గిరిజన ప్రాంతాల్లోనే రేషన్ కార్డులకు, పెన్షన్లకు తీవ్ర వ్యత్యాసం
లిబ్‌టెక్ నివేదిక వెల్లడి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని పెంచినప్పటికీ, అంతే సంఖ్యలో కోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని లిబ్‌టెక్ సంస్థ వెల్లడించింది. సామాజిక భద్రతా పింఛన్లపై అధ్యయం చేసిన ఈ సంస్థ నివేదికను బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన పింఛన్ల సంఖ్య జులై 2024లో 65,18,496 నుంచి జులై 2026 నాటికి 62,19,807కి తగ్గిందని పేర్కొంది. మొత్తం పింఛనుదారుల సంఖ్యలో 2,98,689 మేర కొత వేసినట్లు తెలిపింది. 4.6 శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ కొనసాగుతూ, జనవరి 2024 నుండి రెగ్యులర్ కేటగిరీల కింద కొత్త పెన్షన్లు ఏవీ మంజూరు చేయనట్లు పేర్కొంది. మరణించిన పెన్షనర్ల వితంతువులకు జీవిత భాగస్వామి పెన్షన్లను బదిలీ చేయడమే ప్రధాన చేర్పులు తప్ప కొత్త పింఛన్లు ఇచ్చింది లేదని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు 1.53 లక్షల మంది వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరుకు అర్హులని గ్రామీణ పేదిరిక నిర్మూలనా సంస్థ అంచనా వేసిందని, వీరికి ఈ ఏడాది జూన్ నుండి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, జులై నెలలో కూడా పంపిణీ చేయలేదని తెలిపింది.
అందుబాటులో లేని అప్పీల్ యంత్రాంగం
పింఛన్ల రద్దును స్థానికంగా ఫిర్యాదు చేసి, లిఖితపూర్వక, హేతుబద్ధమైన లబ్ధిదారులు న్యాయం పొందగలిగేందుకు పారదర్శకమైన, పింఛను సంబంధిత ప్రత్యేక ప్రక్రియ ఏదీ ఉన్నట్లు కనిపించడం లేదని సంస్థ పేర్కొంది. వికలాంగ పింఛనుదారులు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2025లో వైకల్య పునర్‌ధృవీకరణ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, వైకల్య అంచనాల సక్రమంగా జరగకపోవడం, అప్పీలు చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో మారుమూల ప్రాంతాల నుంచి సదరం పరీక్షా కేంద్రాలకు ప్రయాణించాల్సి రావడంతో వికలాంగులు ఆందోళనలు వ్యక్తం చేశారని వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధిక గిరిజనులకు సాధారణ అర్హత వయసు కంటే 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లకు అర్హులవుతున్నప్పటికీ, ఇతర జిల్లాలతో పోలిస్తే అత్యధిక గిరిజనులు ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా 6వ స్థానంలో ఉందని తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న రేషన్ కార్డులకు, పింఛన్లకు తీవ్ర వ్యత్యాసం ఉందని వెల్లడిచింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం వంటి అధిక ఆదివాసీ జనాభా ఉన్న మండలాల్లో దానికనుగుణంగా పింఛను లభ్యత లేదని పేర్కొంది. ప్రభుత్వానికి సిఫార్సులు
సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పలు చర్యలను లిబ్‌టెక్ సూచించింది. సాధారణ పింఛను కేటగిరిల కింద దరఖాస్తు స్వీకరణను తిరిగి ప్రారంభించాలని సూచించింది. మారుమూల నివాస ప్రాంతాల్లో చురుగ్గా, ఇంటింటికీ వెళ్లి అర్హుల గుర్తింపు, నమోదు ప్రక్రియను నిర్వహించాలని, షెడ్యూల్డ్ ప్రాంతాల కోసం ప్రత్యేక దృష్టితో ప్రమాణాలను రూపొందించి, వాటిని బహిరంగంగా పర్యవేక్షించాలని కోరింది. ముందస్తు నోటీసు, వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏ పింఛనూ రద్దు చేయకుండా చర్యలు తీసుకోవాలంది. సులభంగా అందుబాటులో ఉండేలా అప్పీల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, అన్యాయంగా రద్దు చేసిన పెన్షన్లను బకాయిలతో సహా నిర్ణీత కాలపరిమితిలోగా పునరుద్ధరించాలని సూచించింది. సామాజిక తనిఖీల కోసం, మండల స్థాయి పింఛను సమాచారాన్ని వర్గాల వారీ, షెడ్యూల్డ్ తెగల హోదా వారీ వర్గీకరించి నెలవారీ వెల్లడించాలని కోరింది.







కామెంట్‌లు (0)