ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొరియా డ్రామాకు ఎందుకింత ఆదరణ?

6 రోజుల క్రితం

korea
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఒకప్పుడు ప్రపంచ టెలివిజన్ వినోదం అంటే అమెరికా, బ్రిటన్ సీరీస్‌లే గుర్తుకొచ్చేవి. హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లిష్ టీవీ షోలు, లాటిన్ అమెరికా సోప్ ఒపెరాలు ప్రపంచ ప్రేక్షకులను ఏలేవి. గత రెండు దశాబ్దాల్లో దక్షిణ కొరియా నిశ్శబ్దంగా ఆ రంగంలో విప్లవం సృష్టించింది. నేడు ఏ ఓటీటీ వేదికను తెరిచినా కొరియన్ సిరీస్‌లు కనిపిస్తున్నాయి.

​దక్షిణ కొరియాలో నిర్మించే టెలివిజన్ ధారావాహికలను సాధారణంగా 'కె–డ్రామాలు' అంటారు. 'కె' అంటే 'కొరియా'. ప్రేమకథలు మాత్రమే కాదు, కుటుంబం, చరిత్ర, నేర పరిశోధన, వైద్యం, న్యాయవ్యవస్థ, సైన్స్ ఫిక్షన్, హారర్, రాజకీయాలు, మానసిక ఆరోగ్యం, వ్యాపారం... దాదాపు ప్రతి అంశంపై సిరీస్‌లు రూపొందుతున్నాయి. సాధారణంగా 12 నుంచి 16 ఎపిసోడ్‌లు, కొన్నిసార్లు 20 ఎపిసోడ్‌లలో కథ ముగుస్తుంది. అనవసర సాగదీత లేకపోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

​ఇలా మొదలైంది!

దక్షిణ కొరియాలో టెలివిజన్ ప్రసారాలు 1960లలో ప్రారంభమైనప్పటికీ, నాణ్యమైన కథా సిరీస్‌లు 1990ల చివర్లో రూపుదిద్దుకున్నాయి. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వినోద పరిశ్రమను కూడా ఒక ఎగుమతి రంగంగా అభివృద్ధి చేయాలని కొరియా ప్రభుత్వం నిర్ణయించింది. సినిమాలు, టెలివిజన్, సంగీతం, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాలకు భారీ ప్రోత్సాహం ఇచ్చింది. ఈ వ్యూహాన్నే తరువాత 'హల్ల్యూ' లేదా 'కొరియన్ వేవ్' అని పిలిచారు. 'హల్ల్యూ' అంటే కొరియన్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం. మొదట చైనా, జపాన్, తైవాన్ వంటి పొరుగు దేశాల్లో కొరియన్ సీరీస్‌లు ఆదరణ పొందాయి. ఆ తర్వాత మధ్యప్రాచ్యం, యూరప్, అమెరికా వరకు విస్తరించాయి. 2002లో వచ్చిన 'వింటర్ సోనాటా' జపాన్‌లో సంచలనం సృష్టించింది. 'జ్యువెల్ ఇన్ ది ప్యాలెస్' (2003), 'బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్' (2009), 'గోబ్లిన్' (2016), 'క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ' (2019), 'స్క్విడ్ గేమ్' (2021), 'ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ' (2022), 'క్వీన్ ఆఫ్ టియర్స్' (2024) వంటి సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను సంపాదించాయి.

​భారత్‌లోకి ఎలా వచ్చాయి?

భారత్‌లో కొరియన్ సీరీస్‌లు మొదట ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి. మణిపూర్, మిజోరం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక ఛానళ్ల ద్వారా 2000ల ప్రారంభంలోనే కొరియన్ సీరీస్‌లు ప్రసారమయ్యాయి. స్థానిక సంస్కృతికి కొంత దగ్గరగా ఉండే దుస్తులు, కుటుంబ విలువలు, భావోద్వేగ కథలు అక్కడి ప్రేక్షకులకు నచ్చాయి. మిగతా భారతదేశానికి మాత్రం కె–డ్రామాలు పెద్దఎత్తున పరిచయమైంది ఓటీటీల ద్వారానే. 2016 తర్వాత నెట్‌ఫ్లిక్స్, వికీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ వంటి వేదికలు కొరియన్ సిరీస్‌లను సబ్‌టైటిల్స్‌తో అందుబాటులోకి తెచ్చాయి. కరోనా సమయంలో 'క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ', 'ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే', 'బిజినెస్ ప్రపోజల్', 'ట్వెంటీ ఫైవ్ ట్వెంటీ వన్' వంటి సిరీస్‌లు విపరీతమైన ఆదరణ పొందాయి. తర్వాత హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భారతీయ భాషల్లో డబ్బింగ్ రావడంతో ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగింది.

​ఎందుకంత ఆదరణ?

