- తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ
హైదరాబాద్: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడగా, తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి. దీంతో సెప్టెంబర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా మారనుంది.
సెప్టెంబర్ మొదటి వారంలోనే వరుస చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సందీప్ రెడ్డి వంగా బ్యానర్‌లో తెరకెక్కిన ‘రోమాకం’ సెప్టెంబర్ 3న విడుదల కానుంది. అనంతిక సనీల్ కుమార్, సుమంత్ ప్రభాస్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అల్లరి నరేష్ నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సహా’ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ విడుదల కానుంది. ‘90s: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అదే రోజున సుమంత్ నటించిన డివోషనల్ యాక్షన్ డ్రామా ‘మహేంద్రగిరి వారాహి’ కూడా థియేటర్లలోకి రానుంది. ఇక సెప్టెంబర్ 24న నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా సెప్టెంబర్‌లో పోటీకి దిగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐయామ్ గేమ్’, నివిన్ పౌలీ నటించిన ‘బెత్లహం ఫ్యామిలీ యూనిట్’ సెప్టెంబర్ 4న తెలుగులో విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 10న కార్తీ నటించిన ‘సర్దార్ 2’, నటుడు సూరి హీరోగా తెరకెక్కిన ‘మండాడి’ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. ఆగస్టు విజయోత్సాహాన్ని కొనసాగించాలని టాలీవుడ్ ఆశిస్తుండగా.. ఈ పోటీలో ఏ సినిమాలు ప్రేక్షకుల ఆదరణతో పాటు బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంటాయో ఆసక్తిగా మారింది.








కామెంట్‌లు (0)