ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఎన్నికల వ్యవస్థలోని పరిణామాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త వృందా గ్రోవర్. మహిళలపై శారీరక, మానసిక, మౌఖిక, లైంగిక, ఆర్థిక హింస, మతహింస బాధితులకు న్యాయం, పోలీసు కస్టడీలో హింస, ఆదివాసీల హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణ వంటి అనేక అంశాలపై మూడు దశాబ్దాలకు పైగా ఆమె పోరాడుతున్నారు. కోర్టుల్లో బాధితుల తరఫున వాదించడమే కాకుండా, చట్టాల రూపకల్పన, సవరణలు, వాటి అమలులోనూ భాగస్వామ్యమయ్యారు. న్యాయవ్యవస్థ బాధితుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు కృషి చేశారు. 2013లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వందమందిలో ఒకరిగా టైమ్ మ్యాగజైన్ ఆమెను గుర్తించింది.
1964లో జన్మించిన వృందా గ్రోవర్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చరిత్రను అభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య పూర్తి చేసి, అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1984లో సిక్కులపై జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు, విచారణలోని లోపాలను వెలుగులోకి తీసుకురావడానికి వృందా గ్రోవర్ కృషి చేశారు. 1987 హషింపురా ఊచకోత కేసులో బాధితుల తరఫున న్యాయపరమైన ప్రయత్నాల్లో భాగమయ్యారు. ఈ ఘటనలో అదుపులోకి తీసుకున్న ముస్లిం పురుషులను ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సిబ్బంది కాల్చిచంపారు. దశాబ్దాల తర్వాత 2018లో ఢిల్లీ హైకోర్టు 16 మంది మాజీ పోలీసు సిబ్బందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఒడిశాలోని కంధమాల్‌లో క్రైస్తవులపై జరిగిన హింస, ముజఫర్‌నగర్ హింసాకాండ అనంతరం లైంగిక దాడులకు గురైన మహిళలకు న్యాయసహాయం అందించడం వంటి అంశాల్లోనూ ఆమె పనిచేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఆదివాసీలపై హింస, అక్రమ నిర్బంధాలు, విచారణ పూర్తికాకుండానే జైళ్లలో మగ్గుతున్న ఖైదీల పరిస్థితులపై ఆమె అధ్యయనం చేశారు. 'ది ఆదివాసీ అండర్‌ట్రయల్ – ఎ ప్రిజనర్ ఆఫ్ వార్' పేరుతో వెలువడిన పరిశోధనలో భద్రత పేరుతో చేపట్టే చర్యలు స్థానిక ప్రజల హక్కులపై చూపుతున్న ప్రభావాన్ని పరిశీలించారు. ఆదివాసీ హక్కుల కార్యకర్త సోనీ సోరీకి సంబంధించిన కస్టడీ హింస ఆరోపణల కేసులోనూ న్యాయపరంగా సహకరించారు. వ్యక్తిగత కేసులకే పరిమితం కాకుండా, సామాజిక పరిస్థితులు, పోలీసు వ్యవస్థ, న్యాయప్రక్రియల మధ్య సంబంధాలను అధ్యయనం చేసి ప్రజల ముందుకు తీసుకురావడం ఆమె కృషిలోని ప్రత్యేకత.
మహిళల హక్కుల కోసం...
2012లో ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన అనంతరం ఏర్పాటైన జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీకి లైంగిక హింసకు సంబంధించిన చట్టాలపై సూచనలు అందించినవారిలో వృందా గ్రోవర్ ఒకరు. 2013లో క్రిమినల్ చట్టాల్లో మార్పుల రూపకల్పనలో ఆమె భాగస్వామ్యమయ్యారు. మహిళలపై శారీరక, మానసిక, మౌఖిక, లైంగిక, ఆర్థిక వేధింపులను నిరోధించేందుకు చట్టాలు సమర్థంగా అమలుకావాలని ఆమె వాదించారు. పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో చట్టం రూపకల్పనలోనూ ఆమె పాత్ర ఉంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి చట్టాల రూపకల్పన, అమలుపై ఆమె పనిచేశారు. లైంగిక దాడి బాధితులను అవమానించే 'టూ ఫింగర్ టెస్ట్'ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరీక్షకు శాస్త్రీయ ఆధారం లేదని, బాధితుల గౌరవానికి భంగం కలిగిస్తుందని న్యాయవాదులు, మహిళా హక్కుల సంఘాలు చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచారు. 2013లో 'లిల్లూ వర్సెస్ హర్యానా స్టేట్' కేసులో సుప్రీంకోర్టు ఈ పరీక్షను తప్పుబట్టింది. 2022లోనూ దీనిపై తన వైఖరిని పునరుద్ఘాటించింది. సాక్షులు భయపడకుండా వాంగ్మూలం ఇచ్చే వాతావరణం, పిల్లలు, లైంగిక హింస బాధితుల గోప్యత, కస్టడీలో హింస నిరోధం వంటి అంశాలపైనా ఆమె పనిచేశారు.
వివాహమైనంత మాత్రాన మహిళ శరీరంపై ఆమెకున్న స్వతంత్ర హక్కులు తొలగిపోవని, సమ్మతి, శారీరక స్వాతంత్ర్యం మహిళల హక్కుల్లో భాగమని వృందా గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై హింస కొనసాగడానికి పితృస్వామ్య సంస్కృతి, లింగ అసమానతలు కారణం. కూతుళ్లు మెట్టినింట్లో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు, ఆస్తులను కొందరు అత్తింటివారు వేధింపులకు సాధనంగా మార్చుకుంటున్నారు. బాధితులు పోలీసులను, కోర్టులను ఆశ్రయించినా వాయిదాలు, కేసుల పెండింగ్, న్యాయవ్యవస్థలోని లింగ వివక్ష కారణంగా త్వరగా న్యాయం పొందలేకపోతున్నారు. చట్టాలు, కోర్టు తీర్పులతోపాటు రాజకీయ నాయకత్వం, సమాజంలోనూ మార్పు రావాలి.’’ అని వృందా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ గుర్తింపు
వృందా గ్రోవర్ కృషి భారతదేశానికే పరిమితం కాలేదు. 2018లో లండన్‌లోని SOAS విశ్వవిద్యాలయం మానవ హక్కులు, పౌర స్వేచ్ఛల రంగంలో ఆమె చేసిన కృషికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2023లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అధ్యక్షుడు ఆమెను ఉక్రెయిన్‌పై స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ సభ్యురాలిగా నియమించారు. యుద్ధం నేపథ్యంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ మానవతా చట్ట ఉల్లంఘనలపై ఆధారాలను పరిశీలించడం ఈ కమిషన్ బాధ్యత. మానవ హక్కుల అంతర్జాతీయ సంస్థ 'ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ హ్యూమన్ రైట్స్' బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా ఆమె పనిచేశారు. చట్టం కేవలం అధికార వ్యవస్థకు సాధనంగా కాకుండా, అధికారాన్ని ప్రశ్నించడానికి, బాధితులకు న్యాయం అందించడానికి, రాజ్యాంగ హక్కులను కాపాడడానికి ఉపయోగపడాలన్నదే వృందా గ్రోవర్ న్యాయపోరాటంలోని ప్రధాన సూత్రం. మహిళలు, ఆదివాసీలు, మతహింస బాధితులు, అణచివేతకు గురైన వర్గాల హక్కుల కోసం ఆమె సాగిస్తున్న పోరాటం న్యాయం, సమానత్వం, పౌర స్వేచ్ఛల పరిరక్షణలో చట్టం పాత్రను గుర్తు చేస్తోంది.






కామెంట్లు (0)