- బ్రిక్స్ చైర్మన్‌గా కొత్త సహకార నెట్‌వర్క్‌ల ఏర్పాటు.
- బ్రిక్స్ బిజినెస్ ఫోరం సమావేశాల్లో ప్రధాని మోడీ
- వికృత రూపాలను సంతరించుకుంటున్న పోటీతత్వం : పుతిన్
- స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెరగాలి : పెజెష్కియాన్
న్యధ్యక్షులు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు, అవరోధాలు పెరుగుతుండగా మరోపక్క భారత్ ఆర్ధిక వారధులను నిర్మిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ‘‘అడ్డంకులను తగ్గించడం, వ్యాపార, వాణిజ్యాలకు గల అవకాశాలను పెంపొందించడం ఇదొక్కటే తమ దృక్పథమని స్పష్టం చేశారు. 2014 నుండి భారత్, దాదాపుగా 40దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాది బ్రిక్స్‌దేశాల అధ్యక్ష స్థానం హోదాలో వ్యవసాయం, ఆరోగ్యం, నైపుణ్యాలు, స్మార్ట్ గ్రిడ్‌లు వంటి రంగాల్లో కొత్త సహకార నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ భారత మంటపంలో జరుగుతున్న బిజినెస్ ఫోరం సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. స్టార్టప్‌లను, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లను మార్కెట్లు, ఫైనాన్స్‌తో అనుసంథానించేందుకు బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్, బ్రిక్స్ ఎంఎస్‌ఎంఇ పోర్టల్, స్టార్టప్ ఇన్నొవేషన్ ఫండ్ వంటి అదనపు చొరవలను భారత్ చేపట్టిందని తెలిపారు.
‘సముద్ర మార్గాలన్నీ సురక్షితంగా వున్నప్పుడు, సరఫరా మార్గాలు తెరిచివున్నపుడు, నావికులకు భద్రత వున్నపుడు మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యం ముందుకు సాగుతుంది.’ అని మోడీ స్పష్టం చేశారు. మొత్తంగా ప్రపంచ జనాభాలో 50శాతం బ్రిక్స్ దేశాల్లోనే వున్నారని, అంతర్జాతీయ జిడిపిలో 40శాతం వాటా ఈ దేశాలదేనని, అంతర్జాతీయ వాణిజ్యంలో 25శాతానికి పైగా వాటా బ్రిక్స్ దేశాలదేనని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. ‘అదొక్కటే కాదు, ఇన్నేళ్ళలో అంతర్జాతీయ జిడిపి దాదా పుగా రెండున్నర రెట్లు పెరగగా, బ్రిక్స్ దేశాల సంయుక్త జిడిపి ఏకంగా దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది.’’ అని మోడీ తెలిపారు. అంటే దానర్ధం బ్రిక్స్ దేశాల ఆర్థిక శక్తి సామర్ధ్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్ధ్యాలతో పోలిస్తే దాదాపుగా రెట్టింపుగా వుందని అన్నారు.
వికృత రూపాలను సంతరించుకుంటున్న పోటీతత్వం : పుతిన్
ఈ సమావేశాల్లోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ, 20వ శతాబ్దం చివరి వరకు అగ్ర స్థానాల్లో వున్న దేశాల స్థానే కొత్తగా ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలు వచ్చి చేరుతున్నాయని అన్నారు. ఈ పోటీ ఇప్పుడు వికృత రూపాలను అంటే సైనిక దాడులు, ఆంక్షల బెదిరింపులు వంటి రూపాలను సంతరించుకుంటోందని వ్యాఖ్యానిం చారు. ప్రస్తుతం ప్రపంచంలో నిర్మాణాత్మకమైన, వ్యవస్థాగతమైన మార్పులకు లోనవుతోందని పుతిన్ అన్నారు.
20వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఆర్థిక అభివృద్ధికి అగ్రగామిగా నిలిచిన దేశాల స్థానే క్రమేపీ నూతన అభివృద్ధి చోదక శక్తులు ఆక్రమిస్తున్నాయని పుతిన్ పేర్కొన్నారు. ఈ దేశాలు ఇంకా బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలను, సాంకేతికతను, శాస్త్రీయ అవకాశాలను కలిగివున్నాయనే వాస్తవాన్ని మనం గుర్తించాలన్నారు. మానవాళి స్వభావం, ఆర్థిక వ్యవస్థ రెండూ మార్పు చెందుతునే వుంటాయన్నారు. ఈ మార్పుతో పాటూ రష్యాకు చెందిన పశ్చిమ దేశాల పోటీదారులు తమ పూర్వపు పోటీ తత్వాన్ని తిరిగి సముపార్జించుకునేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారని పుతిన్ పేర్కొన్నారు. ఈ పోటీ తత్వం అనేది చాలాసార్లు వికృత చేష్టలతో ముడిపడి వుంటుందన్నారు. భౌతిక దాడులకు దిగడం, చమురు పైప్‌లైన్లు ధ్వంసం చేయడం, అంతర్జాతీయ రవాణా కారిడార్లను అడ్డుకోవడం, సముద్రపు నౌకలను స్వాధీనం చేసుకోవడం, అక్రమంగా ఇతరత్రా ఆంక్షలను విధించడం వంటి చర్యలకు దిగుతూ వుంటారని అన్నారు.
స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం పెరగాలి : పెజెష్కియాన్
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడడం వల్ల ఎదురయ్యే ముప్పులు, ప్రమాదాల గురించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. స్థానిక కరెన్సీల్లో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం పెరగాలని పిలుపునిచ్చారు. ఆర్థిక భద్రతను దేశ, ప్రాంతీయ భద్రత నుండి ఎలా వేరుచేయలేమో తమ దేశంపై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడులు రుజువు చేశాయని అన్నారు. రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి ఆర్థిక సాధనాలను ఉపయోగించడం పెరిగిందని అన్నారు.
ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లకు బ్రిక్స్ దేశాల స్పందన ఎలా వుండబోతుందో చెప్పాలని ఆయన అక్కడ వున్న నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఒక ఆర్ధిక సాధనంపై లేదా సాంకేతికతపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఏ దేశమూ మరో దేశం యొక్క చట్టబద్ధమైన వాణిజ్యాన్ని దెబ్బతీయలేని వాతావరణాన్ని బ్రిక్స్ సృష్టించాలని ఆయన కోరారు. ఇందుకుగానూ గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా వాటి అంతర్గత బలాన్ని పరిపుష్టం చేయాలన్నారు. ఆర్థికంగా ఎలాంటి దెబ్బలు తగిలినా, సంక్షోభాలు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులను, వ్యవస్థలను నిర్మించాల్సి వుందన్నారు.








కామెంట్‌లు (0)