టెహ్రాన్: అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇరాన్‌కు ఇంధన రంగంలో భారీ ఊరట లభించింది. దేశంలోని దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో కొత్త సహజ వాయువు క్షేత్రాన్ని కనుగొన్నట్లు ఇరాన్ చమురు మంత్రి మొహ్సన్ పక్నేజాద్ వెల్లడించారు. ఈ క్షేత్రంలో 7.5 ట్రిలియన్ క్యూబిక్ అడుగులకు పైగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. వీటి విలువ సుమారు 10 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపారు.
కొత్త క్షేత్రం నుంచి దాదాపు 5.7 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్‌ను వెలికితీయవచ్చని మంత్రి పేర్కొన్నారు. అంచనా రికవరీ రేటు ప్రకారం ఇది దేశంలోని అతిపెద్ద సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలోని ఓ బ్లాక్‌తో సమానమైనదని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ క్షేత్రం నుంచి సుమారు 15 ఏళ్లపాటు గ్యాస్ సరఫరా చేయగల అవకాశముందని పేర్కొంది.
ఇజ్రాయెల్, అమెరికాతో ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఇరాన్ చమురు, గ్యాస్ మౌలిక వసతులు దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త నిక్షేపాల గుర్తింపు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అమెరికా ఆంక్షలు, హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు కొత్త క్షేత్రం అభివృద్ధికి సవాళ్లుగా మారే అవకాశం ఉంది. కొత్తగా లభించిన గ్యాస్ స్వీట్ గ్యాస్ కావడంతో ప్రాసెసింగ్ వ్యయం తక్కువగా ఉంటుందని, దీనితో పాటు లభించే గ్యాస్ కండెన్సేట్ ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని మంత్రి తెలిపారు. మరోవైపు దెబ్బతిన్న సౌత్ పార్స్ ఇంధన మౌలిక వసతుల పునరుద్ధరణను ఇరాన్ వేగవంతం చేసింది. 12 రోజుల యుద్ధంలో దెబ్బతిన్న రిఫైనరీ సామర్థ్యంలో 70 శాతానికి పైగా ఇప్పటికే పునరుద్ధరించినట్లు పార్స్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ చీఫ్ తురాజ్ దెహ్ఘాని తెలిపారు. సాధారణంగా మూడేళ్లు పట్టే పునరుద్ధరణ పనులను రెండేళ్లలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇరాన్‌పై మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులను అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త గ్యాస్ నిక్షేపాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి, ఇంధన ఆదాయాన్ని పెంచుకోవడం ఇరాన్‌కు కీలక సవాలుగా మారనుంది.








కామెంట్‌లు (0)