గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతమ దాకా వస్తే గానీ...

1 గంట క్రితం

modi meta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

భావ ప్రకటనా స్వేచ్ఛ, విమర్శనా స్వేచ్ఛతో వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం ఏలినవారికి ఏమాత్రం గిట్టదు కదా. అందుకోసం టాస్క్‌ ‌ఫోర్స్‌‌లే పెట్టిస్తామని బెదిరిస్తారు. ఇప్పుడైతే గనక ఫేక్‌ ‌న్యూస్‌‌ను అర క్షణంలో పసిగట్టే పని కోసం ప్రత్యేకంగా కార్యదర్శులను నియమించాలని యోచిస్తున్నారట.ఈ విషయమై ఎన్ని కేసులు వేశారో, ఎందరికి ముందస్తు శిక్షలే విధించారో లెక్క లేదు. అయితే అదే తమ దగ్గరకు వస్తే వేరే అంటున్నారు. అసలే రోజుకు మూడున్నర నుంచి నాలుగ్గంటలు మాత్రమే నిద్రపోయే మోడీజీకి ఆ నిద్ర కూడా లేకుండా చేసిన బొద్దింకలపై ఆయన అర్ధర్రాతి నిద్ర మానుకుని మరీ వీడియోలు విడుదల చేశారు. ఒకటి, రెండు కాదు. ఏకంగా మూడు రోజులు ఈ పరంపర కొనసాగింది.బొద్దింకల యుద్ధభేరి విజయానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుంది? కానైతే పాపం ఈ మూడింటిలో ఆఖరిదైన తాజా సెల్ఫీ వీడియోను ఫేస్‌‌బుక్‌ ‌పక్కన పెట్దిందట.ఎందుకో ఉదయాన్నే అది కనిపించలేదు. ఇంకేముంది?మీకు దేశంలో ఇంత విస్తార ప్రసార హక్కులు కల్పిస్తే మా ప్రధానమంత్రి వీడియోనే ఆపుతారా అని ఆగ్రహంతో చిందులు తొక్కుతున్నది కేంద్రం. ఏదో పొరబాటు జరిగిందని 'మెటా'సంజాయిషీ ఇచ్చినా టట్‌ ‌వీల్లేదంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నది. ఇంతకూ ఎందుకిలా జరిగిందంటే...దర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా తర్వాత జంతర్‌ ‌మంతర్‌ ‌నిరసన పోస్టులన్నీ తొలగించాలని సర్కారే ఆదేశించింది.ఆ ముక్క చెప్పేసరికి ఎ.ఐ వారు రెచ్చిపోయి అన్నీ తీసేస్తూ వచ్చారు.వాటికి మోడీ అయినా ఒకటే కదా.అదీ తీసేశాయి. 'మెటా'యాజమాన్యం ఈ విషయం గుర్తించేలోగా గగ్గోలు మొదలైంది.మరి ఎన్ని విమర్శల విషయంలో ఇలా ఎన్ని వేల సార్లు జరగలేదు సార్‌?అంతెందుకు?ఈ తరుణంలోనే హై వే మంత్రి నితిన్ గడ్కరీ కోసమే ఇధనాల్‌ ‌మిక్సింగు విధానమన్న పోస్టులను తొలగించాలని కోర్టులను కోరుతున్నారు. ఓకె అంటున్నారు. అందుకే చెప్పేది మనకు మ్రాతం స్వేచ్ఛ, దానికే రక్ష. తస్మదీయులకైతే అనవసరంగానే శిక్ష. ఏమంటారు?

అర్జున బాణం మళ్లీ గురి తప్పిందా?

'తగ్గేదే లే'వంటి డైలాగులతో పాన్‌ ఇండియా స్టార్‌గా వెలిగిపోతున్న అల్లు అర్జున్‌ ‌ మాట్లాడితే చాలు ఏదో వివాదం అనివార్యంగా వెంటాడుతుంటుంది. ‘పుష్ప2’ సందర్భంలో తొక్కిసలాట వంటివి సరేసరి. 'మెగా' ఫ్యామిలీపై పరోక్షంగా ఆయన వాగ్బాణాలు సంధిస్తారనే ప్రచారం సాగుతూనే వుంటుంది. ఒకే పరిశ్రమ, పరిమిత అవకాశాలు గనక పోటీలుంటాయని ఆయన తండ్రి అరవింద్‌ ‌చెబుతున్నా ఈ గ్యాసిప్స్‌ ఆగేవీ కావు. వాళ్ల రేంజ్‌ ‌కూడా అంతే వుంటుంది. ఈ రోజే చూడండి. దేశంలోనే మొదటిసారిగా అల్లు థియేటర్లలో ఒక అంతర్జాతీయ హాలీవుడ్‌ ‌సినిమా ప్రివ్యూ ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో విస్తరించుకుంటూ పోతున్నారు అల్లు వారసులు. అయితే అల్లు అర్జున్‌ ‌మాటలపై వివాదం అందుకోసం కాదు.ఏదో ఒక పంచ్‌ ఇస్తుంటారు తను. నిన్న ప్రత్యేకంగా ఫాన్స్‌ ‌సమావేశం జరిపి సందేశమిచ్చారు. మీకు నచ్చిన వారిని మెచ్చుకోండి. కానీ నచ్చనివారు మనను ఏదో అన్నారని రెచ్చిపోయి నెగిటివ్‌ ‌చేయకండి. నచ్చనివారి కోసం ఏమ్రాతం ఒక్క సెకండు కూడా వెచ్చించకండి అని సలహా ఇచ్చారు. అంతటితో ఆగివుంటే అదో తీరు. మీకు సమయం వుంటే ఇష్టమైన అమ్మాయి ఇంటి ముందు వెయిట్‌ ‌చేయండి అని కూడా యాడ్‌ ‌చేశారు. నచ్చిన వారికోసం నిరీక్షించడం ఎలాగైనా జరుగుతుంది.కానీ ఇక్కడ సమస్య ఇంటి ముందు నిలుచోవడమే. అసలే వన్‌‌ వే ట్రాఫిక్‌ విపరీతాలు పెరిగిపోతుంటే ఇదేం సలహా అని చాలామంది వ్యాఖ్యలు చేశారు.నచ్చారు గనక వారి ఇంటి ముందు వెళ్లి నిలుచుంటామంటే ఎలా కుదురుతుంది? ఎలా చెల్లుతుంది?