ఒక మంచి కథ ప్రపంచంలోని ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. కానీ కె–డ్రామాల విషయంలో అది మాత్రమే కారణం కాదు. ఎందుకంటే ప్రేమకథలు హాలీవుడ్‌లోనూ ఉన్నాయి. కుటుంబ కథలు భారతీయ టెలివిజన్‌లోనూ ఉన్నాయి. సస్పెన్స్‌, థ్రిల్లర్‌లు యూరప్‌లోనూ ఉన్నాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది, ముఖ్యంగా మహిళలు, యువత కె–డ్రామాలనే ఎందుకు ఇష్టపడుతున్నారు?

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కె–డ్రామాల అతిపెద్ద బలం కథ కాదు... పాత్రలు. ముఖ్యంగా కథానాయకుడు. దశాబ్దాలుగా ప్రపంచ సినిమాలు 'మగాడు' అంటే ఎలా ఉండాలనే ఒకే రకమైన చిత్రాన్ని చూపించాయి. కోపంగా ఉండాలి. కొట్టాలి. గెలవాలి. భావోద్వేగాలను బయటపెట్టకూడదు. ఏడవకూడదు. ప్రేమలో కూడా ఆధిపత్యం చూపాలి. కానీ కె–డ్రామాలు ఈ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేశాయి. కె–డ్రామాల్లో హీరో మహిళలను గౌరవిస్తాడు. ఆమె అభిప్రాయాన్ని వింటాడు. కష్టాల్లో అండగా నిలుస్తాడు. అవసరమైతే ఏడుస్తాడు. తన తప్పును ఒప్పుకుంటాడు. క్షమాపణ చెప్పడానికి వెనుకాడడు. తన ప్రేమను మాటల్లో చెప్పడానికీ సిగ్గుపడడు. 'క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ'లో ఉత్తర కొరియా సైనిక అధికారి రీ జియాంగ్ హ్యూక్ తన ప్రాణాలను పణంగా పెట్టి కథానాయికను రక్షిస్తాడు. 'హోమ్‌టౌన్ చా–చా–చా'లో గ్రామీణ యువకుడు హోంగ్ డూ షిక్ గ్రామంలోని ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావిస్తాడు. 'వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరైన్స్'లో కథానాయకుడు ప్రేమించిన అమ్మాయి కలలను తన కలలుగా మార్చుకుంటాడు. వీరు శక్తిమంతులు కాబట్టి కాదు... మనుషులుగా గొప్పవారు కాబట్టి ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. సంబంధాన్ని గెలవాల్సిన యుద్ధంగా కాకుండా, కలిసి నడవాల్సిన ప్రయాణంగా చూపించడం కె–డ్రామాల ప్రత్యేకత.

​ప్రేమ అంటే...

కె–డ్రామాల్లో ప్రేమకు కూడా ఒక ప్రత్యేక భాష ఉంటుంది. కథానాయకుడు ప్రేమిస్తున్నానని చెప్పడానికి వంద ఖరీదైన బహుమతులు ఇవ్వడు. అవసరమైనప్పుడు గొడుగు పట్టి నిలబడతాడు. జ్వరం వస్తే మందు తెస్తాడు. రాత్రంతా ఆసుపత్రి బయట కూర్చుంటాడు. ఇంటికి సురక్షితంగా చేరిందో లేదో చూసుకుంటాడు. కథానాయిక నిర్ణయాలను గౌరవిస్తాడు. ఆమె ఉద్యోగాన్ని, వ్యక్తిత్వాన్ని చిన్నచూపు చూడడు. ఈ చిన్న చిన్న విషయాలే ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు తమ నిజజీవితంలో ఆశించే పరస్పర గౌరవం, ఆదరణ, సహకారం వంటి లక్షణాలను ఈ పాత్రల్లో చూసినట్లు అనేక సామాజిక పరిశోధనలు సూచిస్తున్నాయి.

​మహిళలే ఎందుకు ఎక్కువ?

ప్రపంచవ్యాప్తంగా కె–డ్రామాల ప్రధాన ప్రేక్షకులు మహిళలే. భారతదేశంలో కూడా కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు, యువతుల్లో ఎక్కువ ఆదరణ ఉంది. దీనికి ప్రధాన కారణం కథల్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం. కథానాయికలు కేవలం హీరో చుట్టూ తిరిగే పాత్రలు కావు. వారు వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారులు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, క్రీడాకారిణులు... తమ వ్యక్తిత్వం, లక్ష్యాలతో ముందుకు సాగే పాత్రలు. ప్రేమ వారి జీవితంలో ఒక భాగం మాత్రమే. మొత్తం జీవితం కాదు. 'ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ'లో ఆటిజంతో బాధపడుతున్న న్యాయవాది, 'డాక్టర్ చా'లో మధ్యవయసులో మళ్లీ వైద్యవృత్తిలోకి వచ్చిన మహిళ, 'ట్వెంటీ ఫైవ్ ట్వెంటీ వన్'లో క్రీడాకారిణి... ఇలా ప్రతి కథలో మహిళ తన జీవితాన్ని తానే నిర్మించుకునే వ్యక్తిగా కనిపిస్తుంది. ఈ సిరీస్‌‌ని కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని చూడగలిగే విధంగా రూపొందించడం కూడా వాటి విజయానికి ఒక కారణం.​

- సుజయ సాహితి​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్