గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్షభావంతో తగ్గిన జలవిద్యుత్

2 గంటల క్రితం

Vijayanand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పూర్తి సామర్ధ్యంతో థర్మల్‌ యూనిట్లు

  • సమీక్షలో విజయానంద్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నైరుతి రుతుపవనాల మందగమనంతో పాటు వర్షభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. జెన్ కోపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. గతేడాది ఇదే సమయంలో రోజుకు 25 నుంచి 30 మిలియన్ యూనిట్ల(ఎంయు) వరకు జల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జలాశయాలకు తగినంత నీటి ప్రవాహాలు లేకపోవడంతో కేవలం రోజుకు 5 నుంచి 6 ఎంయుల ఉత్పత్తి వరకే పరిమితమయిందని చెప్పారు. ప్రస్తుతం సీలేరు జల విద్యుత్ సముదాయంలోని అన్ని జలాశయాల్లో కలిపి సుమారు 34 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు.

వీటిని అత్యంత ప్రణాళికాబద్ధంగా, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకే వినియోగిస్తే మరో 90 నుంచి 100 రోజుల వరకే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత సమర్ధవంతంగా, పొదుపుగా వినియోగించేలా రిజర్వాయర్ల నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటివరకు కృష్ణా డెల్టా జలశాయాలకు గణనీయమైన నీటి ప్రవాహాలు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నివో ప్రభావం కొనసాగితే ప్రస్తుత సీజన్ లో కృష్ణా బేసిన్ లోని జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాకపోవచ్చని తెలిపారు. గతేడాది ఇదే కాలంలో కృష్ణా జల విద్యుత్ కేంద్రాల నుంచి 25 నుంచి 30 ఎంయుల ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ ఏడాది గత 5 నుంచి 10 ఏళ్ల సగటుతో పోల్చినా నీటి ప్రవాహాలు అత్యంత తక్కువగా ఉన్నాయని వివరించారు. ఎల్ నివో ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సిఇఎ) దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలు వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత వివేకంతో వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉండే పీక్ అవర్స్ లో మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనివల్ల నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు విద్యుత్ వ్యవస్థ స్థిరత్వాన్ని కూడా కాపాడవచ్చునని తెలిపారు.

పూర్తిసామర్ధ్యంతో థర్మల్ యూనిట్లు

జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గనున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమవుతుందని చెప్పారు. వార్షిక మరమ్మతులు జరుగుతున్న యూనిట్లు మినహా మిగిలిన అన్ని థర్మల్ యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని ఆదేశించారు. డిమాండ్ తక్కువగా ఉండే సమయంలోనే మరమ్మతుల పనులను చేపట్టేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. అధిక డిమాండ్ సమయంలో అన్ని యూనిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కనీసం పది రోజులకు సరిపడా ఎల్లప్పుడూ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనికోసం ఫ్యూయల్ సరఫరా అగ్రిమెంట్ల కింద బొగ్గు సరఫరా, రైల్వే రేకుల కేటాయింపు, రైలు-సముద్ర రవాణా సమన్వయం, పోర్టుల ద్వారా సరఫరా తదితర అంశాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చూడాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జెన్ కో ఇంచార్జ్ ఎండి పి పుల్లారెడ్డి, డైరెక్టర్లు ఎం సుజయ్ కుమార్, పి అశోక్ కుమార్ రెడ్డి, వి ఉషా, ఎపిపిడిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్