ఖాట్మాండు : నేపాల్ ప్రభుత్వం శుక్రవారం మరో వరద హెచ్చరిక జారీ చేసింది. నేపాల్‌లోని బుధవారం వరద వచ్చిన ప్రాంతంలో నీటి మట్టం పెరగడంతో అక్కడ మరోసారి వరద వచ్చే ప్రమాదం ఉందని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఆర్‌ఎంఎ) హెచ్చరించింది. ఆకస్మిక వరద వచ్చిన అదే ప్రదేశంలో మరోసారి బురదతో కూడిన నీటి మట్టం పెరిగిందని పేర్కొంది. ఆ ప్రాంతంలోని ప్రజలు, సహాయక సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.
టిబెట్‌లో కూలిన ఆనకట్ట
టిబెట్‌లో ఆనకట్ట కూలిపోయిందని నేపాల్ పోలీసులు తెలిపారు. టిబెట్‌లో ఎగువన ఉన్న ఒక ఆనకట్ట కూలిపోయినట్లు సమాచారం అందిందని, పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సహాయక, పునరావాస కార్యకలాపాలలో మోహరించిన భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది, సాధారణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని హెచ్చరించారు. గిరోంగ్ సరిహద్దు పోర్ట్‌కు ఎగువన ఉన్న ఒక ఆనకట్ట సరస్సు పొంగిపొర్లడం ప్రారంభించిందని చైనా అధికారిక మీడియా తెలిపింది. ఆనకట్ట కూలిపోయిందన్న సమాచారం నేపథ్యంలో.. నేపాల్ అధికారులు తదుపరి 90 నిమిషాల పాటు సహాయక చర్యలను నిలిపివేసినట్లు ఒక ఆర్మీ అధికారి తెలిపారు. వరద ప్రభావిత రసువా జిల్లాలో సహాయక చర్యలు నిలిపివేశారని, స్థానికులు కొండపైకి పరుగులు తీయడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
400దాటిన మృతులు
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 400 దాటింది. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 469కి చేరిందని అధికారులు తెలిపారు. విపత్తు అనంతరం మూడవ రోజు కూడా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది జిల్లాల నుండి మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చిత్వాన్ నుండి 178, తూర్పు నవల్పరాసి నుండి 110, గోర్ఖా నుండి 44, నువాకోట్ నుండి 37, ధాడింగ్ జిల్లా నుండి 33, తనహు నుండి 28, పశ్చిమ నవల్పరాసి నుండి 27, రసువా నుండి 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇతర దేశాల సాయాన్ని తిరస్కరించిన నేపాల్
సహాయక చర్యలు చేపట్టడానికి ఇతర దేశాల సహాయం అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ పేర్కొంది. సహాయం అందిస్తామని ఇతర దేశాల నుండి ప్రతిపాదనలు వచ్చాయని అధికార ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి అన్నారు. అయితే తమ భద్రతా సంస్థలే గాలింపు, సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయని, ప్రస్తుతానికి తమ దేశానికి సహాయం అవసరం లేదని చెప్పారు.






కామెంట్‌లు (0)