- దెబ్బతిన్న ముందుభాగం
పాట్నా : పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంపై 17,000 అడుగుల ఎత్తులో పిడుగుపడింది. ఈ ఘటనలో విమానం ముందు భాగంలోని రాడోమ్ దెబ్బతింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వడగళ్ల ప్రభావంతో ఈ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే విమానం బుధవారం లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వెల్లడించింది. ల్యాండింగ్ సమయంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే దాన్ని సేవల నుంచి తాత్కాలికంగా తప్పించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. విమానానికి అవసరమైన మరమ్మతులు, సాంకేతిక తనిఖీలు పూర్తయ్యే వరకు దాన్ని నడపబోమని అధికారులు తెలిపారు. తనిఖీలు పూర్తయి, సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చిన తర్వాతే విమానాన్ని తిరిగి సేవల్లోకి తీసుకురానున్నారు.
కాగా, గత నెలలోనూ ఇండిగో విమానానికి ఇదే తరహాలో అసాధారణ ఘటన ఎదురైంది. గౌహతి నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో బలమైన గాలుల ప్రభావంతో దాని తోక భాగం రన్‌వేను తాకింది. ఆ ఘటన అనంతరం కూడా విమానాన్ని నిలిపివేసి సాంకేతిక తనిఖీలు చేపట్టారు.







కామెంట్‌లు (0)