ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఉదయం 5:20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రాథమికంగా నానా పటేకర్ తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు వైద్య బృందం సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు (MLC) నమోదు చేసినట్లు మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ వెల్లడించినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
నానా పటేకర్ ఆకస్మిక మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘పరిందా’, ‘ప్రహార్’, ‘అంగార్’, ‘క్రాంతివీర్’, ‘తిరంగా’, ‘ఖామోషి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి.
75 ఏళ్ల వయసులోనూ నానా పటేకర్ సినిమాల్లో చురుకుగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ‘హౌస్‌ఫుల్ 5’లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులతో కలిసి నటించారు. అలాగే విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి నటించిన ‘ఓ’రోమియో’లోనూ కనిపించారు. అనిల్ కపూర్, రాధికా మదన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుబేదార్’లోనూ అతిథి పాత్ర పోషించారు. నానా పటేకర్ మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటుగా అభిమానులు, సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ గోవాకు బయలుదేరినట్లు సమాచారం. కుటుంబం నుంచి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.







కామెంట్‌లు (0)