- ప్రపంచ సగటు కంటే వెనుకబాటు
న్యూఢిల్లీ: ప్రపంచ లింగ సమానత్వ సూచిక-2026లో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం 145 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ కంటే 14 దేశాలు మాత్రమే దిగువన ఉన్నాయి. మహిళలకు సమాన అవకాశాలు, ఆర్థిక భాగస్వామ్యం, సామాజిక-రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. లింగ సమానత్వంలో ఐస్‌లాండ్ తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఫిన్లాండ్ రెండో స్థానంలో, నార్వే మూడో స్థానంలో నిలిచాయి. బాంగ్లాదేశ్(79), నేపాల్(120), భూటాన్(121), శ్రీలంక( 129) భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. చాద్ 145వ స్థానంలో చివరన ఉండగా, ఇరాన్, పాకిస్థాన్ కూడా దిగువ స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సగటున 69.2 శాతంగా నమోదవగా, భారత్‌లో ఈ స్థాయి 64.5 శాతంగా ఉంది. ప్రస్తుత పురోగతి వేగం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా పూర్తి లింగ సమానత్వాన్ని సాధించడానికి సుమారు 120 సంవత్సరాలు పట్టవచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది.
పాపువా న్యూ గినియా, కువైట్, ఒమన్, ఖతార్, తజికిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, మాలి, అల్జీరియా, కాంగో తదితర దేశాలు భారత్ కంటే దిగువన ఉన్నాయి.
ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలను కొలిచే ఉప సూచికలో భారత్ 41.2 శాతం స్కోరు సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 0.5 శాతం పాయింట్ల మెరుగుదల. అయితే 2013లో భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోరుతో పోలిస్తే ఇది 3.5 శాతం పాయింట్లు తక్కువగా ఉంది.







కామెంట్‌లు (0)