ఎన్నికల అధికారికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సాంకేతిక కారణాలతో ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ)కి ఆయన లేఖ రాశారు. తండ్రి పేరులో వ్యత్యాసం ఉందంటూ ఇటీవల తనకు నోటీసు జారీచేశారని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తనకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 2026 ‘సర్’ ప్రక్రియ సందర్భంగా ఓటరుగా నమోదై ఉన్నా ఇటీవల నోటీసు జారీ చేశారని తెలిపారు. అందులో 2002 లిస్టుకి ప్రస్తుత ఓటర్ల లిస్టుకి మధ్య తండ్రి పేరులో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారని వివరించారు. ఆగష్టు 21 మధ్యాహ్నం 12 గంటలకు “అసలు ధృవీకరణ పత్రాల”తో సర్కిల్ II జోనల్ కమిషనర్ ముందు హాజరు కమ్మని తెలియజేశారని, ఆ వ్యత్యాసం ఏమిటి? తాను ఏ రకమైన ధృవీకరణ పత్రాలు ఇవ్వాలో తెలియజేయలేదని వివరించారు. గమనిక పేరుతో 2 వ పేజీలో ఇచ్చిన అంశాలు ఓటరును భయపెట్టేవిగా ఉన్నాయని తెలిపారు. 44 లక్షల మంది ఓటర్లను ఇలా మానసిక హింసకు గురిచేయడం సరైందేనా అని ప్రశ్నించారు.
తండ్రి పేరులో ఉన్న తప్పు ఏమిటి? తెలుగులో అన్ని సరిగ్గానే ఉన్నాయని, మన రాష్ట్రంలో తెలుగు పదాలనే ప్రమాణికంగా తీసుకోవాలని సూచించారు. ఇంగ్లీషులో ఒక అక్షరం బదులు మరో అక్షరం ఉంటే ఎవరిది బాధ్యతని ప్రశ్నించారు. దీన్ని ఎవరు రాశారో తెలపాలన్నారు. ? తాను2016లో ఢిల్లీలో ఓటరునని, 2018లో విజయవాడకు ఓటరు కార్డు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానని పేర్కొన్నారు. ఇది మీ రికార్డుల్లో ఉంటుందని, ఢిల్లీ ఈపిఐసి కార్డులో ‘VENKATA SWAMY' అనే వుందని, ఆధార్‌లోనూ అదే వుందని, కానీ 2002 ఓటరు లిస్టులో లేదా ప్రస్తుతం విజయవాడలో ఓటరు లిస్టు ఆంగ్ల పదాల్లో ఉన్న తేడాకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఈ విషయంపై నోటీసు ఇచ్చి ఇలా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం సమంజసం కాదని, పేరులో వచ్చిన తేడాకు బాధ్యత ఎవరిదో తేల్చాలని కోరారు. తనదే బాధ్యత అయితే తెలియజేయాలని, లేదా ఎన్నికల అధికారుల తప్పయితే సరిదిద్దాలని కోరారు. అందుకు తనను ఇబ్బంది పెట్టడం ఏ విధంగానూ న్యాయం కాదని, అధికారుల బాధ్యతను తన మీద పెట్టడం సముచితం కాదని సూచించారు. తనలాగే రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో అత్యధిక భాగం సాంకేతిక పరమైన తప్పులు. అధికారుల స్థాయిలోనే సరిదిద్దగలిగినవని పేర్కొన్నారు. దీనికి అవసరమైన పత్రాలు సమర్పిస్తున్నానని, పరిశీలించి తన ఓటు హక్కును కాపాడాలని కోరారు.








కామెంట్‌లు (0)