అంతం కాదిది ఆరంభం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు జులై 30, 31 తేదీల్లో యావత్తు కార్మిక వర్గం...నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, శాశ్వత పనుల్లో వున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని... కలెక్టరేట్ల వద్ద సమరశీల పోరాటానికి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నాయి. వారు అత్యధిక లాభాలు గడించేందుకు కార్మిక వర్గంతో బానిసలుగా పని చేయిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి కార్మికుల జీతాలు ఎక్కడా పెరగలేదు. కానీ ధరలు మాత్రం ఆకాశానికి అంటుతున్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ జీతాలు 50 శాతం పెంచుకున్నారు. పాపం వీరంతా పేదవారు! కానీ ప్రతి 5 సంవత్సరాలకు పెరగవలసిన జీతాలు పెంచకపోవడంతో కార్మికులు అతి తక్కువ జీతాలతో బండ చాకిరీ చేయవలసి వస్తున్నది. దీనిపై తాడో పేడో తేల్చుకోవడానికి కార్మికవర్గం సిద్ధమైంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో కార్మిక వర్గం కనీస వేతనాలు పెంచాలని కదం తొక్కుతున్నది. ఇప్పటి దాకా కనీస వేతనాల ఉసే ఎత్తని బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్, హర్యానాలతో సహా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కనీస వేతనాలను ఏకపక్షంగా ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే తెలంగాణలో 25 శాతం, కర్ణాటకలో కనీస వేతనం 60 శాతం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి. కానీ మన రాష్ట్రంలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వంగానీ, గత రెండు సంవత్సరాల నుంచి పాలిస్తున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంగానీ కష్టజీవులను పట్టించుకోవడం లేదు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సిజెపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు మహత్తర పోరాటం నడిపారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించారు. మోడీ మెడలు వంచారు. మోడీ ప్రభుత్వం జంతర్ మంతర్‌లో అనుసరించిన నిర్బంధాన్ని దేశ ప్రజలంతా ఖండించారు. దేశ ప్రధాన న్యాయమూర్తి యువకులను బొద్దింకలతో పోల్చినందుకు తగిన బుద్ధి చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. మొత్తం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడటమే దీనికి పరిష్కారం.
రాష్ట్ర ప్రభుత్వం అదానీ, అంబానీ, టాటా వగైరాలకు అడగకుండనే అనేక రాయితీలు ఇస్తున్నది. రూ.10 కోట్ల విలువ చేసే ఎకరా భూమిని 0.99 పైసలకే కట్టబెడుతున్నారు. ప్రజల దగ్గర యూనిట్ విద్యుత్‌కు 5 రూపాయలు వసూలు చేస్తూ కార్పొరేట్లకు యూనిట్ ఒక్క రూపాయికే ఇస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నారు. ధనవంతులకు రాయితీలు, ప్రజలకు భారాలు అన్న విధంగా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో లక్ష మంది పైగా అంగన్‌వాడీలు 42 రోజులు నిరవధిక సమ్మె పోరాటం జరిపినా ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. కనీస వేతనం రూ. 26 వేలు కార్మికుల హక్కు. కేంద్ర ప్రభుత్వం 7వ పే కమిషన్ ప్రకారం నేడు నెలకు రూ.30 వేలకు పైగా చెల్లించాలి. అప్పుడే ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులకు కనీస సౌకర్యాలు అందుతాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ)లో భారత ప్రభుత్వం అంగీకరించిన పద్ధతి ప్రకారం ఇది అమలు చేయాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కార్మిక చట్టాలను ఉల్లంఘించి నడమంత్రంగా నాటకాలు ఆడుతున్నాయి. అత్యధిక లాభాలు గడిస్తున్న ఆక్వా (రొయ్యలు), సిమెంట్, గార్మెంట్స్, మైనింగ్, పోర్టులు లాంటి అనేక రంగాల్లోనూ కార్మికుల జీతాలు నామమాత్రంగానైనా పెంచలేదు. మిగిలిన రంగాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. టాటా స్టీల్‌ప్లాంట్‌లో కనీస వేతనం నెలకు రూ. 