ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గాలిలోనే ఆవిరవుతున్న వర్షం..!

2 గంటల క్రితం

rain evaporates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 12:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పశ్చిమ కనుమల్లో వర్షంలో సగటున 25 శాతం భాష్పీభవనం: ఐఐటిఎం అధ్యయనం

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షంలో సగటున నాలుగో వంతు (25 శాతం) వర్షపు నీరు నేలను తాకకముందే గాలిలోనే ఆవిరైపోతుంది. పశ్చిమ కనుమల్లో కురిసే వర్షంలో సగటున 25శాతం భాష్పీభవనమవుతోందని పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటరాలజీ (ఐఐటిఎం) శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో ఈ ప్రక్రియను ప్రత్యక్ష పరిశీలనల ఆధారంగా పరిమాణాత్మకంగా అంచనా వేయడం ఇదే మొదటిసారి. ఈ పరిశోధన ఫలితాలు వాతావరణ అంచనాలు, రుతుపవన నమూనాలు, శీతోష్ణస్థితి అధ్యయనాలను మరింత ఖచ్చితంగా రూపొందించడంలో ఉపయోగపడనున్నాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉండే నైరుతి రుతుపవనాల కాలంలో సగటున 25 శాతం వర్షపు నీరు ఆవిరైపోతుందని పరిశోధకులు తెలిపారు. రోజువారీ పరిస్థితులను అనుసరించి ఈ నిష్పత్తి 4 శాతం నుంచి 61 శాతం వరకు మారుతోందని అన్నారు. ఈ పరిశోధన 'అట్మాస్పెరిక్‌ కెమిస్ట్రీ అండ్‌ ఫిజిక్స్‌ ' అనే జర్నల్‌లో ప్రచురితమైంది. పశ్చిమ కనుమల్లో వర్షపు బిందువుల భాష్పీభవనంపై ఇది తొలి పరిశీలనాత్మక అంచనా అని, ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సైకత్‌ సేన్‌ గుప్తా తెలిపారు. ప్రస్తుతం హిమాలయాల నుంచి ఈశాన్య రాష్ట్రాలు, పోర్ట్‌బ్లెయిర్‌ వరకు తొమ్మిది కేంద్రాల్లో వర్షపు నీటి ఐసోటోప్‌ నమూనాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.


వర్షపు బిందువులు నేలకు చేరకముందే ఆవిరైపోతే, అవి చుట్టూ ఉన్న గాలి నుంచి వేడిని గ్రహించి దిగువ వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఇది చల్లని గాలి ప్రవాహాలు ఏర్పడి, మేఘాల అభివృద్ధి, తదుపరి వర్షపాతం, ఉరుములు-మెరుపులు, తుఫాన్ల ఏర్పాటుపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రక్రియను సరైన విధంగా అంచనా వేయకపోతే వర్షపాతం అంచనాలు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రపంచంతో పోలిస్తే...ఉష్ణమండల ప్రాంతాల్లో సగటు భాష్పీభవనం 20శాతమని, పశ్చిమ కనుమల్లో 25శాతం, జ్యురిచ్‌ 40 శాతం, బార్బడోస్‌ సమీపం 60శాతంగా ఉంటుంది. పొడి గాలి, చిన్న నీటి బిందువులు ఉన్న ప్రాంతాల్లో భాష్పీభవనం అధికంగా ఉంటుందని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు నీటిలోని భారీ ఐసోటోపులు ఆధారంగా భాష్పీభవనాన్ని లెక్కించారు. వర్షపు బిందువు ఆవిరయ్యే సమయంలో తేలికపాటి అణువులు ముందుగా ఆవిరైపోవడంతో మిగిలిన నీటిలో భారీ ఐసోటోపుల శాతం పెరుగుతుంది. ఈ మార్పును లేజర్‌ స్పెక్ట్రోమీటర్‌తో కొలిచి, ప్రత్యేక కంప్యూటర్‌ నమూనా ద్వారా భాష్పీభవన రేటును నిర్ధారించారు. 2019 రుతుపవన కాలంలో పుణెలో ఈ ప్రయోగం నిర్వహించిన పరిశోధకులు, ఇప్పుడు దేశవ్యాప్తంగా నిజ సమయంలో వాతావరణ ఆవిరిలోని ఐసోటోప్‌లను కొలిచే పోర్టబుల్‌ పరికరాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. దీంతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భాష్పీభవన తీవ్రతను మ్యాప్‌ చేయడం, వాతావరణ నమూనాలను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని ఐఐటిఎం శాస్త్రవేత్తలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్