సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

“స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్” ఛానల్‌ పైన ఇతర సోషల్ మీడియా పైన నిషేధాన్ని ఎత్తివేయాలి : సిపిఐ(యం)

1 గంట క్రితం

State government must abandon its policy of coercion: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : విశాఖ నగరంలో గూగుల్ అదానీ డేటా సెంటర్‌లు, వివిధ డేటా సెంటర్‌ల ఏర్పాట్లపై వస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం ఇవ్వకుండా ... “స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్” అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుపై నిషేధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర కమిటీ కోరింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్‌లపై మేధావులు, విద్యావంతులతోపాటు నగర ప్రజలలో రకరకాల సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రత్యేకించి భూసేకరణ మొదలుకొని నీరు, విద్యుత్‌ శక్తి, పర్యావరణం అంశాలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వీరు లేవనెత్తుతున్న సందేహాలకు సమాధానం ఇవ్వకుండా ఆ సమస్యలపై పనిచేస్తూ విస్తృత ఆదరణ పొందుతున్న సోషల్ మీడియా ఛానెల్‌ను నిషేధించడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వివిధ రూపాలలో వ్యక్తం చేయడం ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపారు. అలాంటి హక్కులను కాలరాసే విధంగా మెటా ద్వారా ఛానెల్ ను నిషేధించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం తగదు అని చెప్పారు. సోషల్ మీడియాలో డేటా సెంటర్‌ లపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వారి పోస్టులు తీసివేసి ప్రభుత్వ అనుకూల, కార్పొరేట్ కంటెంట్‌ను మాత్రమే సోషల్ మీడియాలో చలామణీ చేసే ప్రయత్నాలు ప్రభుత్వ నిరంకుశ స్వభావాన్ని తెలియజేస్తున్నాయని విమర్శించారు. ప్రజల చేతిలో సాధనంగా ఉన్న సోషల్ మీడియాను కూడా మెటా, గూగుల్ వంటి కంపెనీలు ప్రభుత్వాలతో చేయి కలిపి సెన్సార్ చేసే విధంగా తెచ్చిన చట్టాల ఫలితమే ఈ నిషేధం అని అన్నారు. ఈ చట్టాలను అడ్డుపెట్టుకొని నిమిషాల్లో నిరసన గళాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నొక్కివేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ డేటాపై విదేశీ కంపెనీల గుత్తాధిపత్యం, నిరంకుశత్వ సాధనంగా మారే ప్రమాదాన్ని త్రోసిపుచ్చలేమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలు, వాటికి తోడ్పడుతున్న మెటా, గూగుల్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు నిరసించాలని పిలుపునిచ్చారు. స్టాప్ వైజాగ్ డేటా సెంటర్‌ పైన, వ్యక్తుల పోస్టింగులు, వీడియోలపైన ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
011




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్