అసోం అంటే గుర్తుకొచ్చేది తేయాకు తోటలే. ఈ తోటల్లో వందలాది మహిళా కార్మికులు పనిచేస్తారు. వారికి సరైన సదుపాయాలు ఉండవు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చే డబ్బులు వారి అవసరాలకు సరిపోవు. బిజెపి పాలిత రాష్ట్రమైన అసోంలో మహిళల పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. ఆరోగ్య సదుపాయాలు లేక ఎంతోమంది బాలింతలు మృత్యువాత పడుతున్నారు. ముక్కుపచ్చలారని బాలికల మెడలో తాళిబొట్లు వేలాడుతున్నాయి. మరెంతోమంది పసికందులు పోషకాహార లోపంతో అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతోమంది మహిళలకు అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) అండగా నిలబడుతోంది. వారి కోసం పోరాడుతోంది. ఇటీవల విజయవాడలోని కాంత్రి రెసిడెన్సీలో జరిగిన ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలకు అసోం ఐద్వా అధ్యక్షురాలు డాక్టర్ స్వర్ణలతా దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆ రాష్ట్రంలోని మహిళల పరిస్థితులపై ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా..
అసోంలో బాల్య వివాహాల రేటు ఎక్కువ ఎందుకు?
నిజమే. అసోంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి కొన్ని కమ్యూనిటీల్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. వీటికి ప్రధాన కారణం వారు చదువుకోకపోవడమే. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువ. పేద కుటుంబాలు, మైనార్టీలు, ముస్లింలు, గిరిజనుల కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు బాల్య వివాహాలు చేయడం లేదు. ఒకవేళ మైనార్టీలు, గిరిజనుల్లోనూ తల్లిదండ్రులు, పిల్లలు చదువుకుని ఉంటే బాల్య వివాహాలపై అవగాహన పెరిగి అవి తగ్గే అవకాశం ఉంది.
టీ తోటల్లో పనిచేసే మహిళల పరిస్థితి ఎలా ఉంది?
టీ తోటల్లో పనిచేసే మహిళలకు సరైన సదుపాయాలు ఉండవు. పొద్దున నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నా వారికి చాలా తక్కువ కూలీ ఇస్తారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నెలంతా కష్టపడినా ఐదువేల నుంచి ఏడువేల రూపాయలే వస్తాయి. ఆ డబ్బులతో వారి ఇంటి అవసరాలు తీరవు. వారి కూలీ పెంచాలని ఐద్వా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి పక్కా ఇళ్లు ఇవ్వాలని కూడా మేం డిమాండ్ చేస్తున్నాం. చిన్న పిల్లల తల్లులు ఆ తోటల్లోనే పాలిచ్చి పడుకోబెడతారు. ఈ తోటల్లో పనిచేయడానికి బెంగాల్, ఒడిశా నుంచి కూడా వస్తారు. వారి సంస్కృతి, భాష వేరు. అయినా ఎన్ని ఇబ్బందులున్నా ఆ తోటల్లో పనిచేస్తున్నారు. అయితే కొంతమంది ఎడ్యుకేటర్లు, పొలిటికల్ లీడర్లు టీ తోటల్లో పనిచేసేవారి జీవితం ఎంతో అద్భుతంగా ఉందని చెబుతుంటారు. నిజంగా వారి జీవితాల్లోకి తొంగిచూస్తే అన్ని సదుపాయాలతో, ఆర్థికంగా మెరుగ్గా లేరు. అష్టకష్టాలు పడుతున్నారు. అలాగే అసోం లేబర్ ఆర్గనైజేషన్ కూడా టీ తోటల్లో పనిచేసే కార్మికుల వేతనాలు, వారి జీవన పరిస్థితులు మెరుగుపడాలని చెబుతోంది.
అలాగే, అసోంలో ప్రసూతి మరణాలు ఎక్కువ. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఆసుపత్రి సౌకర్యం లేకపోవడమే. ఏ చిన్న సమస్యకైనా పట్టణాల్లోని ప్రయివేటు ఆసుపత్రులకు లేదా ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. దీంతో గర్భిణీ స్త్రీలకు సరైన వైద్యం దొరక్క ప్రసూతి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. చిన్న పిల్లల పట్ల ప్రభుత్వం తగినంత సంరక్షణ తీసుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్లే తల్లిదండ్రులకు పోషకాహార లోపంపై అవగాహన లేదు. దీంతో ఆ సమస్య ఎక్కువగానే ఉంది.
మహిళా సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి?
అరుణోదయ పథకం కింద నెలకు 1,250 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రాక్టికల్‌గా చాలామంది పేద మహిళలకు లబ్ధి చేకూరడం లేదు. బిజెపికి అనుకూలమైన వారికే ఇది అందుతుంది. ప్రయివేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలకు ఒక్కోసారి ఐదువేలు, ఆరువేలు, తొమ్మిదివేలు కూడా వారి ఖాతాల్లో వేశారు. ఆరెస్సెస్‌కు చెందిన శంకర్‌దీప్ విశ్వభారతి స్కూలులో పనిచేస్తున్న మహిళలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. పేద మహిళలందరికీ లబ్ధి చేకూర్చాలని ఐద్వా డిమాండ్ చేస్తోంది. బిజెపి కార్యకర్తలు మాపై పూర్తిగా నిఘా పెడతారు. అయినా మేము పోరాడతాం. టీ తోటల్లో పనిచేసే వందలాది మహిళలకు ఈ పథకం వర్తించాలని మేం కార్యాలయాలకు వెళ్లి డిమాండ్ చేస్తున్నాం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకు కోసమే, వారిని ఆకర్షించడానికే పథకాలను ప్రవేశపెట్టారు. ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను చైతన్యపరచడానికి, సంఘటితపరచడానికి ఐద్వా కృషి చేస్తోంది.
సంభాషణ : భవాని








కామెంట్‌లు (0)