గురువారం, 30 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఐఐటి చదువులు కావాలంటే గురుకుల పాఠశాలలు మూసివేయాలా?

1 గంట క్రితం

gurukula patasala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 05:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

శతాబ్దాల పాటు విద్యకు దూరం చేయబడిన దళిత పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం స్వతంత్ర భారతదేశం ముందున్న ప్రధాన బాధ్యతగా మారింది. అందులో భాగంగానే ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను విస్తరించాయి. పేదరికం, అంటరానితనం, సామాజిక వివక్ష మధ్య పెరిగిన వేలాది మంది దళిత బాలబాలికలకు గురుకుల పాఠశాలలు ఆశాకిరణాలుగా నిలిచాయి. ఇవి కేవలం పాఠశాలలు కాదు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, రాజ్యాంగ విలువలకు ప్రతీకలు.

అలాంటి చరిత్ర కలిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం జిఒ జారీ చేసి మూసివేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం. తాడికొండ, కోట, మేఘాద్రి గెడ్డ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నడుస్తున్న గురుకుల పాఠశాలలను మూసివేసి, అక్కడ చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించి, ఆ ప్రాంగణాల్లో ఐఐటి–జెఇఇ శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం విద్యా విధానంలో మార్పు మాత్రమే కాదు. దళిత విద్యా హక్కులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

దేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల ప్రాతినిధ్యం పెరగాలి. వారు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, సివిల్ సర్వెంట్లు కావాలి. కానీ ఆ లక్ష్యాన్ని సాధించే పేరుతో వేలాది మంది పిల్లలకు విద్య అందిస్తున్న గురుకుల పాఠశాలలను మూసివేయడం అభివృద్ధి కాదు. అది అవకాశాల కుదింపు. ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే, ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థలను ఎందుకు బలి చేయాలి? కొత్తగా భవనాలు నిర్మించి, కొత్త సిబ్బందిని నియమించి, ప్రతి జిల్లాలో ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు?

ప్రభుత్వం చేయాల్సింది పాఠశాలలను మూసివేయడం కాదు. గురుకులాలను మరింత బలోపేతం చేయడం, సీట్లను పెంచడం, ఉపాధ్యాయులను నియమించడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడం. అదే సమయంలో ఐఐటి, నీట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించే ఎక్సలెన్స్ సెంటర్లను అదనంగా ప్రారంభించడం. కానీ ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇది ప్రభుత్వ విద్యా బాధ్యతను తగ్గించి, కొద్దిమందికే పరిమితమైన నమూనాను ప్రోత్సహించే విధానంగా కనిపిస్తోంది.

గురుకుల పాఠశాల అంటే కేవలం ఒక భవనం కాదు. అది వేలాది మంది పేద దళిత కుటుంబాల ఆశ. అక్కడ చదివి ఎంతోమంది వైద్యులు, ఇంజనీర్లు, అధ్యాపకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సమాజానికి సేవ చేస్తున్నారు. అలాంటి విద్యాసంస్థలను మూసివేయడం అంటే దళిత సమాజం ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న విద్యా వారసత్వాన్ని బలహీనపరచడమే.

భారత రాజ్యాంగం సమాన అవకాశాలను కల్పించమని ప్రభుత్వాలకు ఆదేశిస్తుంది. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన ప్రభుత్వం, ఇప్పటికే ఉన్న విద్యావకాశాలను తగ్గించడం ద్వారా ఏ సందేశం ఇస్తోంది?

ఈ రోజు మూసివేయబడింది మూడు పాఠశాలలే కావచ్చు. కానీ ఇదే విధానం కొనసాగితే రేపు మరెన్ని గురుకుల పాఠశాలలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటాయోననే ఆందోళన కలగడం సహజం. అందుకే ఈ నిర్ణయాన్ని కేవలం మూడు పాఠశాలల సమస్యగా చూడలేం. ఇది ప్రభుత్వ విద్యా భవిష్యత్తుకు, దళిత పిల్లల విద్యా హక్కుకు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతకు సంబంధించిన అంశం.

​ప్రభుత్వం నిజంగా దళిత పిల్లలను ఐఐటీలకు పంపాలనుకుంటే గురుకులాలను మూసివేయకుండా, ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. గురుకుల విద్యను మరింత విస్తరించాలి. ఒక విద్యార్థి అవకాశాన్ని పెంచడానికి మరో విద్యార్థి అవకాశాన్ని హరించే విధానాన్ని విడనాడాలి.

​ చదువు కేవలం విద్యకు సంబంధించిన అంశం కాదు. అది సామాజిక న్యాయానికి, రాజ్యాంగ విలువలకు, భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన అంశం.

Andra

​- అండ్ర మాల్యాద్రి

కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

సెల్ : 9490300366


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్