గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల విస్తరణ

3 గంటల క్రితం

rains2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 11:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాయి. సాధారణంగా జులై 8 నాటికి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని, కానీ ఈ ఏడాది ఒకరోజు ఆలస్యంగా ఇది జరిగిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌‌ల్లోని మిగిలిన ప్రాంతాలకు కూడా చేరుకోవడంతో ఈ నెల 9నాటికి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడం పూర్తయిందని పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా ఆలస్యమైన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్‌1‌న కేరళలోకి ప్రవేశించే రుతువపనాలు ఈ సారి జూన్‌ 4‌న ఆ రాష్ర్టానికి చేరుకున్నాయి.

కాగా, జూలైలో ఇప్పటివరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని ఐఎండి తెలిపింది. ఈ నెల మొదటి తొమ్మిది రోజుల్లో సాధారణ వర్షపాతం 73.8 మి.మీ ఉండగా, దేశవ్యాప్తంగా 101.9 మి.మీ వర్షపాతం నమోదైంది.

జూలైకు సంబంధించి జూన్ 30న ప్రకటించిన ముందస్తు అంచనాలో నెలలోని మొదటి పది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే, దేశవ్యాప్తంగా జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, వర్షపాతం దీర్ఘకాలిక సగటు (ఎల్‌‌పిఎ)లో 94 శాతంగా ఉంటుందని ఐఎండి హెచ్చరించింది. ఎల్‌‌పిఎ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో నెల లేదా సీజన్ వ్యవధిలో నమోదైన వర్షపాతాన్ని, సుదీర్ఘ కాలానికి (సాధారణంగా 30 నుండి 50 ఏళ్లు) సగటు చేయడం. ​అలాగే, జూన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతంలో సుమారు 40 శాతం లోటు కనిపించింది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో అత్యంత తీవ్రంగా 50.4 శాతం లోటు నమోదయింది. 1901 తర్వాత జూన్‌ ‌నెలకు సంబంధించి దేశంలో ఐదవ అత్యల్ప వర్షపాతాన్ని (99.5 మి.మీ) నమోదు అయింది. అదేవిధంగా, ఐఎండి గణాంకాల ప్రకారం జూన్ 1 నుండి జూలై 9 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం వర్షపాతంలో 14 శాతం లోటు నమోదయింది. ఐఎండి అంచనాల ప్రకారం ఈ ఏడాది మొత్తం రుతుపవనాల సీజన్లో 90 శాతం లోటు వర్షపాతం నమోదవుతుంది. ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణం భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడ్డమేనని ఐఎండి, వాతావరణ రంగ నిపుణులు చెబుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్