నేల మీద నడిపే వాహనంలో ఏదైనా అనుకోని అవాంతరం తలెత్తిందని గ్రహిస్తే... దాన్ని ఆపేయవచ్చు. రోడ్డు పక్కన నిలిపి, ఉత్పన్నమైన సమస్యను పరిష్కరించుకోవచ్చు. అదే ఆకాశంలో ఎగిరే విమానంలో సంభవిస్తే...?! ఇది గుండెల్లో అదురు పుట్టించే సందర్భం! తీవ్ర భయాందోళనలు కలిగించే పరిణామం! అలాంటి విషమ పరిస్థితుల్లో కూడా పైలట్లు ధైర్యంగా, అప్రమత్తంగా, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా దుబాయ్ నుండి ఇజ్రాయిల్ బయల్దేరిన విమానంలో పైలట్ మచ్చర్ సమయస్ఫూర్తితో, సాహసంతో వ్యవహరించి, 174 మంది ప్రాణాలను కాపాడారు.
కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో జరిగే అనూహ్య పరిణామాలను ఊహించడమే కష్టం. అలాంటిది అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వందలాది మంది ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించడం గొప్ప సాహసమనే చెప్పాలి. ఈ సంఘటనలో విమానం కూల్చేందుకు ఒక పైలట్ ప్రయత్నిస్తే, రెండో పైలట్ అయిన మచ్చర్ దాన్ని అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన రక్తం వచ్చేలా గాయపడ్డారు. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు. కాక్‌పిట్‌లో జరుగుతున్న ఈ ఘర్షణకు విమానం ఒక్కసారిగా 14 వేల అడుగులు కిందికి జారిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో కొంతమంది కాక్‌పిట్ వైపుకు వెళ్లారు. అదే సమయంలో మచ్చర్ అతికష్టం మీద కాక్‌పిట్ డోర్‌ను తీశారు. దాడికి తెగబడుతున్న పైలట్‌ను కొంతమంది ప్రయాణికులు నిలువరించారు. వైద్యుడైన మరో ప్రయాణికుడు మచ్చర్‌కు ప్రథమ చికిత్స చేశాడు. ప్లంబర్‌గా పనిచేస్తున్న వ్యక్తి పైలట్ స్థానంలో ఉండి విమానాన్ని సరైన మార్గంలో నడిపించాడు. ఇక్కడ ఒక ప్రమాదం... కొంతమంది వ్యక్తుల అనూహ్య స్పందన వల్ల 174 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. గతంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, ప్రయాణికులను కాపాడిన సందర్భాలు ఉన్నాయి.
ఒక్క ఇంజిన్‌తోనే...
2022 జూన్ 19న స్పైస్‌జెట్ బోయింగ్ 737 ఫ్లైట్ ఎస్‌జి 723 విమానం పాట్నా నుండి ఢిల్లీకి 185 మంది ప్రయాణికులతో బయల్దేరింది. విమానం కొంత దూరం వెళ్లేసరికి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్పుడు కెప్టెన్ మోనికా ఖన్నా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఆలస్యం చేయకుండా ఇంజిన్ స్విచ్‌ను ఆపేశారు. ఫస్ట్ ఆఫీసర్ బల్‌ప్రీత్ సింగ్ భాటియా సహకారంతో ఒక్క ఇంజిన్‌తోనే విమానాన్ని నడిపి సురక్షితంగా ల్యాండ్ చేశారు. మోనికా సాహసాన్ని ఆరోజు కూడా ఎంతోమంది కొనియాడారు.
గాల్లో చక్కర్లు కొట్టింది!
