రవాణా ఛార్జీలు అమెరికాకు చెల్లించాల్సిందేనని హూంకరింపు
పరస్పరం కాల్పులు జరుపుకున్న అమెరికా, ఇరాన్
వాషింగ్టన్ : అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధిని పరిరక్షించే బాధ్యతలను అమెరికా చేపడుతుందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జల మార్గాన్ని పరిరక్షించినం దుకు అమెరికాకు సుంకం చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఒక ఒప్పందాన్ని చేశాం, కానీ వారు దాన్ని విచ్ఛిన్నం చేశారు.’ అని వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధికి అమెరికా గార్డియన్‌గా మారుతుందన్నారు. నౌకా మార్గాన్ని పరిరక్షిస్తున్నందుకు అమెరికాకు రవాణా చార్జీలు చెల్లించాలన్నారు. చెడ్డవారి సమూహం ఇరాన్ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, హర్మూజ్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్న రెండు నౌకలను హెచ్చరిస్తూ ఆ నౌకలపై కాల్పులు జరిపి వాటిని నిలువరించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి) తెలిపింది. అక్రమంగా జలసంధిని దాటేందుకు ఆ నౌకలు ప్రయత్నించాయని పేర్కొంది.
అబాదాన్ నగరంపై అమెరికా బాంబుల వర్షం..
హర్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో రెండు దేశాలు తలపడుతున్నాయి. తాజాగా అమెరికా బలగాలు ఇరాన్‌లోని ఖుజిస్తాన్ ప్రావిన్స్‌లోని అబాదాన్ నగరంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది. సోమవారం ఉదయం అబాదాన్‌లోని మూడు ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయని ఇరాన్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఈ దాడులపై అమెరికా అధికారుల నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ దాడులకు ప్రతిగా గల్ష్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. హర్మూజ్‌ను మూసివేసిటన్లు టెహ్రాన్ ప్రకటించింది. అమెరికా నౌకాదళానికి 5వ ఫ్లీట్ కేంద్రంగా ఉన్న బహ్రెయిన్‌లో సోమవారం తెల్లవారుజామున క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగినప్పటికీ, నష్టం వివరాలు వెల్లడి కాలేదు. ఆదివారం ఇరాన్ జరిపిన దాడులు బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమన్ దేశాలకూ విస్తరించాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో ఐదోవంతు రవాణా జరిగే ఈ కీలక జలమార్గం, అమెరికా - ఇరాన్ మధ్యంతర ఒప్పందానికే ప్రమాదకరంగా మారింది.
జలసంధిలో తగ్గిన నౌకా రవాణా
ఈనెల 10 నుంచి 12 వరకు అమెరికా - ఇరాన్ ఘర్షణలు కొనసాగడంతో హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణా గణనీయంగా తగ్గిందని ఓ నివేదిక వెల్లడించింది. షిప్ ట్రాకింగ్ సంస్థ ‘కెప్లర్’ ప్రకారం, వారం వారీగా నౌకా రవాణా 52 శాతం పడిపోయిం ది. భద్రతకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నౌకా నిర్వాహ కులు ఇరాన్, 'డార్క్' మార్గాలవైపు మళ్లు తుండగా, ఐఎంవొ, ఒమానీ కారిడార్లలో రాకపోకలు కనిష్ట స్థాయికి పడిపోయాయని కెప్లర్ పేర్కొంది.
అమెరికా జోక్యం చేసుకుంటే ప్రతిఘటనే : ఐఆర్‌జిసి
అమెరికా జోక్యం కొనసాగితే ప్రపంచ చమురు, గ్యాస్ రంగంలో మరిన్ని ఘటనలు చోటుచేసుకోవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. అమెరికా సైనిక జోక్యం నిలిచిపోతేనే హర్మూజ్ జలసంధి గుండా సాధారణ నౌకా రవాణా పునఃప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఇరాన్ విమానం దిగకుండా అడ్డుకునేందుకు సనా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై దాడి చేసినట్టు యెమెన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇరాన్‌కు అనుకూలంగా ఉండే హౌతీ ఉద్యమం సనాను నియంత్రిస్తుండగా, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల మద్దతుతో యెమెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వం ఏడెన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు వెంటనే వెల్లడి కాలేదు.







కామెంట్‌లు (0)