గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశ్వాసం పేరుతో ఇబ్బందులెందుకు?

50 నిమిషాల క్రితం

ప్రతీకాత్మక చిత్రం.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని ఇడుక్కు పిళ్లయార్ ఆలయంలో ఇటీవల జరిగిన విషాద ఘటన ఇరుకు సందుల్లోంచి వెళ్లడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేసింది. అక్కడ సుమారు అడుగు వెడల్పు, రెండడుగుల ఎత్తు మాత్రమే ఉన్న సందులోంచి భక్తులు ఒరిగి పడుకున్నట్టుగా ప్రవేశించి, చేతులను ఆసరాగా చేసుకుంటూ నెమ్మదిగా బయటకు వస్తారు. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని వారు నమ్ముతారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఆ సందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో ఇలాంటి నమ్మకాల వెనుక దాగి ఉన్న ప్రమాదాలపై చర్చ జరుగుతోంది.

ఇరుకైన గుహ లేదా రాతి సందును దాటితే పాపాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని భావించడం పూర్తిగా మూఢనమ్మకం. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆకృతులకు మహత్యాలను ఆపాదించడం శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధం. సన్నగా ఉన్నవారు దీనిని ఒక సాహసంగా భావించవచ్చు. కానీ అధిక బరువున్నవారు, వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇలాంటి ప్రయత్నాలు ప్రాణాపాయంగా మారవచ్చు. ఒకసారి ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోతే ముందుకూ వెళ్లలేక, వెనక్కూ రాలేక తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీనినే వైద్యులు క్లాస్ట్రోఫోబియా లేదా పానిక్ ప్రతిచర్యగా పేర్కొంటారు. ఆ సమయంలో అడ్రినలిన్ పెరిగి గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, శ్వాస వేగవంతం కావడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో స్పృహ కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ ఒత్తిడి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్త అవసరం

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇరుకైన గుహలు, రాతి చీలికలు, సహజ సొరంగాలు ఉన్న అనేక ప్రదేశాలు ఉన్నాయి. శ్రీశైలం సమీపంలోని అక్కమహాదేవి గుహలు, యాగంటి గుహలు, అహోబిలం ఉగ్రస్తంభం మార్గం, కపిలతీర్థం నరసింహ గుహ, భైరవకోన గుహాలయాలు, బెలుం గుహలు, యాదాద్రి పాత గుహాలయం, పాండవుల గుట్ట వాటిలో ముఖ్యమైనవి. లోతైన గుహల్లో గాలి ప్రసరణ పరిమితంగా ఉండటం, ఒకేసారి ఎక్కువ మంది ప్రవేశించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరగడం, తేమ, చీకటి, జారుడు నేల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. గబ్బిలాల విసర్జన ఎక్కువగా పేరుకుపోయిన చోట అమోనియా వంటి వాయువులు విడుదలై శ్వాసకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

గుహలు, రాతి సందులు ప్రకృతి సృష్టించిన అద్భుతాలు. వాటిని సందర్శించవచ్చు, ప్రకృతి వైవిధ్యాన్ని ఆస్వాదించవచ్చు. కానీ మూఢనమ్మకాలతో లేదా ఇతరులను అనుకరించి ప్రమాదకరమైన ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. ముఖ్యంగా అధిక బరువు, గుండె జబ్బులు, రక్తపోటు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇలాంటి ఇరుకైన మార్గాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆలయ నిర్వాహకులు, అటవీ శాఖ, స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రకృతిని ఆస్వాదించాలి తప్ప, ప్రమాదాన్ని ఆహ్వానించరాదు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్