గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనానాటికీ తీసికట్టుగా రాష్ట్ర విద్యావ్యవస్థ

1 గంట క్రితం

school children
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:42 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉన్నటువంటి ‘విద్య’ అన్న అంశం, 42వ రాజ్యాంగ సవరణ(1976) ద్వారా ఉమ్మడి జాబితా లోనికి చేరింది. దీని వల్ల కేంద్రం విద్యపై విశేష అధికారాలను సంపాదించింది. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ విధమైన చర్య విఘాతమైనప్పటికీ చాలా రాష్ట్రాలు దీనిని పెద్దగా వ్యతిరేకించలేదు. దీనికి ఒక ముఖ్య కారణం రాష్ట్రాలు ‌కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని భావించాయి. విద్యను ప్రజోపయోగకర వస్తువు (పబ్లిక్ గూడ్) భావన నుండి ప్రైవేటు రంగానికి దాఖలు చేయాలనే ఆలోచన కూడా కొన్ని చోట్ల వుంది. కేంద్రం ఇదే అదనుగా విద్యా సంస్థలు, ముఖ్యంగా ఉన్నత విద్యారంగంపై పూర్తి నియంత్రణను సాధించే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే ఉన్నత విద్యా సంస్థల స్థాపన, కోర్సుల ప్రారంభం, పాఠ్య ప్రణాళిక నిర్ధారణ, ప్రమాణాల మదింపు వంటి విషయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థల అజమాయిషీలో కొనసాగుతున్నాయి. రాష్ట్రాలది కేవలం ప్రేక్ష‍క పాత్రే. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ‘పిపిపి’ పేరున ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ, సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కనపడుతున్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంగా పరిస్థితిని విశ్లేషిస్తే ఒక దశాబ్దం క్రితం, అనగా 2014-15 విద్యా సంవత్సరంలో 58,950 పాఠశాలలు ఉండగా, వాటిలో 44,617 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఇది సుమారుగా 75.7 శాతం. ఈ సంఖ్య 2025-26 నాటికి 60,843 గా నమోదైంది. ఈ మొత్తంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 44,222 గా ఉన్నది (72.7 శాతం). ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ-ప్రైవేటు యాజమాన్యంలో నడిచే పాఠశాలల నిష్పత్తి 70:30 అని చెప్పవచ్చు. విద్యార్థుల సంఖ్యాపరంగా గమనిస్తే, ఈ నిష్పత్తి 60:40 గా ఉంటుంది. దీనికి కారణం, ఏకోపాధ్యాయ పాఠశాలలు, తరగతులు మితంగా ఉండేవి, ప్రవేశాల సంఖ్య, డ్రాపవుట్ల శాతం, ఇవన్నీ కలిపితే ప్రభుత్వ రంగంలో నడిచే పాఠశాలల ప్రభావం ఎంతమేరకు అన్నది మనకు అవగతమవుతుంది. అసలు ఏమాత్రం ఆర్థిక వనరులు లేని కుటుంబాలు మినహా, ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేవారి సంఖ్య నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నది. దీనికి తోడు క్రమబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాఠశాలల ఏకీకృత విధానం ప్రభుత్వ విద్యాసంస్థలను మరింతగా దిగజార్చుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం విద్యపై చేస్తున్న వ్యయం రాను రాను గణనీయంగా పడిపోతున్నది. ఉదాహరణకు 2015-16లో మొత్తం బడ్జెట్ లో విద్యకు 16.44 శాతం కేటాయించగా, అది 2020-21 నాటికి 11.21 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2026-27లో కూడా విద్యకు కేటాయింపు 11.7 శాతమే ఉన్నది. మొత్తం రూపాయలలో కేటాయింపులు సుమారుగా రూ.14,000 కోట్ల నుండి ప్రస్తుతం రూ.35,000 కోట్లకు పెరిగినా, మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలలో విద్య శాతం 2020-21 నాటి స్థితిలోనే ఉన్నది. ఈ అరకొర కేటాయింపుల ప్రభావంతో పాఠశాల విద్యాభివృద్ధి సూచిక (ఎస్.ఇ.డి.ఐ-సెడి)లో ఆంధ్రప్రదేశ్ 2025-26 గణాంకాల ప్రకారం 15వ స్థానంలో ఉన్నది. ఈ సూచికలో అగ్రభాగాన ఉన్న చండీగఢ్ సంయుక్త (కాంపొజిట్) సూచీ 0.826 గా ఉండగా ఆంధ్రప్రదేశ్ సూచీ 0.593 గా ఉన్నది. దక్ష‍ిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ(0.798), తమిళనాడు (0.706), మహారాష్ట్ర, (0.645) లతో కూడ పోటీ పడలేకపోతున్నది. ఈ పరిస్థితిని నిశితంగా గమనించాలి.

ఇక ఇంటర్ మీడియట్ విద్య విషయాన్ని పరిశీలిస్తే, రాష్ట్రంలో దరిదాపు 3000 వరకు జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 2500 వరకు ప్రైవేటు సంస్థలే. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 53 కళాశాలలతో కలిపి మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 471 మాత్రమే. విద్యార్థుల సంఖ్యాపరంగా చూస్తే, రాష్ట్రంలో మొత్తం జూనియర్ కళాశాలల్లో సుమారుగా 12 లక్ష‍ల మంది విద్యార్థులు ఉండగా, కేవలం 1.5 లక్ష‍ల మంది మాత్రమే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. అంటే దాదాపు 90 శాతం ఇంటర్మీడియట్ విద్య ప్రైవేటు వ్యక్తుల చేతులలోనే ఉన్నది.

