మైదానాన్ని నింపేదే ఆట! మైదానం వీడిన తర్వాత కూడా కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర వేసేదే గొప్ప ఆట! బంతితో కవిత్వం రాసేవాడే క్రీడాకారుడు.ప్రత్యర్థిని జయించడమే కాదు, ప్రేక్షకుల మనసులను గెలిచేవాడే అసలైన విజేత. అప్పుడే ఆట కూడా గెలుస్తుంది. ప్రపంచాన్ని నెలరోజులకు పైగా ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ మహోత్సవంలో జరిగింది ఇదే! ఉత్కంఠ పోరు తరువాత , చివరకు విజయ పీఠంపై స్పెయిన్ సగర్వంగా నిలిచినప్పటికీ, నిజంగా గెలిచింది ఫుట్‌బాల్ క్రీడే! స్పెయిన్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో కుంచెతో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తే, టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తన రాకెట్‌తో కొత్త చరిత్ర రాస్తే, ఇప్పుడు అదే నేల నుంచి వచ్చిన పదకొండు మంది క్రీడాకారులు పచ్చిక మైదానంపై తమ పాదాలతో మరో అద్భుత చిత్రాన్ని గీశారు. స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచకప్ కిరీటాన్ని అందించారు. ఫైనల్లో అర్జెంటీనాను ఒక గోల్ తేడాతో ఓడించి 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ ఈ ఘనత సాధించింది. ఎన్నో ప్రత్యేకతలకు వేదికైన ప్రపంచకప్ ఇది. తొలిసారిగా మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అమెరికా, కెనడా, మెక్సికో కలిసి ప్రపంచ ఫుట్‌బాల్ సమరాన్ని నిర్వహించాయి. తొలిసారిగా 48 దేశాలు బరిలోకి దిగడం మరో విశేషం. జట్ల సంఖ్య పెరిగితే ఆటలో ఉత్కంఠ తగ్గి, పోటీలు నీరసిస్తాయన్న ముందస్తు అభిప్రాయాలను ఈ ప్రపంచకప్ పటాపంచలు చేసింది. దాదాపు అన్ని మ్యాచ్‌లూ ఉత్కంఠభరితంగా సాగాయి. ఆటను మరింత వేగవంతంగా, సజీవంగా, తప్పిదాలకు తక్కువ అవకాశం ఉండేలా చేయడంలో కొత్త నిబంధనలు కీలకపాత్ర పోషించాయి. కోచ్ లూయిస్ డి లా ఫుయెంటె వ్యూహాలు స్పెయిన్ విజయయాత్రలో నిర్ణయాత్మకమయ్యాయి. మొత్తం 14 గోల్స్ సాధించిన స్పెయిన్ కేవలం ఒక్క గోల్ మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చింది. కెప్టెన్ రోడ్రి నాయకత్వంలో లామిన్ యమాల్, పౌ కుబార్సీ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టు మైదానాన్ని శాసించింది.
ప్రపంచకప్ పోటీలలో ఈసారి కూడా యూరప్ ఆధిపత్యానికి తిరుగులేదు. క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఎనిమిది జట్లలో ఆరు యూరప్‌కు చెందినవే. తీవ్రమైన వేడి, అలవాటులేని వాతావరణ పరిస్థితులు, మ్యాచ్ సమయాలు, ఒక వేదిక నుంచి మరో వేదికకు సుదీర్ఘ ప్రయాణాలు సవాళ్లుగా మారతాయని భావించారు. కానీ మైదానంలో సాంకేతిక నైపుణ్యం, ఒత్తిడిని అధిగమించే వృత్తిపరమైన దృక్పథం యూరప్ ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టాయి. ఆసియా ఆశించిన స్థాయికి ఎదగలేదు. ఆఫ్రికా ఎప్పటిలాగే మెరుపులు మెరిపించింది. లాటిన్ అమెరికా ప్రతిష్ఠ దాదాపుగా అర్జెంటీనాకే పరిమితమైంది. ‘ఆటతో పాటు వ్యాపారం కూడా ’ అన్న ప్రపంచ ఫుట్‌బాల్ సంస్థ ఫిఫా ఆ నినాదాన్ని ఈ ప్రపంచకప్‌లో విజయవంతంగా అమలు చేసింది. అందులో భాగంగా మ్యాచ్‌ల మధ్య ‘హైడ్రేషన్ బ్రేక్‌లు’, విరామ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇవి కొన్ని వివాదాలను తీసుకురావడంతో పాటు, భారీ ప్రకటనల ఆదాయాన్నీ తెచ్చిపెట్టాయి. అదే సమయంలో ఫిఫా విశ్వసనీయత కూడా బహిరంగంగానే ప్రశ్నార్ధకమైంది. అమెరికా ఆటగాడిపై సస్పెన్షన్‌ను తప్పించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారన్న వివాదం తలెత్తింది. ఫిఫా అధ్యక్షుడు వీటన్నింటికీ వివరణ ఇచ్చినప్పటికీ అనేక ప్రశ్నలు, అనుమానాలు మిగిలిపోయాయి.. ప్రేక్షకుల సంఖ్యలోనూ ఈ ప్రపంచకప్ రికార్డు సృష్టించింది. టికెట్ ధరలు ఆకాశాన్నంటినా 104 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు 16 స్టేడియాలకు మొత్తం 68 లక్షల మంది తరలివచ్చారు. ఒక్కో మ్యాచ్‌కు సగటున 65 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన వారి సంఖ్య 80 వేలు.
