మా నాన్న
తెల్లవారుజామున
సూర్యుణ్ణి నిద్ర లేపి
చీపురు ఖడ్గాన్ని భుజాన్నేసుకుని
అపరిశుభ్రత పై యుద్ధానికి వెళ్తాడు
ప్రతిరోజు
ఆయన చీపురు చప్పుడుతోనే
ఊరు నిద్రలేచి
జీవితాన్ని మొదలుపెడుతుంది
ఉదయాన్నే
ఆయన మురికి చేతులను
ముద్దాడకుండా
ప్రకృతి పచ్చని పెదాల నుండి
చిరునవ్వులు రాలవు
భూదేవితల్లి
ఆయన వొంటివాసనను
అత్తరుగా పూసుకుని
మట్టి వాసనగా పరిమళిస్తుంది
వీధుల్లో అమాయకమైన
మూగ జీవులు మరణిస్తే
సమాజమంతా
ముక్కు మూసుకుంటుంది
కానీ మా నాన్న
చితి పై కొన్ని కన్నీటి చుక్కలను జల్లి
ఆఖరి గౌరవంగా
వాటికి దహన సంస్కారాలు చేస్తాడు
రోజు మా నాన్న
ప్రతి వీధిని శుభ్రపరుస్తుంటే
సమాజపు ముఖాన్ని
కడుగుతున్నట్టే ఉంటుంది
డెంగ్యూ, మలేరియా
వంటి వ్యాధులు రాకుండా
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి
దయ లేని సమాజానికి
తన ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాడు
సమాజంలో
ఆయన్ని చాలామంది
చూసీ చూడనట్లు వెళ్ళిపోతారు
ఇంకొంతమంది
చాలా చిన్నచూపుతో చూస్తారు
అయిన మా నాన్న
సమాజాన్ని గౌరవిస్తాడు
అవమానాలను ఆహ్వానిస్తాడు
అగౌరవాన్ని భరిస్తాడు
నిత్యం నిస్వార్థమైన
బతుకును నిశ్శబ్దంగా అనుభవిస్తాడు
ఎందుకు నాన్న అని ప్రశ్నిస్తే
పెదాలపై చిరునవ్వును విసిరి
సమాధానాన్ని నాలోనే వెతుక్కోమంటాడు
అప్పుడప్పుడు
బతుకును వివక్షగా చూసే
మలినమైన సమాజపు హృదయాన్ని
మా నాన్న చీపురుతో
శుభ్రపరిస్తే బాగుండనిపిస్తుంది
మా నాన్నకు
పండగ సెలవులు ఉండవు
ఆయన కష్టాన్ని
సత్కరించే నాథుడు ఉండడు
ఏదైనా అనారోగ్యం వస్తే
ఆరోగ్య భీమా ఉండదు
కనీసం ఆయన సేవకు
గౌరవ వందనం ఉండదు
పెద్ద మనసున్న ప్రజాస్వామ్యం
చాలీచాలని జీతాలను ఇచ్చి
ఆకలి పేగులను నింపుతుంది
రోజూ సాయంత్రం
సూర్యుడు ఇంటికి వెళ్లాక
హీనంగా చూసే
సమాజాన్ని చక్కబెట్టి
దారంట చిరునవ్వులు
వలకబోసుకుంటూ ఇంటికి వస్తాడు
మా నాన్న కష్టమే
మా పేదరికానికి కొండంత ఆస్తి
ఆయన చెమట చుక్కే
మా కంచంలో తీయని అమృతం
నూతంగి గోపి
9676079592








కామెంట్‌లు (0)