గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆస్ట్రేలియా నుండి యురేనియం

3 గంటల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అణు విద్యుత్, సముద్ర జలాల భద్రత సహా పలు ఒప్పందాలు

  • రక్షణ, భద్రతా సహకారంపై జాయింట్‌ డిక్లరేషన్‌

  • అల్బనీస్‌‌తో చర్చలు అద్భుతంగా జరిగాయన్న మోడీ

మెల్‌‌బోర్న్‌ : భారత్‌ ‌అణు విద్యుత్‌ ‌ప్రాజెక్టులకు అవసరమైన యురేనియాన్ని ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది. ఇరు దేశాల మధ్య గురువారం 18 ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌‌తో చర్చలు జరిపిన అనంతరం రక్షణ, భద్రతా సహకారంపై జాయింట్‌ ‌డిక్లరేషన్‌‌పై సంతకాలు జరిగాయి. ప్రధానంగా పౌర అణు విద్యుత్‌, దీనితో పాటూ సముద్ర జలాల భద్రతపై సహకారం, ప్రణాళిక, ఇంధన భద్రతపై సంయుక్త ప్రకటన, సైబర్‌ ‌భాగస్వామ్యం, కీలకమైన సాంకేతికతలు, సరఫరా గొలుసులకు సంబంధించిన ఒప్పందాలు, ప్రకటనలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. చారిత్రక పౌర అణు సహకార ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు జరిగిన 12ఏళ్ళ తర్వాత భారత్‌ ‌అణు విద్యుత్‌ ‌ప్రాజెక్టులకు అవసరమైన యురేనియాన్ని ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది. అల్బనీస్‌‌తో చర్చలు అద్భుతంగా జరిగాయని మోడీ వ్యాఖ్యానించారు. పునర్వినియోగ ఇంధనం, వాతావరణ మార్పులపై చర్యలు, అణు ఇంధనం, కీలకమైన ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి రంగాలకు సంబంధించిన చర్చలు బాగా జరిగాయన్నారు. నౌకా నిర్మాణం, నౌకల మరమ్మత్తులు, నిర్వహణ వంటి రంగాల్లో సన్నిహితంగా కలిసి పనిచేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఇండోనేషియా నుండి ఆస్ట్రేలియా చేరుకున్న మోడీ ఇక్కడ బిజీ బిజీగా గడిపారు. శాంతియుత ఇండో- పసిఫిక్‌‌కు హామీ కల్పించడంలో కీలకమైన ద్వైపాక్షిక భాగస్వామ్యం పాత్రను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని, ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందాన్ని వేగంగా ఖరారు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఇంధన భద్రత ఒప్పందం కింద సుస్థిరమైన, భద్రమైన, విశ్వసనీయమైన రీతిలో బొగ్గు, డీజిల్‌,ఇతర ద్రవ ఇంధనాలు, ఖనిజ వాయువుల సరఫరాను కొనసాగించడం ద్వారా భద్రతను బలోపేతం చేసుకునేందుకు నేతలు అంగీకరించారు. అనంతరం మోడీ మీడియా ప్రకటనను విడుదల చేశారు. అణు ఇంధన రంగంలో కీలక ఒప్పందం ఈ రోజు కుదిరిందన్నారు. దీనివల్ల భారత్‌‌కు ఆస్ట్రేలియా నుండి యురేనియం సరఫరాలు అందుతాయని, తద్వారా భారత పరిశుద్ధ ఇంధన లక్ష్యాలకు కొత్త వూపు వస్తుందని మోడీ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలోనూ ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇండియా-ఆస్ట్రేలియా డిఫెన్స్‌ ఇన్నొవేషన్‌ ‌కారిడార్‌ ‌ద్వారా రక్షణ రంగ స్టార్టప్‌‌లు, పరిశ్రమలను అనుసంథానించడానికి కృషి చేస్తామన్నారు. అల్బనీస్‌ ‌మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని వైవిధ్యమైన రంగాలకు విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. కొత్తవి, కీలకమైన, ప్రాధాన్యమున్న అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు. భారత్‌‌ను అత్యున్నత భద్రతా భాగస్వామిగా భావిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్