మాడిపోతున్న నారు మళ్లు
డెల్లా ప్రాంతంలోనూ ఖరీఫ్ సాగుపై తీవ్ర స్థాయిలో *ఎల్‌నినో ప్రభావం
ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ 27 శాతమే నాట్లు
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావంతో ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సాగులో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి పక్కనే ఉన్నా సాగునీరందక వరి నాట్లు ఎండిపోతున్నాయి. వరి నారు మడులు ఎండకు మాడిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లాల్లో 2.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవ్వాలి. ఇందులో 2.14 లక్షల ఎకరాల్లో వరి వేస్తారు. జిల్లాలో కృష్ణా నది ఆయకట్టు పరిధిలో 58 వేల ఎకరాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకూ 27 శాతం వరి నాట్లు మాత్రమే పూర్తయ్యాయి. జూన్ ఒకటిన పంట కాలువకు గోదావరి నుంచి సాగు నీరు విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు నారు మడులు వేశారు. ప్రస్తుతం గోదావరి డెల్టా (ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని) భూములకు రోజుకు ఏడు వేల క్యూసెక్కుల నీరు వస్తున్నా ఏ మూలకూ చాలడం లేదు. ఎండ తీవ్రతకు ఎక్కువ నీరు మధ్యలోనే అవిరి అయిపోతోంది. శివారు ఆయకట్టు భూములకు నీరందడం లేదు. దీనికితోడు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఎండగట్టంతో ప్రస్తుతం దుర్బర పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ లో 111.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 106 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జులైలో ఇప్పటి వరకూ 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. 30.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని రాళ్లకోడు, ఎలింకోడు, జిల్లేడుదిబ్బ వంటి ఆయకట్టు ప్రాంతాల్లోనూ దాదాపు మూడు వేల ఎకరాలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వరి నాట్లు నాటిన పంట పొలాలు బీటలు వారడం, నారు మడులు ఎండిపోవడంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే నాట్లు వేసిన వారికి ఎకరాకు రూ.12 వేలు వరకూ ఖర్చయింది. నాట్లను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఉద్యాన రైతుల్లో ఆందోళన
ఏలూరు జిల్లాలో 3.24 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పామాయిల్, కొబ్బరి, కోకో, మామిడి, అరటి, బొప్పాయి వంటి పంటలు వాటిలో ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో బోర్లు నుంచి నీరు రాక ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యాన పంటలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు నగరానికి తాగునీటి సమస్య ముప్పు!
గోదావరి నీటి ఆధారంగా ఏలూరు నగరానికి తాగునీరు అందించే విధంగా వాటర్ ట్యాంకు నిర్మించారు. కాలువల్లో నీరు సరిగా లేకపోవడంతో చెరువులో నీరు అడుగంటుతోంది. ప్రస్తుతం ఏడు రోజులకు మాత్రమే నీళ్లు ఉన్నాయని, వెంటనే తాగునీటి చెరువు నింపేందుకు అవకాశం ఇవ్వాలని మేయర్ షేక్ నూర్జహాన్ జిల్లా కలెక్టర్‌ను కలిసి కోరారు. దీనిని బట్టి తాగునీరు సమస్య కూడా తీవ్రరూపం దాల్చుతున్నట్లు స్పష్టమవుతోంది.
తొమ్మిదెకరాల్లో నాట్లు ఎండిపోయాయి : తమ్మినేని పోలయ్య, కొవ్వలి గ్రామం, దెందులూరు మండలం
రాళ్లకోడు ఆయకట్టు పరిధిలో తొమ్మిదెకరాల్లో వరి నాట్లు వేసి 13 రోజులైంది. నీటి ఎద్దడి సమస్యతో పొలం బీటలు వారింది. ఇప్పటి వరకూ ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. ఆయకట్టు పరిధిలో వేలాది ఎకరాల పరిస్థితి ఇదేవిధంగా ఉంది.
ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు : కె.శ్రీనివాస్, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి
గోదావరి నుంచి ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్కుల నీరు వస్తున్నా ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం, కాలువల ఆధునీకరణ పనులు సరిగా జరగకపోవడంతో సాగు నీటి సమస్య తలెత్తి వరి పొలాలు ఎండిపోతున్నాయి. శివారు భూములకు నీరందడం లేదు. పట్టిసీమ నీటిని సరైన పద్ధతిలో వినియోగించని పరిస్థితి ఉంది. సాగు, తాగు నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.







కామెంట్‌లు (0)