గ్రీన్ ఇండియా మిషన్ (జిఐఎం)పై కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక పర్యావరణ, జీవావరణ పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వ మాటలకు, చేతలకు పొంతన లేనితనాన్ని బట్టబయలు చేసింది. అడవులను కాపాడటం, క్షీణించిన అడవులను పునరుద్ధరించడం, అటవీ ప్రాంతాన్ని విస్తరించడం (అటవీ- వృక్ష కవర్‌ను పెంచడం) జీవవైవిధ్యం, నీటి భద్రత, కార్బన్ నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం తదితర లక్ష్యాలతో 2014లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం ఆచరణలో విఫలమైన తీరును కాగ్ వెలికి తీసిన తీరు ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు దేశ వ్యాప్తంగా ఇప్పటికే దుష్ప్రభావాలను చూపుతున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందంటూ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న సమయంలో కీలకమైన ఒక మిషన్ విఫలమైందని తేలడం బాధాకరం. జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళిక (నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్-ఎన్‌ఎపిసిసి) లోని ఎనిమిది ప్రధాన మిషన్లలో గ్రీన్ ఇండియా మిషన్ కూడా ఒకటి! దీని ద్వారానే 2030 నాటికి 250 కోట్ల నుండి 300 కోట్ల టన్నుల అదనపు కార్బన్ సింక్‌ను పారిస్ ఒప్పందానికి అందిస్తామని అంతర్జాతీయ సమాజానికి మన దేశం వాగ్దానం చేసింది. 2014లో ప్రారంభమైనప్పటికీ 2015-16 నుండి దీని అమలు చేపట్టారు. 50 లక్షల హెక్టార్లలో అటవీ, వృక్ష కవర్‌ను పెంచడంతోపాటు మరో 50 లక్షల హెక్టార్లలో ఇప్పటికే ఉన్న అడవుల నాణ్యతను మెరుగుపరచాలన్నది ఈ మిషన్ లక్ష్యం. కానీ, 2015-16 నుండి 2024-25 వరకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ మిషన్ అమలుపై కాగ్ జరిపిన పరిశీలన దిగ్ర్భాంతికర వాస్తవాలను వెల్లడించింది. 10,600 కోట్ల రూపాయల నిధులు అవసరమౌతాయని మిషన్ ప్రతిపాదించగా పదేళ్ల కాలంలో అందింది కేవలం 1,1149 కోట్ల రూపాయలు మాత్రమే! నిధుల కొరతతో పాటు ప్రణాళిక లోపాలు, బలహీనమైన పర్యవేక్షణ, ఆర్థిక నియంత్రణలో లోపాలు మిషన్ అమలును దెబ్బతీశాయని కాగ్ పేర్కొంది.
వివిధ పథకాల మధ్య సమన్వయం నామమాత్రంగా కూడా లేదని కాగ్ తేల్చడం మరింత ఆందోళన కలిగించే విషయం. అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించినందుకు వసూలు చేసే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా)తోనూ, మొక్కల పెంపకం, భూ పునరుద్ధరణ పనులకోసం చేపట్టే గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ప్రస్తుతం విబి గ్రామ్ జి) పనులకు గ్రీన్ ఇండియా మిషన్‌ను అనుసంధానించాలని నిర్ణయించినప్పటికీ, ఆచరణలో అలా జరగలేదు. నగర్ వన్ యోజన, స్కూల్ నర్సరీ యోజన వంటి కార్యక్రమాలు కూడా పరస్పరం అనుసంధానమై పని చేయకుండా విడివిడిగా సాగుతున్నాయని ఆడిట్ పేర్కొంది. ఎనిమిది రాష్ట్రాలు అసలు వార్షిక ఖాతాలనే నిర్వహించలేదు. నిర్వహించిన చోటా ఆడిట్ కాకపోవడం లేదా లెక్కల్లో వ్యత్యాసాలు ఉండటం ఆర్థిక జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ తరహా చర్యలు అంతర్జాతీయ సమాజంలోనూ దేశ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఈ పథకం కొనసాగుతుండగానే ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరుతో ఒక చెట్టు) పథకాన్ని 2024లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 14 కోట్ల మెక్కలు నాటినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వ ప్రచారానికే తప్ప ఆచరణలో శూన్యంగానే తేలుతున్నాయి. 2023 నాటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు ప్రకారం దేశ వ్యాప్తంగా పచ్చదనం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగింది. దీనిలో కేవలం 156 చదరపు కిలోమీటర్లు మాత్రమే నిజమైన అడవి. మిగిలిన 1289చదరపు కిలోమీటర్ల ప్రాంతం నమోదైన అడవులకు వెలుపల ఉన్న ప్రాంతం! నమోదైన అడవిగా పేర్కొన్న ప్రాంతంలోనూ చెట్లు దట్టంగా లేవని, పలచనవుతున్నాయని పేర్కొనడం విస్మయం కలిగిస్తుంది. అంటే, పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు చెబుతున్నప్పటికీ, అడవుల పెరుగుదల మాత్రం లేదు.
మన రాష్ట్రంలోనూ దీనికి భిన్నంగా పరిస్థితులు లేవు. 2023 నాటి స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రికార్డు ప్రకారమే, అడవుల విస్తీర్ణం పెంచి చూపడానికి టక్కుటమార విద్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. వివిధ రకాల మొక్కలు నాటిన ప్రాంతాన్ని కూడా అటవీ విస్తీర్ణంలో కలిపి చూపించారని ‘డౌన్ టు ఎర్త్’ ఒక కథనం ప్రచురించింది. మరోవైపు అటవీ భూములను విచ్చలవిడిగా కార్పొరేట్లకు పంచిపెట్టే ప్ర్రకియ కొనసాగుతోంది. దీనికి వ్యతిరేకంగా, అటవీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న గిరిపుత్రులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడుతోంది. పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు, మైనింగ్ తదితర కార్యకలాపాలతో అడవి మరింతగా దెబ్బతింటోంది. తీర ప్రాంతంలో విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న పోర్టులు, ఇతర పారిశ్రామిక సంస్థలు, మైనింగ్ కార్యక్రమాలు తీర ప్రాంత పర్యావరణంతో పాటు, సముద్ర జీవావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. మడ అడవుల కూల్చివేత కొనసాగుతోంది. ఫలితంగా తీర ప్రాంత ప్రజలు తీవ్ర వాతావరణ సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. విచ్చల విడిగా సాగుతున్న ఈ విలయాన్ని నిలువరించడానికి బదులు తీరం పొడవునా ‘గ్రీన్ వాల్’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పర్యావరణ విధ్వంసానికి ఒకవైపు అనుమతిస్తూ, మరోవైపు మొక్కలు నాటే ఈ కృత్రిమ కార్యక్రమాలు ఏం ఫలితం ఇస్తాయి!







కామెంట్‌లు (0)