విద్యా సంస్కరణలపై మేనిఫెస్టో విడుదల
పుణే : పరిపాలనలో జవాబుదారీతనం ఉండాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) స్పష్టం చేసింది. తప్పులను అంగీకరించని వారు విద్యా వ్యవస్థలను ఎలా నడుపుతారని సిజెపి వ్యవస్థాపకులు అభిజీత్ దిప్కే ప్రశ్నించారు. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సిజెపి గురువారం పుణేలోని సావిత్రిభాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయం (ఎస్పిపియు) వేదికగా భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిజీత్ దిప్కే పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో హిందూ - ముస్లిం వంటి మత రాజకీయాలను సహించకూడదని, విద్వేషాల్లో భాగస్వామ్యం కావొద్దని యువతను కోరారు. ఈ వెనుకబడిన రాజకీయాల కారణంగా, ప్రపంచం ఎఐ, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ భారత్ వెనుకబడిపోయిందని తెలిపారు. దేశవ్యాప్త ప్రభుత్వ పరీక్షల నిర్వహణలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలపై సిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది.
విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
నీట్-యుజి పేపర్ లీకేజీ, సిబిఎస్ఇ మూల్యాంకనంలో దొర్లిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సిజెపి పునరుద్ఘా టించింది. ‘కనీసం తప్పు జరిగిందని ఒప్పుకోవ డానికి, రాజీనామా చేయడానికి సిద్ధంగా లేని వారు విద్యా వ్యవస్థను ఎలా చక్కదిద్దుతారని మేము ఆశించగలం? మార్పు అనేది తప్పును అంగీకరించడంతోనే మొదలవుతుంది’ అని అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. ఈ ఉద్యమం గురించి దిప్కే వివరిస్తూ, ఇది అనుకోకుండా మొదలైన ప్రయాణమన్నారు. ‘నేను సిజెపి గురించి ట్వీట్ చేసిన రోజున ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను. కానీ ప్రజల నుంచి వచ్చిన స్పందన నన్ను ఈ దిశగా నడిపించింది’ అని ఆయన అన్నారు. సిజెపి అనుచరులు ‘బాట్లు’ అని వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. తమ ఫాలోవర్లలో 94.5 శాతం మంది భారతీయులేనని ఆధారాలను చూపించారు. ‘'ప్రశ్నించే జర్నలిస్టులు, విద్యార్థులు పాకిస్తానీలా? కేవలం బిజెపి ఐటి సెల్ మాత్రమే భారతీయులా?’` అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
పుణే ఎంచుకోవడానికి కారణం
ఢిల్లీ తర్వాత పుణేను నిరసన వేదికగా ఎంచుకోవడానికి ఇక్కడి విద్యా ప్రాముఖ్యతే కారణమని దిప్కే తెలిపారు. ‘తూర్పు ఆక్స్ఫర్డ్’గా పేరుగాంచిన పుణే విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ 2020లో 12వ స్థానంలో ఉండగా, నేడు అది 91వ స్థానానికి పడిపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలు అధికారంలో ఉన్నవారికి 12 ఏళ్ల సమయం ఇచ్చారు. మాకు కనీసం 12 వారాల సమయం ఇవ్వండి’ అని యువతను దిప్కే కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్తో పాటు పుణేకు చెందిన పలువురు ప్రొఫెసర్లు తమ మద్దతును ప్రకటించారు. దేశవ్యాప్తంగా పర్యటించి యువతను విద్యా సమస్యలపై చైతన్యపరుస్తామని సిజెపి ప్రకటించింది.









కామెంట్లు (0)