- సుదీప్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్..
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ చిత్రాన్ని మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి ప్రతిష్టాత్మక చారిత్రక పాత్రలో సుదీప్ నటిస్తుండటంతో ‘దేవరాయ’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు మాస్, యాక్షన్ పాత్రల్లో తనదైన శైలిలో మెప్పించిన సుదీప్.. తొలిసారి ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో ఎలా కనిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం ‘దేవరాయ’ 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ లుక్ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించగా.. సినిమా కథ, విజువల్స్, సుదీప్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సుదీప్ కెరీర్‌లోనే విభిన్నమైన ప్రాజెక్ట్‌గా ‘దేవరాయ’ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చారిత్రక కథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.








కామెంట్‌లు (0)