జంతర్ మంతర్‌లో విద్యార్థి–యువజన ఉద్యమం ముందు మోకరిల్లిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన విద్యార్థి నాయకులపై మాత్రం ప్రతీకార చర్యలను కొనసాగిస్తోంది. ఉద్యమంలో ముఖ్య పాత్ర నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ఢిల్లీ పోలీసులు చేసిన కుట్రే దీనికి నిదర్శనం. సిపిఎం కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు మంగళవారం వచ్చిన పోలీసులు ఐషీని బలవంతంగా అదుపులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పార్టీ నాయకుల, కార్యకర్తల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సందర్భంగా సిపిఎం ఎం.పి జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నలకు పోలీస్ అధికారులు జవాబు ఇవ్వలేక తడబడిన తీరును దేశమంతా చూసింది. ఒక జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి బలవంతంగా చొరబడిన ఢిల్లీ పోలీసుల చర్య ప్రజాస్వామ్య సూత్రాలను ధిక్కరించడమే! ఉద్యమకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ చర్య బహిరంగంగా ఉల్లంఘించింది. అంతకన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఉద్యమంలో పాల్గొన్నందుకు విద్యార్థులపై చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించిన మరునాడే ఈ ప్రయత్నం జరగడం! 2021లో బంగ భవన్‌కు నిర్వహించిన మార్చ్ సందర్భంగా ఐషీ ఘోష్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏప్రిల్‌లో పటియాలా హౌస్ కోర్టులో విచారణ జరిగినప్పుడు ఆమె హాజరు కాలేకపోయారు. దీంతో కోర్టు జారీ చేసిన వారెంట్‌ను ఇప్పుడు అమలు చేయాలని పోలీసులు ప్రయత్నించారు. నిజానికి ఈ కేసుపై విచారణ నేడు (గురువారం) జరగాల్సి ఉంది. ఆ విచారణకు ముందే వారెంట్ అమలు చేయాలని తొందరపడటం వెనుక రాజకీయ కక్ష సాధింపు తప్ప మరో ఉద్దేశం కనిపించడం లేదు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజి, ఐషీలపై విచారణ జరపాలని ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్ ప్రచురించిన వెంటనే పోలీసులు ఎకెజి భవన్‌కు చేరుకోవడంతో వారిని నడిపిస్తున్నదెవరో స్పష్టమవుతోంది. జంతర్ మంతర్ ఉద్యమం సహా గత మూడు నెలలుగా ఐషీ ఘోష్ ఢిల్లీ పోలీసుల కళ్ల ముందే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒక్కసారిగా హడావుడి చేయడం కూడా అదే అనుమానాలను బలపరుస్తోంది. సంఘ్ పరివార్‌కు ఐషీ ఘోష్ లక్ష్యంగా మారడం ఇదే మొదటి సారి కాదు. 2020లో జెఎన్‌యు క్యాంపస్‌లోకి చొరబడిన సంఘ్ పరివార్ దుండగులు దాడి చేసి ఆమె తలపై తీవ్రంగా గాయపరిచారు. ఆమె చేయి కూడా విరిగింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఐషీ ఘోష్ పైనే అప్పట్లో పోలీసులు కేసు బనాయించారు. పోలీసుల నిరంతర వేధింపులు, నిఘాకు వ్యతిరేకంగా ఐషీ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉంది. ఆ కేసును ఉపసంహరించుకోవాలని కూడా పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజా సంఘటన సమయంలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్‌లో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులు, ప్రభుత్వ వైఖరి కారణంగా వరుసగా పార్లమెంటు స్థంభిస్తోంది. అదే సమయంలో ఆందోళనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధ హక్కు అని పునరుద్ఘాటించిన న్యాయస్థానం, నిరసన చేశారనే కారణంతో లాఠీచార్జీని సమర్థించలేమని స్పష్టం చేసింది. పోలీసుల చర్యలపై ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరగాలని, ఉద్యమకారులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. నిర్బంధంలో ఉన్న 18 ఏళ్ల లోపు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, వారి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయరాదని సూచించింది. అయితే, ఇవేమీ కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం హామీ ఇచ్చిన ప్రాథమిక పౌరహక్కులను మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తుంగలోకి తొక్కుతోంది. శాంతి యుతంగా సమావేశం కావడం, నిరసన తెలపడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు.
రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల మోడీ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఒకవైపు, పార్లమెంటు చర్చలు మరోవైపు సాగుతున్న వేళ కూడా ఉద్యమ నాయకులపై కక్ష సాధింపు చర్యలను కొనసాగించడం అధికార అహంకారానికే నిదర్శనం. అణచివేతతోనూ, బెదిరింపులతోనూ ప్రజాస్వామ్యంలోని భిన్న స్వరాలను మూగబోయేలా చేయవచ్చనే భ్రమను సంఘ్ పరివార్, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. లాఠీలు, తుపాకులు, జైళ్లను చూపించి భయపెట్టే పాలన ఎల్లకాలం సాగదు. అటువంటి అహంకార పూరిత చర్యలను ప్రజలు ఐక్యంగా తిప్పికొడతారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద జెన్ జెడ్ నిర్వహించిన పోరాటంలోని సందేశం కూడా అదే! ఈ స్ఫూర్తిని మొత్తం పౌరసమాజం అందిపుచ్చుకోవాలి.







కామెంట్‌లు (0)