గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నటుడే కాదు.. సామాజిక సేవకుడు కూడా..

1 గంట క్రితం

nana patkar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 08:49 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- నానా పటేకర్ గురించి ఆసక్తికర విషయాలు

వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత నానా పటేకర్ భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కళాకారుల్లో ఒకరు. ముఖ్యంగా హిందీ, మరాఠీ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన చిన్న వయసులోనే కష్టాలను ఎదుర్కొన్నారు. 13 ఏళ్ల వయసులోనే పని చేయడం ప్రారంభించానని, రోజుకు 16 కిలోమీటర్లు నడుస్తూ పనిచేసేవాడినని ఆయన గతంలో వెల్లడించారు.

నానా పటేకర్‌ను కేవలం విలక్షణ నటుడిగానే కాకుండా, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తిగా కూడా గుర్తిస్తారు. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. రంగస్థల అనుభవంతో వచ్చిన నానా పటేకర్ ‘పరిందా’, ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’, ‘అంగార్’, ‘తిరంగా’, ‘క్రాంతివీర్’, ‘అగ్ని సాక్షి’, ‘ఖామోషి: ది మ్యూజికల్’, ‘గులామ్-ఎ-ముస్తఫా’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘అపహరణ’, ‘రాజ్‌నీతి’, ‘వెల్‌కమ్’, ‘వెల్‌కమ్ బ్యాక్’, ‘నటసమ్రాట్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ‘క్రాంతివీర్’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, ‘అగ్ని సాక్షి’, ‘ఖామోషి’ చిత్రాలకు జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డులు అందుకున్నారు.

సినిమాలతో పాటు రైతులు, గ్రామీణ ప్రజల సమస్యలపై నానా పటేకర్ చేసిన సేవ కూడా ఆయన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం. 2015లో మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి నామ్ ఫౌండేషన్ (NAAM Foundation)ను ప్రారంభించారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు, కరువు, నీటి కొరత వంటి సమస్యలపై ఈ సంస్థ పనిచేస్తోంది. రైతులకు కేవలం ఆర్థిక సహాయం అందించడం కాకుండా నీటి సంరక్షణ, గ్రామాల అభివృద్ధి, రైతులకు సామాజిక మద్దతు వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోంది. రైతులకు డబ్బు ఇవ్వడం మాత్రమే పరిష్కారం కాదని, వారికి ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం, సామాజిక మద్దతు అవసరమని నానా పటేకర్ పలుమార్లు చెప్పారు.

“మీ జీవితాన్ని ముగించుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి”.. కరువు, పంట నష్టం, అప్పుల కారణంగా ఆత్మహత్య అంచున ఉన్న మహారాష్ట్ర రైతులతో నానా పటేకర్ అన్న మాటలివి. జీవితాలను ముగించుకోవాలనిపిస్తే అలాంటి నిర్ణయం తీసుకోకుండా తనకు ఫోన్ చేయాలని రైతులను ఆయన కోరారు.

రైతుల బాధలను ప్రత్యక్షంగా చూడటం వల్ల తన జీవితం మారిపోయిందని నానా పటేకర్ పలుమార్లు చెప్పారు. రైతులే దేశానికి జీవనాధారమని, వారు ఎదుర్కొంటున్న సంక్షోభం యావత్ దేశ సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై ఓ టెలివిజన్ వార్తా కథనాన్ని చూసిన తర్వాత సామాజిక సేవపై మరింత దృష్టి పెట్టాలని నానా పటేకర్ నిర్ణయించుకున్నారు.

విదర్భలోని బీడ్ వంటి ప్రాంతాల్లో తాను చేసిన పర్యటనలు తనపై గొప్ప ప్రభావం చూపాయని ఆయన తెలిపారు. రైతుల మరణాలతో కుంగిపోయిన కుటుంబాలు, పిల్లలను చూడటం వల్ల తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం తనకు అర్థమైందని చెప్పారు. ఆ తర్వాత సంక్షేమం, నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పనిచేసే ‘నామ్ ఫౌండేషన్’ కార్యకలాపాలు విస్తరించాయి.

లౌకికవాదం, మత సామరస్యంపై కూడా నానా పటేకర్ గతంలో స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమంలో “మనమందరం భారతీయులం.. అదే మన మతం కావాలి” అనే భావనను వ్యక్తం చేశారు. హిందూ–ముస్లిం విభజన తనకు ఆమోదయోగ్యం కాదని, రెండు వర్గాల ప్రజలు ఈ దేశానికి చెందినవారేనని, కలిసి జీవించాల్సిన అవసరం ఉందని ఆయన ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. తన సోదరి అబ్బాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కులం, మతంపై తన వ్యక్తిగత దృక్పథాన్ని వివరిస్తూ, దేశం లౌకికమైనదైతే ప్రభుత్వ పత్రాల్లో కులం, మతం కోసం ప్రత్యేక కాలమ్స్ ఎందుకు ఉండాలనే ప్రశ్నను కూడా నానా పటేకర్ గతంలో లేవనెత్తారు.

2022లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చుట్టూ జరిగిన చర్చ సందర్భంగా కూడా హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఈ దేశానికి చెందినవారేనని, సమాజంలో విభజన కోరుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుల మాటలు ప్రజలను మరింతగా విభజించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన వివిధ సందర్భాల్లో పేర్కొన్నారు. సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నానా పటేకర్, తెర బయట రైతుల సమస్యలు, కుల–మత విభజన, మత సామరస్యం, సామాజిక ఐక్యత వంటి అంశాలపై స్పందించడం ద్వారా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్