గురుశిష్యుల బంధానికి సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. నేర్పించే స్థానంలో గురువు, తెలుసుకునే స్థానంలో శిష్యుడు ఒకరిపట్ల ఒకరు ఆదరాభిమానాలతో ఉండేవారు. కానీ ఇటీవల వెలుగుచూస్తున్న సంఘటనలు ఆ బంధంలో వస్తున్న మార్పులపై ఆందోళన కలిగిస్తున్నాయి. నల్గొండలో నాగార్జున విద్యాసంస్థ నిర్వాహకురాలు రూపారెడ్డి హత్యోదంతం ఇందుకు ఉదాహరణ. ఆమె నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థులే ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. పిల్లలు పక్కదారి పట్టారని ఆమె మందలించడంపై ఆగ్రహంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఇంతటి క్రౌర్యానికి, హింసాత్మక ప్రవృత్తికి విద్యార్థులు ఎందుకు లోనవుతున్నారు?
గతంలో అన్నమయ్య జిల్లాలోని కొత్తపల్లి జెడ్పీ ఉర్దూ హైస్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడు అజియాస్ అహ్మద్ మృతిచెందిన ఘటనలో ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసోంలోని శివసాగర్ జిల్లాలో 2024లో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ బాబును 11వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన కూడా సంచలనం సృష్టించింది. చదువులో వెనుకబడుతున్న విద్యార్థిని ప్రిన్సిపాల్ మందలించిన తర్వాత ఈ దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారణాలు వేర్వేరైనా ఈ ఘటనల్లో కనిపించే సామాన్య అంశం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థి, గురువు మధ్య ఉండాల్సిన సంభాషణ స్థానంలో ఘర్షణ, గౌరవం స్థానంలో ఆగ్రహం, సమస్య పరిష్కారం స్థానంలో హింస చోటుచేసుకుంటున్నాయి.
ఒకప్పుడు గురువు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. విద్యార్థి కుటుంబ పరిస్థితిని తెలుసుకునేవాడు. అతని బలాలు, బలహీనతలను గమనించేవాడు. తప్పు చేస్తే మందలించేవాడు. అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. విద్యార్థి కూడా గురువును తన భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శిగా భావించేవాడు. కానీ విద్యావ్యవస్థలో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ మార్కులు, ర్యాంకులు, ఫీజులు, ఫలితాలు, ఉద్యోగ భద్రత, సంస్థ ప్రతిష్ఠ వంటి వాణిజ్య అంశాలు ప్రాధాన్యం పొందాయి. విద్యార్థి ‘కస్టమర్’గా, తల్లిదండ్రులు ‘ఫీజు చెల్లించే వినియోగదారులు’గా, ఉపాధ్యాయుడు ‘సేవ అందించే ఉద్యోగి’గా చూసే ధోరణి పెరిగింది. ఫలితంగా విద్యాసంస్థల్లో మానవ సంబంధాల కంటే వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
హింసకు కారణాలేమిటి?
దీనికి తోడు సినిమాలు, టీవీలు, వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియా ద్వారా పిల్లలకు చేరుతున్న కంటెంట్ కూడా వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తోంది. మాదకద్రవ్యాలు, హింస వంటి అంశాలను సాధారణ వినోదంగా చూపించే దృశ్యాలు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. మద్యం, ఇతర చెడు అలవాట్లను సాధారణ జీవనశైలిలో భాగంగా చూపించే ధోరణి కూడా పెరుగుతోంది. ఇవి టీనేజర్ల ప్రవర్తన, కోపం, స్నేహబృందాలు, సమస్యలను ఎదుర్కొనే విధానంపై ప్రభావం చూపే అవకాశాలను విస్మరించకూడదు. మాదకద్రవ్యాల విషయంలో పాఠశాలలు, తల్లిదండ్రులు, పోలీసులు, స్థానిక సమాజం సమన్వయంతో పనిచేయాలి. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తే వాటిని కేవలం ‘చదువులో శ్రద్ధ లేదు’ అని కొట్టిపారేయకుండా, వారి మానసిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి.
విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మంచి మార్కులు, ర్యాంకులు, మంచి కాలేజీ, మంచి ఉద్యోగం కోసం పిల్లల బాల్యాన్ని పరుగు పందెంగా మార్చేశాం. పాఠశాల తర్వాత కోచింగ్, ట్యూషన్, ఆన్‌లైన్ తరగతులు, పరీక్షలు; మరోవైపు సోషల్ మీడియాలో కనిపించే విజయాల కథలు, తోటి విద్యార్థులతో పోలికలు, తల్లిదండ్రుల అంచనాలు. ఇవన్నీ కలిసి పిల్లల్లో కోపం, అసహనం, వైఫల్య భయం, ఒంటరితనాన్ని పెంచవచ్చు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో చదువు, మార్కుల గురించి మాత్రమే కాకుండా వారి భావాలు, భయాలు, సమస్యల గురించి కూడా మాట్లాడాలి.
మారాల్సిన విద్యావ్యవస్థ
అదే సమయంలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని అందరి ముందు అవమానించడం, నిరంతరం తిట్టడం, శారీరకంగా శిక్షించడం సమర్థనీయం కాదు. విద్యార్థి హక్కుల పేరుతో ఉపాధ్యాయుడిని అవమానించడం, బెదిరించడం, దాడి చేయడం కూడా ఆమోదయోగ్యం కాదు. పాఠశాలల్లో క్రమబద్ధమైన కౌన్సెలింగ్ వ్యవస్థ ఉండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సంభాషణ కొనసాగాలి. సోషల్ మీడియా వినియోగం, సైబర్ బుల్లీయింగ్, హింసాత్మక కంటెంట్, మాదకద్రవ్యాల ప్రభావంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. సమస్య నేరంగా మారే వరకు వేచి చూడకుండా, ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించే వ్యవస్థ అవసరం.
నల్గొండ ఘటన మన ముందుంచిన ప్రశ్నకు సమాధానం ఒక్క కారణంలో దొరకదు. ఇంటి వాతావరణం, పాఠశాల, విద్యా విధానం, డిజిటల్ ప్రపంచం, సామాజిక పరిస్థితులు, పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి ... ఇవన్నీ కలిసి పరిశీలించాల్సి ఉంటుంది. గురువు మళ్లీ విద్యార్థికి మార్గదర్శిగా కనిపించాలి. విద్యార్థి మార్కులు సాధించే యంత్రం కాదు, భావాలు, భయాలు, ఆశలు ఉన్న మనిషి అనే అవగాహన ఏర్పడాలి. తల్లిదండ్రులు ఫీజు చెల్లించే వినియోగదారులుగా కాకుండా పిల్లల మానసిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే సహచరులుగా మారాలి. విద్యాసంస్థలు ర్యాంకుల ఫ్యాక్టరీలుగా కాకుండా వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే ప్రదేశాలుగా మారాలి. అప్పుడే గురువు–విద్యార్థి మధ్య పెరుగుతున్న దూరం తగ్గుతుంది.







కామెంట్‌లు (0)