచార’’ కథలో..​ పెళ్లంటే ఒక ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలని దీనంగా కోరుకోవడం కాదని, తన తల్లిదండ్రులు తనను అలా పెంచలేదని పెళ్లికొడుకు కుటుంబానికి కళ్లు తెరిపించిన తీరు ప్రశంసనీయం. మంచానపడిన తల్లికి సేవ చేయలేక, సేవ చేసేందుకు మనిషిని నియమించుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో. అటువంటి వారికి సేవలందించేందుకు ‘‘సేవా బ్యాంక్‌’’ పేరుతో ఒక సంస్థను నడపాలనే ఆలోచనను రచయిత ఈ కథలో ప్రతిపాదించారు. అందమైన ప్రకృతిని మరిచిపోయి పూర్తిగా యాంత్రిక వాతావరణంలో జీవిస్తున్న వారికి సహజ జీవనంలోని అసలైన ఆనందాన్ని ‘ఒక్క అడుగు’ పరిచయం చేశారు. ఆడపిల్ల అని ఈసడించుకునే వారికి చెంపపెట్టు లాంటి కథ ‘‘అద్వైతం’’.

కిడ్నీలు విఫలమై అనారోగ్యానికి గురైనప్పటికీ తన తల్లికి తెలియకుండా, ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించాలనుకున్న కొడుకు, తాను అనారోగ్యానికి గురైనప్పుడు తల్లి చూస్తూ ఊరుకోగలదా? తన ప్రాణాన్నైనా ఇచ్చి కొడుకును కాపాడేందుకు ముందుకు వచ్చే తల్లి ప్రేమకు ‘‘దేవుడు కనిపించాడు’’ నిలువుటద్దంలా నిలిచింది. ​ కథలో తెలియజేశారు. నీతులు వల్లించినంత మాత్రాన గొప్పవాళ్లు కాలేరని, వ్యక్తి ప్రవర్తనే అతని నిజస్వరూపాన్ని తెలియజేస్తుందని చెప్పే కథ ‘మౌన ఛేదన’. సమకాలీన రాజకీయాలను వ్యంగ్యంగా చిత్రీకరించిన కథలుగా ‘కొక్కొరోకో’, ‘తలాట్టు బొమ్మ’ కనిపిస్తాయి. రాజకీయ వ్యవస్థలోని వైరుధ్యాలు, సమాజంలోని పరిస్థితులను వ్యంగ్య ధోరణిలో ఆవిష్కరించడం ద్వారా పాఠకులను ఆలోచింపజేస్తాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను, మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలను, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని, మహిళల ఆత్మగౌరవాన్ని, మానవత్వపు విలువలను కథా వస్తువులుగా మలచిన ‘మనుగడ’ సంపుటి సమకాలీన సాహిత్యంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. ప్రతి కథ పాఠకుడిని ఆలోచింపజేయడంతోపాటు, సమాజం పట్ల తన బాధ్యతను గుర్తుచేస్తుంది. సింహప్రసాద్‌ కథన శైలి ఈ సంపుటికి ప్రధాన బలంగా నిలిచింది.

ఎల్‌. ఫణిశ్వరి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్