బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅవమానం నుంచి గౌరవం వరకు...

1 గంట క్రితం

జీవన.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 06:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

‘చెత్త ఏరుకునేది’ అన్న అవమానకర మాటలు చాలామంది పారిశుధ్య కార్మికురాళ్లు నిత్యం పడుతూనే ఉంటారు. త్రిపురలోని పింకీ కర్ దేవ్ కూడా ఆ మాటలు పడింది. తొమ్మిదేళ్లుగా వీధుల్లో తిరిగి చెత్త సేకరించడం, దుర్గంధం మధ్య పనిచేయడం, చేతులకు గ్లౌజులు లేకుండా తడి, పొడి చెత్తను వేరు చేయడం.... ఆమె దినచర్యగా ఉండేది. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు తను చెత్త నిర్వహణ సహకార సంఘంలో యజమాని. తనలాంటి వంద మంది మహిళలు కలిసి ఆ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. సమర్థవంతంగా వ్యవస్థను నిర్వహిస్తున్నందుకు ప్రజలు, అధికారులు ఆమెను ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఒక చిన్న ప్రయత్నం పింకీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

కొండ ప్రాంతమైన ఖొవాయ్‌లో అధికారులు చెత్త నిర్వహణలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. చెత్తను సేకరించే మహిళలే దాని నిర్వహణలో కీలక పాత్ర పోషించేలా సహకార వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలా పింకీకి ఈ అవకాశం దక్కింది. దీని గురించి తను ఇలా మాట్లాడుతోంది. “ఇప్పుడు మేము పనివాళ్లం కాదు. యజమానులం. ఇతరులు ఆజ్ఞాపిస్తే పనిచేసే రోజుల నుంచి మేమే నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చాం” అంటోంది. ఇప్పుడు పింకీ దినచర్య పూర్తిగా మారిపోయింది. ఎక్కడా కుళ్లిన తొక్కలు, పాడైపోయిన వ్యర్థాలు లేవు. ఏ వీధి కుక్కా చిరిగిన చెత్త సంచిని చిందరవందర చేయడం లేదు. దారిలో నడుస్తూ ఏ బాటసారి ముక్కు మూసుకోవడం లేదు. ఏళ్ల తరబడి అక్కడ దుర్గంధం వెదజల్లిన చెత్త బుట్ట కూడా కనిపించడం లేదు.

ఖొవాయ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నిర్మల్ కుమార్ తలపెట్టిన ఈ కార్యక్రమం 2026 ఏప్రిల్–మేలో ‘ఖొవాయ్ వేస్ట్ టు వెల్త్ ప్రొడ్యూసర్ సొసైటీ’గా నమోదైంది. పారిశుధ్య కార్మికులకు తక్కువ వేతనాలు, నిర్ణయాధికారం లేకపోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేయాల్సి రావడం గమనించిన నిర్మల్ కుమార్ వారికి మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ఆలోచనతో సహకార సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వ్యర్థాలను ఉపయోగకరమైన సంపదగా ఎలా మార్చాలన్న ఆలోచనకు ఆచరణాత్మక వ్యవస్థే ఇది. దీని వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అగర్తలాకు చెందిన వ్యర్థాల నిర్వహణ నిపుణుడు సమీర్ కీలక పాత్ర పోషించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై బెంగళూరులోని ఆర్మీ శిక్షణ కేంద్రంలో సమీర్ 90 రోజులపాటు ప్రాక్టికల్ శిక్షణ తీసుకుని వచ్చారు. సహకార సంస్థలో భాగమైన వంద మంది మహిళలు బృందాలుగా విడిపోయి పనులను పంచుకున్నారు. ఒక బృందం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తుంది. మరో బృందం వార్డు కేంద్రాల్లో వ్యర్థాలను వేరు చేస్తుంది. ఇంకో బృందం తుది కేంద్రంలో వ్యర్థాలను వేరు చేసి ప్యాకింగ్ చేస్తుంది. పట్టణంలో ఎక్కడైనా బహిరంగంగా చెత్త పడేసినా ట్రక్కుల్లో తిరుగుతూ మరో బృందం దాన్ని సేకరిస్తుంది.

ఈ విధానంలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమే. సంస్థ తరపున ఇంటింటికీ వెళ్లి చెత్తను మూలస్థాయిలోనే మూడు రకాలుగా వేరు చేయాలని ఈ మహిళలు అవగాహన కల్పించారు. పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఇప్పుడు ఖొవాయ్‌లో 90 శాతానికి పైగా కుటుంబాలు చెత్తను ఇంటి వద్దే వేరు చేస్తున్నాయి. బహిరంగంగా చెత్త పేరుకుపోవడం కూడా దాదాపు 90 శాతం తగ్గింది. ఈ మార్పు మహిళల ఆదాయంపైనా ప్రభావం చూపింది. ప్రతి నెలా ఆదాయాన్ని కొద్దికొద్దిగా పెంచే విధానం కూడా ప్రారంభించారు. ముఖ్యంగా ఈ డబ్బు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే వెళ్తుంది. మధ్యవర్తులు లేకపోవడం మరో ప్రత్యేకత.

మహిళల పాత్ర కేవలం చెత్త సేకరణకే పరిమితం కాలేదు. వార్డు కేంద్రాల నుంచి తుది వ్యర్థ నిర్వహణ కేంద్రం వరకు వివిధ బాధ్యతలను వారి అర్హత, అనుభవం ఆధారంగా అప్పగించారు. పింకీ లాంటి మహిళలకు ఈ మార్పు కేవలం జీతం పెరగడం కాదు. తన పనిపట్ల, తనపై సమాజం చూపే దృష్టిలో వచ్చిన మార్పు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్