ఉన్నత విద్యకు సంబంధించి, విశ్వవిద్యాలయాలు, కళాశాలల విషయాన్ని పరిశీలిస్తే, రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, 7 డీమ్డ్, 13 ప్రైవేటు సంస్థలుగా కొనసాగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో సుమారుగా 2500 కళాశాలలు వివిధ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా వున్నాయి. వీటన్నింటిలో 15 లక్ష‍ల మంది చదువుతున్నారు. వీరిలో 3.5 లక్ష‍ల మంది విశ్వవిద్యాలయాలలో, ఎక్కువ భాగం పి.జి కోర్సులలో చేరి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు నిష్పత్తులను గమనిస్తే, విశ్వవిద్యాలయాల స్థాయిలో సుమారుగా 50 శాతం, కళాశాలల విషయంగా 85 శాతం ప్రైవేటు సంస్థలలోనే విద్యార్థులు చేరి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. గణనీయమైన ఈ మార్పులన్నీ గత నాలుగైదు సంవత్సరాల కాలంలో ఏర్పడినవే.

ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలకు నిధుల అందజేత పూర్తిగా తగ్గిపోయింది. 2026-27 బడ్జెట్ లో విద్యకు రూ. 34,875 కోట్లు కేటాయించగా, అందులో రూ.32,308 కోట్లు పాఠశాల విద్యకు, కేవలం రూ.2,567 కోట్లు ఉన్నత విద్యకు కేటాచించబడినాయి. విశ్వవిద్యాలయాలకు మంజూరు చేసింది కేవలం రూ.1232 కోట్లు మాత్రమే. దీనిని రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లోని 28 విశ్వవిద్యాలయాలు పంచుకోవాలి. మరీ విచారకరమైన అంశం ఏమనగా, రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు 2026-27లో కేటాయింపులు సంవత్సరం మొత్తానికి ఒక్కొక్క దానికి రూ.10 కోట్ల లోపే. అందునా ఒంగోలులోని ఆంధ్ర కేసరి ప్రకాశం విశ్వవిద్యాలయానికి కేటాయించింది కేవలం రూ.1.05 కోట్లు. అలాగే వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి దక్కింది రూ.2.56 కోట్లు, ఉర్దూ యూనివర్సిటీకి మంజూరైనవి రూ.3.13 కోట్లు. ఈ నిధులతో ఉన్నత ప్రమాణాలు ఏ విధంగా సాధించగలవో అర్థం కాదు.

ఇంకొక విచిత్రమైన అంశం ఏమంటే యు.జి, పి.జి స్థాయి కోర్సుల ప్రవేశాలను కూడా ప్రభుత్వ శాఖలు నియంత్రించడం. ఇంతకు మునుపు ప్రతి విశ్వవిద్యాలయం తాను అందిస్తున్న, అనుబంధ కళాశాల కోర్సులకు మొత్తంగా తానే నోటిఫికేషన్ ఇచ్చి, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంటే జులై నాటికే ప్రవేశాలు పూర్తి చేసేది. నేడు ఏకీకృత విధానం ద్వారా డిగ్రీ కోర్సుల ప్రవేశాలను కూడా తామే క్రమబద్ధీకరించడం ద్వారా విపరీతమైన ఆలస్యం చోటు చేసుకొంటున్నది. గతిలేక విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేటు, డీమ్డ్ విశ్వ విద్యాలయాలను వెతుక్కొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా బదిలీ అయ్యే నిధులను తగ్గించుకొనే ప్రక్రియలో భాగంగా, విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేయబూనడం విచారకరం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 15 దాటిన తరువాత కూడా ప్రవేశాలు మొదలు కాలేదంటే విద్యా సంవత్సరాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరించగలుగుతాం? ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రవేశాలు ముగిసి, తరగతులు మొదలైనాయి. పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెంచుకొన్న ఏ తల్లిదండ్రులు ఇంతకాలం వేచి ఉండగలరు? ప్రత్యేకించి వ్యవస్థా ప్రక్రియలలో మార్పుల కారణంగా ఉన్నత విద్యా కమిషనరేట్ స్థాయిని పెంచి, అధికారాలను దఖలు పరిచి, ఉన్నత విద్యా మండలిని నిర్వీర్యం చేయడం, రాష్ట్రంలోని ఉన్నత విద్యా నిర్వహణను మరింత కుంటుపరుస్తుంది. కాబట్టి మన రాష్ట్ర విద్యా వ్యవస్థను, దాని నాణ్యతను మెరుగుపరచడం కోసం పూర్తిగా సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తక్ష‍ణ చర్యగా ప్రవేశాల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, బడ్జెట్ నిధుల కేటాయింపులపై దృష్టి సారించాలి.

Viyanna Rao

రచయిత :ప్రొ.కె. వియ్యన్నరావు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి,
సెల్: 7093260655

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్