ప్రపంచకప్ ముగిసిన వేళ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన రెండు దేశాలు ఉన్నాయి. అవి ఇరాన్, కేప్ వెర్డె. యుద్ధభూమి మధ్య నుంచి ప్రపంచకప్‌కు వచ్చిన ఇరాన్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పారు. ఆ జట్టు మైదానం లోపలా, వెలుపలా ఎన్నో సవాళ్లను అధిగమించింది. మెక్సికోలో బస చేస్తూ ప్రతి మ్యాచ్ కోసం విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరోవైపు అట్లాంటిక్ మహాసముద్రంలోని దీవుల సమూహంగా విస్తరించి ఉన్న చిన్న దేశం కేప్ వెర్డె తన తొలి ప్రపంచకప్‌లోనే అందరి ప్రశంసలు అందుకుంది. కేవలం ఐదున్నర లక్షల జనాభా కలిగిన ఈ దేశం, దాని 40 ఏళ్ల గోల్‌కీపర్ వోజిన్హా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మన దేశానిది దీనికి భిన్నమైన స్థితి. భారత్ ప్రపంచకప్‌లో ఎప్పుడు ఆడుతుందన్న ప్రశ్న ప్రతి ప్రపంచకప్ సందర్భంలోనూ వినిపిస్తూనే ఉంటుంది. వచ్చే ప్రపంచకప్‌లో 64 జట్లకు అవకాశం కల్పించే ప్రతిపాదనను ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ముందుకు తెచ్చారు. ప్రస్తుతం భారత్ ర్యాంకు 138. నాలుగేళ్ల క్రితం అది 106గా ఉండేది. జాతీయ లీగ్‌లు, ప్రధాన టోర్నమెంట్లు అన్నీ సంక్షోభంలో ఉన్నాయి. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనూ దేశంలో ఆటను, క్రీడా మైదానాలను ఎలా అభివృద్ధి చేయాలన్న చర్చ కంటే సమాఖ్య పేరు మార్చడమే ప్రధాన అంశంగా మారింది. క్రికెట్ రాజ్యమేలే మన దేశంలోనూ బెంగాల్, కేరళం వంటి రాష్ట్రాలలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ సంబరాలు కనిపించాయి. కేరళం లోని కన్నూర్‌కు చెందిన తహ్సిన్ మహమ్మద్ ఖతార్ జట్టులో స్థానం పొందారు.అయితే తహ్సిన్‌కు మైదానంలోకి దిగే అవకాశం మాత్రం లభించలేదు. సూపర్‌స్టార్లు లియోనెల్ మెస్సీ, నెయ్‌మార్, క్రిస్టియానో రొనాల్డో, లూకా మోడ్రిచ్, గిల్లెర్మో ఒచోవా వంటి దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్. అయితే వారి వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతమైన యువతరం వేగంగా ముందుకొస్తోంది. వరుసగా రెండోసారి అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ‘గోల్డెన్ బూట్’ అందుకున్న కిలియన్ ఎంబాపె, లామిన్ యమాల్ వంటి యువతారలు ప్రపంచ ఫుట్‌బాల్ భవిష్యత్తుకు కొత్త వెలుగులుగా నిలుస్తున్నారు.







కామెంట్‌లు (0)