గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజ్ఞానేష్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందే!

2 గంటల క్రితం

జ్ఞానేష్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందే!
- ఏకతాటిపైకి విద్యార్థి సంఘాలు
-  ఐక్య ఉద్యమాలకు పిలుపు
- అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌ 2.0
- ఎస్‌ఎఫ్‌ఐ, సిజెపి, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్ఎ, ఎఎస్ఎపి నేతల సంయుక్త ప్రకటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 07:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఏకతాటిపైకి విద్యార్థి సంఘాలు

  • ఐక్య ఉద్యమాలకు పిలుపు

  • అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌ 2.0

  • సిజెపి, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్ఎ, ఎఎస్ఎపి నేతల సంయుక్త ప్రకటన

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ​ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా సాగుతున్న పోరాటాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఎస్‌ఎఫ్‌ఐ, సిజెపి, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్ఎ, ఎఎస్ఎపి తదితర విద్యార్థి, యువజన సంఘాలు నిర్ణయించాయి. జ్ఞానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో దేశంలోని యువత, విద్యార్థి సంఘాలు, ప్రజలు ఒక్కతాటిపై ఉన్నారని ఆయా సంఘాల నాయకులు వెల్ల‌డించారు. ఇది బిజెపికి, దేశ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధ‌వారం నాడిక్క‌డ ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజి, సిజెపి జాతీయ కో కన్వీనర్‌ సౌరభ్‌ దాస్‌, సిజెపి న్యాయ విభాగం ప్రతినిధి రత్నా సింగ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ అఖిల భారత అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, ఎఐఎస్ఎ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరా, ఎఎస్ఎపి కో ఇన్‌ఛార్జ్‌ ఈష్నా గుప్తా మాట్లాడారు. జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌కు భారీ మార్చ్‌ నిర్వహించాలని సంఘాలు నిర్ణయించాయ‌ని తెలిపారు. రాజీనామాతోపాటు జ్ఞానేష్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని, ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

​నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటం : ఆదర్శ్‌ ఎం. సాజి

​ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను జ్ఞానేష్‌ కుమార్‌ హత్య చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజి విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా తాము ఐక్యంగా పోరాడతామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటమని అన్నారు. ఈ పోరాటంలో ప్రజాస్వామ్యం, భారత ప్రజలే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

​ జెన్‌ జీకి ప్రభుత్వం భయపడుతోంది : సౌరవ్‌ ‌దాస్‌

​ జ్ఞానేష్‌ కుమార్‌ వంటి దేశద్రోహులు కీలక పదవుల్లో కొనసాగుతున్నంతకాలం దేశం పురోగతి సాధించదని సిజెపి జాతీయ కో కన్వీనర్‌ సౌరభ్‌ దాస్‌ అన్నారు. ఇలాంటి వారిని వ్యవస్థ నుంచి బయటకు పంపాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ముఖ్యంగా జెన్‌-జీ యువత ఈ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జెన్‌-జీ యువతను ప్రభుత్వం భయపడుతోందని సౌరభ్‌ దాస్‌ ఆరోపించారు. 2024 నుంచి జెన్‌-జీ యువతను ఓటర్ల జాబితాలో చేర్చకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. జెన్‌-జీ ఓట్లు తమకు అనుకూలంగా ఉండవనే భయంతోనే బిజెపి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

​ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు : నేహా బోరా

​ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఒక విస్తృత పౌర ఉద్యమంగా పరిణామం చెందాయని ఎఐఎస్ఎ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. ప్రజాస్వామ్యం, ఓటర్ల జాబితాలు, నిరసన తెలిపే హక్కుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియపై ఆందోళనలు, ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారనే ఆరోపణలు పౌరులకు అత్యవసర సమస్యగా మారాయన్న సందేశాన్ని పోరాటం పంపిందని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను పరిరక్షించాల్సిన ఒక వ్యక్తి, ఒక సంస్థ నుండి జవాబుదారీతనం కోరడమే ఈ ఆందోళ‌న‌ లక్ష్యమని ఆమె అన్నారు.

​ అనుమతి కోరుతూ వినతి

​అక్టోబర్‌ 10న జంతర్‌మంతర్‌లో నిర్వహించనున్న నిరసనకు అధికారిక అనుమతి కోరుతూ సిజెపి నేత సౌరభ్‌ దాస్‌ పార్లమెంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. జంతర్‌మంతర్‌లో నిర్వహించనున్న ఆందోళన సుదీర్ఘంగా కొనసాగుతుందని వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాకు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతను కాపాడాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని సంఘాల నాయకులు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్