కంగనా కుళ్లు మాటలు

కంగనా రనౌత్‌ ఓవరాక్షన్‌,మోడీ మెప్పు కోసం వికృత వ్యాఖ్యల గురించి కొత్తగా చెప్పేదేముంది? కానీ వారు కూడా భరించలేని స్థాయిలో ఆమె దుర్గంధం కుమ్మరించారు. అది కూడా జెన్‌ ‌జీ అనే కొత్త తరాల పైన.బొద్దింకలపై కంగనా గలీజు డైలాగులు కంపరం పుట్టించాయి. వీరు ఎవరికి పుట్టారు? ఏ మురికి కాలువలో పుట్టారు? వీళ్లు కొత్త తరం ప్రతినిధులా అని ఆమె చెలరేగిపోయారు. దానిపై వళ్లు మండిన సిజెపి ప్రతినిధి సౌరవ్‌‌ దాస్‌ ఆమెను వాళ్ల పార్టీ వారే పట్టించుకోరు. మేము ఖాతరు చేసేదేంటని తీసిపారేశారు. ఎంపీ అయితే ఇంత కష్టపడాల్సి వస్తుందని తెలియదని తన నియోజకవర్గ పర్యటనలో కంగనా చేసిన కామెంట్‌‌ను ఉదహరిస్తూ ఇలాంటి మనిషిపై మేం మాట్లాడేదేమిటని ముక్తాయించారు. ఇదంతా తట్టుకోలేక మేడమ్‌ ‌మళ్లీ మరో పోస్టు పెట్టారు. ఏమంటే నేను ఇప్పటికే రెండు సార్లు నటిగా జాతీయ అవార్డు పొందాను. మరి ఈ సౌరవ్‌ ‌దాస్‌ ‌వయస్సు 28 ఏళ్లు కదా. ఏ విధంగా ఆయన స్టూడెంటు, ఏం సాధించారని కొత్త సవాళ్లు ఎత్తుకున్నారు?అని. సమస్యేమంటే వడ్డించే వారు తమ వారైతే ఆఖరి బంతైనా పర్వాలేదని బిజెపి ఆశీస్సులున్న కంగన వంటి వారికి పురస్కారాలకేం లోటు? ఈ సారి జాతీయ అవార్డుల తంతు చూడలేదా. కనక గొప్పలు మాని తప్పు మాటలు దిద్దుకోవడం బెటర్‌ ‌కంగనా.

మరాఠీ భేటీల జోరు

సరిగ్గా పది గంటలకు వీడు వాడికి ఫోన్‌ ‌చేస్తాడు. పదిన్నరకు వాడు వీడికి ఫోన్‌ ‌చేస్తాడు. ఇలా లిస్టు చెప్తాడు ఖాన్‌‌ దాదా ‘మనీ’ సినిమాలో. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్‌‌సిపి అనే నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల పరిస్థితి అలాగే వుంది. మొన్న శరద్‌‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేతో సాక్షాత్తూ ప్రధాని మోడీని కలిసి వచ్చారు. తర్వాత అవతలి వర్గం నేత ప్రఫుల్‌ ‌పటేల్‌, పార్థ్ పవార్‌ ఈ వృద్ధనేతను కలిశారు.

అదయ్యాక అదే వర్గం ఎంపీ సునీల్‌ ‌థాకరే అమిత్‌ ‌షాను కలిశారు. ముందు మీ రెండు వర్గాలు కలిసి ఒకటైతే తర్వాత మీరు ఎన్‌‌డిఎ లో కలవొచ్చు అని బిజెపి నేతలు చెప్పారట. కానీ ఈ లోగానే మేము కలిసిపోతే మాకు ఎవరెవరికి ఏ పదవులు వచ్చేది తెలియాలి కదా అని పవార్‌‌లు వరుసగా వెంట పడుతున్నారట. నియోజక వర్గాల పునర్విభజనకు సుప్రియ మద్దతు తెలిపాక లోలోపల అటూ ఇటూ మార్పులు చేర్పులతో ఏదో జరిగిపోతుందనే పరిశీలకులు అనుకుంటున్నారు. చనిపోయిన అజిత్‌ ‌పవార్‌ ‌భార్య, ఉప ముఖ్యమంత్రి సునేత్ర, కుమారుడు ఫార్థ మొదట వ్యతిరేకంగా వున్నా నెమ్మదిగా కలిస్తేనే మంచిదని అంచనాకు వచ్చారట. ఎవరు ఎవరితో కలుస్తారనేదానికన్నా ఎందుకు కలుస్తున్నారనేది కీలకం. లౌకిక వాదాన్ని వదలి బిజెపికి జై కొడితే ఎవరైనా ఎలా హర్షిస్తారు? ఇవన్నీ ఊహాగానాలేనని శరద్‌ ‌పవార్‌ కొట్టిపారేస్తుసున్నాకానీ గతంలో పిల్లిమొగ్గలు చూసినవారు మాత్రం ఏదైనా సంభవమేనంటున్నారు.


-పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్