9,500. అదానీ పోర్టులలో కనీస వేతనం నెలకు రూ. 9,000 మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు పెంచితే మేము పెంచుతాం అనే వాదనలు చేస్తున్నారు యజమానులు. కనీస వేతనాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులకు జీతాలు పెంచడానికి మొండిగా నిరాకరిస్తున్నది. పవన్ కల్యాణ్ మంత్రిగా ఉన్న పంచాయితీ కార్మికులకు 5 మాసాల నుండి జీతాలు చెల్లించటం లేదు. ఇలా అనేక రంగాల కార్మికులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. అన్ని రకాల కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. వీరికి జీతం తక్కువ. పని, పనిగంటలు ఎక్కువ. ఓటి ఉండదు. పి.ఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్, గ్రాట్యూటీ, ప్రసూతి సెలవులు లాంటి సౌకర్యాలు చట్టంలో ఉన్నా ఏవీ అమలు కావడం లేదు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పీస్ రేట్, క్యాజువల్ వగైరా పేర్లతో పని చేయిస్తున్నారు. పేరు ఏదైనా పర్మినెంట్ కాకపోతే కార్మికులను పని నుండి తొలగించడం తేలిక. అందుకే లేబర్ కోడ్స్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పేరుతో దేశంలో ఏ రంగంలోనూ పర్మినెంట్ ఉద్యోగులు ఉండరాదన్నది కేంద్ర ప్రభుత్వం తమ విధానంగా మార్చింది. ఇప్పుడు పని చేసే వారందరూ రిటైరయితే కొత్తవారందరూ టెంపరరీ కార్మికులుగా ఉంటారు. ఆర్మీలో అగ్నివీర్, బ్యాంకుల్లో అర్థపత్ పేర్లతో కొత్త వారిని పనిలో చేర్చుకుంటున్నారు. పర్మినెంట్ అయితే జీతాలు పెంచాలి. అందుకని పర్మినెంట్ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు విధానాలు అమలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో భారీ రంగాలైన విద్యుత్, ఆర్‌టిసి, మున్సిపల్ రంగాలను పూర్తిగా ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. విద్యుత్‌ను స్మార్ట్ మీటర్ల పేరుతోనూ, ఆర్‌టిసి ని విద్యుత్ బస్సుల పేరుతోనూ, మున్సిపల్ రంగాన్ని సేవలను ప్రైవేట్‌కు అప్పగించే పేరుతో రాష్ట్ర ప్రధాన రంగాలన్నిటినీ ప్రైవేటీకరించేందుకు టిడిపి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఈ ప్రైవేటీకరణ అగితేనే నేడు ఈ రంగాలో ఉన్న వేలాది పర్మినెంట్ ఉద్యోగాలు నిలబడతాయి. లేకుంటే రాష్ట్ర రంగాలన్నీ కాంట్రాక్ట్‌మయం అవుతాయి. కనీస వేతనాలు ఉండవు. రాష్ట్రంలో విశాఖ స్టీల్‌తో సహా అన్ని రంగాల్లో కార్మిక వర్గం ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. కనీస వేతనాల పెంపునకు పోరాడాలి. శాశ్వత పనుల్లో వున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేసే వరకు మన పోరాటాలు కొనసాగాలి.
కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి...అనే ఉద్యమానికి ఇది తొలి అడుగు మాత్రమే. ఈ ఉద్యమం కార్మికులకు కనీస వేతనాలు పెంచేవరకు సాగుతుంది. నాన్ పర్మినెంట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసే వరకు మన పోరాటం అగదు. గతంలో రైతాంగ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం చవిచూసింది. నేడు అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా... జంతర్ మంతర్ సాక్షిగా దేశంలోని యువతీ యువకులు చేసిన పోరాటాన్ని... కేంద్ర ప్రభుత్వం చవిచూడవలసి వచ్చింది. కార్మిక వర్గం అత్యంత చైతన్యవంతమైన వర్గం. కార్మిక వర్గ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. లేకుంటే ఈ ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చక తప్పదు.

వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. నరసింగరావు







కామెంట్‌లు (0)