పీరియడ్స్ ప్రారంభమైన టీనేజ్ పిల్లలకు తీవ్రమైన కడుపునొప్పి, వికారం, తలనొప్పి వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. దీనిని వైద్య పరిభాషలో ‘డిస్మెనోరియా’ అంటారు. అయితే ఇటీవల ఓ అధ్యయనం భవిష్యత్తులో ఇలాంటి నొప్పి వచ్చే అవకాశాన్ని మొదటి పీరియడ్ రాకముందే గుర్తించవచ్చని సూచించింది. అమెరికాలో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,254 మంది బాలికలను పరిశీలించారు. 9-10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులను నమోదు చేశారు. తరువాతి సంవత్సరాల్లో పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు వారికి ఎదురైన సమస్యలను పరిశీలించారు.
అధ్యయనంలో పాల్గొన్న వారిలో 57.6 శాతం మందికి 12–13 ఏళ్ల వయసులో డిస్మెనోరియా వచ్చింది. వీరిలో 19 శాతం మందికి తీవ్రమైన డిస్మెనోరియా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనతో పీరియడ్స్ మొదలయ్యే ముందు బాలికల్లో కనిపించే కొన్ని శారీరక లక్షణాలకు, భవిష్యత్తులో వచ్చే పీరియడ్స్ నొప్పికి సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా నొప్పి లేకపోయినా తరచూ కనిపించే శారీరక అసౌకర్యాలు తరువాత ‘డిస్మెనోరియా’ వచ్చే అవకాశంతో సంబంధం కలిగి ఉన్నాయి. అలాగే 9-10 ఏళ్ల వయసులోనే యుక్తవయస్సు మార్పులు వేగంగా ప్రారంభమవడం కూడా మూడేళ్ల తరువాత పీరియడ్స్ నొప్పి వచ్చే అవకాశాన్ని పెంచినట్లు అధ్యయనం తెలిపింది. ముందుగా యుక్తవయస్సు మార్పులు ప్రారంభమైన బాలికల్లో తరువాత ‘డిస్మెనోరియా’ వచ్చే అవకాశం దాదాపు 1.8 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. చిన్న వయసులో నిద్ర సమస్యలు ఉన్న బాలికల్లో తరువాత వచ్చే పీరియడ్స్ నొప్పి రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అధ్యయనం సూచించింది. అయితే నిద్ర సమస్యలకు భవిష్యత్తులో డిస్మెనోరియా వచ్చే అవకాశంతో నేరుగా సంబంధం కనిపించలేదు.
ఈ పరిశోధనలోని ముఖ్యమైన అంశం ఏమిటంటే.. పీరియడ్స్ మొదలయ్యే వరకు వేచి చూడకుండా, అంతకుముందే ప్రమాదంలో ఉన్న బాలికలను గుర్తించే అవకాశం ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తద్వారా నొప్పి తీవ్రమయ్యేలోపే వైద్య సలహా, జీవనశైలి మార్పులు, అవసరమైన చికిత్స వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి బాలికకూ భవిష్యత్తులో తప్పనిసరిగా తీవ్రమైన పీరియడ్స్ నొప్పి వస్తుందని అధ్యయనం చెప్పడం లేదు. ఇవి ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే సంకేతాలు మాత్రమే! ఈ అధ్యయనం పరిశోధనా పత్రం ‘ద లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్’లో ప్రచురితమైంది.







కామెంట్‌లు (0)