శాంతియుతంగా పోరాడుతున్న యువతపై పోలీసులు లాఠీలు విరిచారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఊపిరాడనివ్వకుండా భాష్ప వాయువులు వెదజల్లారు. ఆ విద్యార్థుల్లో ఎదురుతిరిగిన వారు కొందరైతే, భయంతో పరుగులు తీసిన వారు మరికొందరు. ఈ పరిణామంతో విద్యార్థులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షా శిబిరం ఖాళీ చేస్తారని ప్రభుత్వ పెద్దలు ఆశించారు. కానీ అలా జరగలేదు. 24 గంటలు కూడా కాకముందే వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. ఈసారి గాయాలతో దెబ్బతిన్న వాళ్లతో పాటు, వాళ్ల తోబుట్టువులు, సహ విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్న దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడికి వచ్చిన విద్యార్థులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రశ్నించిన తీరు సర్వత్రా చర్చనీయాంశం.
పోలీసులు కొట్టిన దెబ్బలతో గాయాలపాలైన నీట్ విద్యార్థి ఒకరు 'నేను 18 ఏళ్లప్పుడు నీట్‌కు సిద్ధమయ్యాను. అప్పుడు బిజెపి ప్రభుత్వంపై చాలా నమ్మకం ఉండేది. విద్యార్థులకు మేలు చేసే పార్టీగా బిజెపిని నేను ఎంతో నమ్మాను. కానీ అదంతా అబద్ధమని తేలిపోయింది. అది మమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడలేదు. నిరసనలో పాల్గొన్న నా తమ్ముడి తల పగలగొట్టారు. నాపై లాఠీలు విరుచుకుపడ్డాయి. అయినా నేను, నా తమ్ముడు భయపడలేదు. మళ్లీ నిరసనలో పాల్గొంటున్నాం` అన్నారు.
‘మాకు చాలా అన్యాయం జరిగింది` అంటూ మరో విద్యార్థి ఇలా మాట్లాడారు. ‘శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో పోలీసులు కర్రలతో దాడి చేశారు. విద్యార్థినులపై కూడా విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. వారి బట్టలు చించారు. శరీరాన్ని గాయపరిచారు. ఇదంతా ఎందుకు? జవాబుదారీతనం తీసుకోవడం మీకు ఎందుకు కష్టం? జెన్ జీ మీ ఆగడాలను ఇక చూస్తూ ఊరుకోదు.` అని ఎంతో ఆవేదనగా అతను మాట్లాడుతున్నాడు.

‘మేం ఈ దేశ పౌరులం కాదా?` అని ఓ విద్యార్థి ప్రశ్నిస్తూ.. ‘పార్లమెంట్ భవనానికి కాలినడకన కూడా మేము వెళ్లకూడదా! పార్లమెంట్‌కు రాకుండా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మేం ఓట్లు వేస్తే మీరు అక్కడికి వెళ్లారు. ఇక్కడ కూర్చొన్న లక్షలు, కోట్ల మంది యువత ఓట్లు వేసిన తరువాత చాలామంది ఎంపీలు పార్లమెంటులోపలికి వెళ్లారు. ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. మేం వెళ్లి చెప్పాలనుకుంటే మాపై దాడులు చేస్తారా? ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఈ యువత చేరుకుంటుంది` అని ఆవేశంగా అంటున్నారు.
‘సార్ మేము నేరస్థులం కాము. విద్యార్థులం..` అంటున్నా పోలీసులు దాడి చేశారని మరో విద్యార్థి కళ్లనీళ్ల పర్యంతమవుతూ చెప్పాడు. ఆ రోజు చాలామంది విద్యార్థులు పోలీసులను తనలాగే అభ్యర్థించారని, అయినా వాళ్లు కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారని అతను చెప్పారు.
'నాపై దాడి చేసిన వాళ్లు పోలీసులు కారు` అంటున్న విద్యార్థి తనను గూండాలాంటి వ్యక్తులు కొట్టారని అంటున్నారు. ‘ఇది ప్రజాస్వామ్య దేశం.. కానీ ఎంతకాలం నుండి ఇక్కడి ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉంటున్నాయి?` అని మరో విద్యార్థి ప్రశ్నిస్తున్నాడు. ‘చాలా కాలంగా దేశాన్ని పాడు చేస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసేవారు ఇప్పుడు పాలకులుగా వచ్చారు. మాకు మతాలతో పని లేదు. మేము విద్యార్థులం. ప్రభుత్వం నుండి జవాబుదారీతనం వచ్చేదాకా మేము ఇక్కడి నుండి వెళ్లం` అని అక్కడ ఉన్న విద్యార్థులు గొంతెత్తి నినాదాలు చేశారు.

దాడిలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నవారు, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నవారి తరపున వచ్చిన విద్యార్థులు కూడా తాజా నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘భాష్ప వాయువు దాడిలో అక్క కంటికి తీవ్ర గాయమైంది. తలనొప్పి, జ్వరంతో బాధపడుతూ ఇంటికి వచ్చింది. అక్క పరిస్థితి చూసిన నేను ఈ రోజు నుండి నిరసనల్లో పాల్గొనాలని వచ్చాను` అని ఓ విద్యార్థిని దృఢంగా చెబుతోంది.
వైకల్య బాధిత విద్యార్థి కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ‘నాలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. కానీ జవాబుదారీతనం చూపించేందుకు మీరు సిద్ధంగా లేరు. మీరు.. మాకంటే బలహీనులా..?` అని ఆ విద్యార్థి వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు. బిడ్డను ఎత్తుకుని వచ్చిన ఓ తల్లి కూడా అక్కడ కనిపిస్తోంది. ‘బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే నా బాధ్యత కాదు.. దేశంలో కోట్లాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ నిరసనల్లో కేవలం వేలాదిగానే పాల్గొంటున్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. రేపు నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే ఈ నిరసనలకు జవాబు కావాలి!` అని ఆమె అంటోంది.
'విద్య మంచి వ్యవస్థను తయారుచెయ్యాలి. కానీ మన దేశ విద్య బానిసలను తయారుచేస్తోంది` అంటోన్న మరో విద్యార్థి, 'చైనా, జపాన్ దేశాల పిల్లలు పొందే విద్య మన పిల్లలు ఎందుకు పొందడం లేదు? చైనా నుండి మొబైల్ ఫోన్లు తెప్పించుకుంటాం. జపాన్ నుండి రైళ్లు దిగుమతి చేసుకుంటాం. కొరియా సాంకేతికతతో మెట్రోను సిద్ధం చేసుకుంటాం. కానీ విద్యను మాత్రం అనుసరించం! ఇది ఎందుకు ఎవరికీ అర్థం కావడం లేదు?` అని అతను ఎంతో ఆవేదనగా మాట్లాడాడు.

'మనది ప్రజాస్వామ్య దేశమని ప్రజలకు తెలుసు. మరి మన కోసం, పిల్లల కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఎందుకు కలిసిరావడం లేదు` అని ప్రశ్నిస్తున్న విద్యార్థి తన నిరసనను తెలపడానికి ఛత్తీస్‌గఢ్ నుండి జంతర్ మంతర్ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ మణిపూర్, డార్జీలింగ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి చోట్ల నుండి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. ఆ పిల్లల్లో బిజెపి నాయకుల పిల్లలు కూడా ఉన్నారు. దాడులు జరిగిన రోజు మీడియాలో ప్రసారమైన వీడియోలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. ‘మీకు పిల్లలు ఉన్నారు కదా.. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు?` అని ఏడుస్తూ పోలీసులను అభ్యర్థిస్తున్న ఓ విద్యార్థిని దృశ్యం చూస్తున్న ప్రతి తల్లిదండ్రినీ కదిలిస్తుంది.
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల్లో చాలామందికి ఓటు హక్కు లేదు. అలాంటి విద్యార్థినిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. అప్పుడు తను అన్న మాటలు కూడా మీడియాలో కనిపించాయి. ‘నాకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు వస్తే ఎవ్వరికీ ఓటు వేయను. ఇక్కడ ఓటు వేసే అర్హత ఎవరికీ లేదు` అని ఆ బాలిక ఎంతో ఆవేశంగా మాట్లాడింది. ‘అత్యాచారాలకు వ్యతిరేకంగా మేం పోరాడతాం. కానీ ఈ రోజు వాళ్లు మా బట్టలు చింపేశారు. వీళ్లా మాకు రక్షణ కల్పించేది?` అని అక్కడే ఉన్న మరో విద్యార్థి తనపై జరిగిన దాడిని మీడియాకు చూపించింది. ‘క్రిమినల్స్ దొరికితే ఇంత త్వరగా చర్యలు తీసుకుంటారా? సమస్యపై గళం విప్పుతున్న మా నోర్లు మూయించడానికి వందలాది మంది కర్రలతో, బుల్లెట్లతో వచ్చేస్తారా?` అని ఆ విద్యార్థులు ప్రశ్నించడం దేశం యావత్తు చూసింది.







కామెంట్‌లు (0)