2024 అక్టోబరు 11న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 613 తిరుచిరాపల్లి నుండి షార్జాకు 141 మంది ప్రయాణికులతో బయల్దేరింది. టేకాఫ్ అయిన తరువాత ల్యాండింగ్ గేర్ ముడుచుకోకపోవడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే అది అంత సులభంగా జరగలేదు. విమానంలోని ఇంధనాన్ని ఖాళీ చేసేందుకు విమానాన్ని గాల్లో రెండు గంటలు చక్కర్లు కొట్టించాల్సి వచ్చింది. 24 చిన్న, మూడు పెద్ద లూప్‌లను పూర్తిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పైలట్లు ఇక్రామ్ రిఫాడ్లి, మైత్రీ శ్రీకృష్ణ షీతోల్ చూపించిన సమయస్ఫూర్తి, ట్రాఫిక్ నియంత్రణ సిబ్బందితో నిరంతరం చేసిన సంభాషణ వార్తల్లో నిలిచింది. బెల్లీ ల్యాండింగ్ కోసం అంతా సిద్ధం చేశారు. రన్‌వే మొత్తం దట్టమైన పొగమంచుతో కప్పేశారు. విమానం కొద్ది క్షణాల్లో ల్యాండ్ అవ్వబోతుండగా ల్యాండింగ్ గేర్ ముడుచుకోవడం ప్రారంభించింది. దీంతో పొగమంచుతో పనిలేకుండానే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
గతంలో జరిగిన ఘటనలు
కాక్‌పిట్ విండ్‌షీల్డ్ పగిలినా... (2020): ముంబై నుండి లక్నో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా కాక్‌పిట్ ముందు ఉండే విండ్‌షీల్డ్ అద్దం పగిలిపోయింది. గాలి ఒత్తిడి తీవ్రంగా పెరిగి విమాన నియంత్రణ కష్టంగా మారింది. పైలట్లు వెంటనే ఆక్సిజన్ మాస్కులు ధరించి, క్షణాల వ్యవధిలో విమానాన్ని సురక్షితమైన ఎత్తుకు దింపి, సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించారు. అత్యవసర ల్యాండింగ్ చేశారు.
టైరు పేలినప్పుడు... (అహ్మదాబాద్, 2018): జైపూర్ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో వెనుక ఉన్న టైరు పేలిపోయింది. విమానం రన్‌వే నుండి పక్కకు దూసుకెళ్లబోయింది. ఇంత తీవ్ర ప్రమాదంలో పైలట్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. విమాన బ్రేకింగ్ సిస్టమ్, విమాన దిశను క్షణాల్లో నియంత్రించారు. గమ్యస్థానం వరకు వెళ్లకుండా రన్‌వే మధ్యలోనే విమానాన్ని సురక్షితంగా ఆపారు. 76 మంది ప్రయాణికులను కాపాడారు.
ల్యాండింగ్ సమయంలో... (ఖజురాహో, 2002): వారాణసి నుండి ఖజురాహో వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ (బోయింగ్ 737) విమానం ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక లోపం వల్ల ల్యాండింగ్ గేర్ (చక్రాలు) బయటకు రాలేదు. పైలట్లు విమానం కింది భాగాన్ని రన్‌వేపై తాకుతూ పోనించారు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి! అయినా ఎంతమాత్రం భయపడకుండా ‘బెల్లీ ల్యాండింగ్’ ద్వారా విమానం మంటల్లో చిక్కుకోకుండా సమర్థవంతంగా అదుపు చేశారు. 52 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా ఉంచారు.
కెప్టెన్ చాకచక్యం (1984 - విమానం హైజాక్): చండీగఢ్ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కొందరు తీవ్రవాదులు హైజాక్ చేసి పాకిస్థాన్‌కు తీసుకెళ్లాలని కోరారు. కెప్టెన్ మజ్ముదార్ ఇంధనం తక్కువగా ఉందనే మిషతో వారిని దారి మళ్లించారు. ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పక్షులు ఢీకొన్న ఘటన (2019): రాజస్థాన్‌లో శిక్షణ సమయంలో ఉన్న స్క్వాడ్రన్ లీడర్ ప్రయాణిస్తున్న విమాన ఇంజిన్‌ను పక్షులు ఢీకొట్టాయి. ఇంజిన్ పూర్తిగా ఫెయిల్ అయింది. విమానం జనావాసాలపై పడితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని గ్రహించిన పైలట్, తన ప్రాణాలను పణంగా పెట్టి విమానాన్ని ఖాళీ ప్రదేశం వైపు మళ్లించి బయటకు దూకారు.








కామెంట్‌లు (0)