షర్మిలా ధన్‌కర్ కామన్వెల్త్ గేమ్స్‌లో షాట్‌పుట్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి భారత పారా అథ్లెట్. నలభై ఏళ్ల వయసులో బరిలోకి దిగి, ఇరవై ఏళ్లుగా భారత్ ఎదురుచూస్తున్న స్వర్ణాన్ని సాధించింది. చిన్నప్పుడే పోలియో బారినపడినా, జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగింది. చివరకు తన చేతిలోని ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించింది.
1986 ఆగస్టు 15న హర్యానాలోని చిత్రౌలి గ్రామంలో జన్మించిన షర్మిలాకు రెండేళ్ల వయసులో పోలియో సోకింది. దీంతో ఎడమ కాలు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న రైతు కుటుంబానికి చెందిన ఆమె తండ్రికి మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో కర్రల సాయంతోనే నడవాల్సి వచ్చింది. తల్లికి కూడా కంటి చూపు సరిగా లేకపోవడంతో కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఆమె జీవితంలో అసలు పరీక్షలు వివాహం తర్వాతే మొదలయ్యాయి. 19 ఏళ్ల వయసులోనే షర్మిలాకు వివాహమైంది. ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చిన తర్వాత ఆడపిల్లలే పుట్టారంటూ అదనపు కట్నం కోసం అత్తింటివారు, భర్త వేధింపులకు గురిచేశారు. భర్త మద్యానికి, తర్వాత మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణతో పాటు పొలం పనులు, పశువుల సంరక్షణ కూడా ఆమె భుజాలపైనే ఉండేది.
కామన్వెల్త్‌లో స్వర్ణ పతకం గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన షర్మిలా తన జీవితంలోని అత్యంత విషాదకర ఘట్టాలను గుర్తుచేసుకుంది. "కట్నం కోసం నా మొదటి భర్త నన్ను తీవ్రంగా వేధించాడు. గృహహింసకు గురిచేశాడు. ఒకరోజు వీధిలో కొడుతూ బట్టలు ఊడదీసి అవమానించాడు. ఆ సమయంలో ఇరుగుపొరుగువారు వచ్చి నాపై దుప్పటి కప్పి రక్షించారు. ఇద్దరు పిల్లలతో నన్ను ఇంటి నుంచి గెంటేశారు. అప్పుడు మా తల్లిదండ్రులు నన్ను, నా పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను మళ్లీ ఆ ఇంటి గడప తొక్కలేదు" అని ఆమె చెప్పారు.
విజయానికి తోడైన రెండో భర్త
మొదటి వివాహ బంధం ముగిసిన తర్వాత 2018లో షర్మిలా అజిత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. సబ్‌మర్సిబుల్ పంపుల టెక్నీషియన్‌గా పనిచేసే అజిత్, భార్యలోని ప్రతిభను గుర్తించి క్రీడలవైపు ప్రోత్సహించారు. "షర్మిలా జీవితంలో చాలానే బాధలు చూసింది. ఇకపై ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నాను. ఆటలంటే ఆమెకు ఎంతో ఇష్టం. అందుకే కుటుంబం మొత్తాన్ని రేవారికి మార్చి శిక్షణ పొందేలా చేశాను" అని ఆయన తెలిపారు. మొదట ఆమెను కబడ్డీ వైపు ప్రోత్సహించిన అజిత్, తర్వాత 2018 ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతక విజేత టెక్‌చంద్ వద్ద శిక్షణ ఇప్పించారు. ఆయన మార్గదర్శకత్వంలో షర్మిలా షాట్‌పుట్‌లో మెళకువలు నేర్చుకుంది. ఆ శ్రమ ఫలితంగా 2021 పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం గెలుచుకుంది. 2022 బర్మింగ్‌హామ్ పారా కామన్వెల్త్ గేమ్స్, 2023 హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లలో ఆమె నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఓటములను విజయానికి సోపానాలుగా మలుచుకుంటూ సాధన కొనసాగించింది.
ఇంటిని అమ్మి ...
క్రీడల్లో రాణిస్తున్నా ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. శిక్షణ, పోటీల ఖర్చుల కోసం భర్త రేవారిలోని ఇంటిని అమ్మేశాడు. తల్లి కూడా కొంత భూమి విక్రయించి ఆమెకు తోడుగా నిలిచింది. ఇదే సమయంలో తండ్రి మరణం షర్మిలాను తీవ్రంగా కలిచివేసింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరకు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వద్దే ఆ కుటుంబ కల ఆగిపోలేదు. ఇద్దరు కుమార్తెలు అంజు, లక్ష్మి కూడా క్రీడల్లో రాణించేందుకు సిద్ధమవుతున్నారు. "నేను 33 ఏళ్ల వయసులో క్రీడల్లోకి వచ్చాను. నా ఇద్దరు కూతుళ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నాను. ఒకరోజు మేం ముగ్గురం కలిసి భారత్‌కు ప్రాతినిధ్యం వహించే రోజు రావాలి" అని షర్మిలా ఆశాభావం వ్యక్తం చేశారు. "క్రీడలు నాకు పునర్జన్మను ఇచ్చాయి. పతకాలు సాధించిన తర్వాత మళ్లీ ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను" అని ఆమె చెప్పారు. వచ్చే లక్ష్యంగా ఆసియా క్రీడలను పెట్టుకున్న షర్మిలా... మరోసారి భారత్‌కు బంగారు పతకం అందించాలని కఠోర సాధన కొనసాగిస్తున్నారు.







కామెంట్‌లు (0)