సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చర్చలపై ప్రతిష్టంభన

1 గంట క్రితం

iran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- దాడులు ముగించేంత వరకూ చర్చల్లేవు : ఇరాన్‌

- తుది దశలో ఇరాన్, ఒమన్ ఒప్పందం

​వాషింగ్టన్‌/టెహ్రాన్‌ : పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ - అమెరికా మధ్య జరగాల్సిన చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సోమవారం చర్చలు ప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా అమెరికాతో చర్చలేవీ జరపడం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. హర్మూజ్‌ జలసంధిలో నౌకలు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఓ తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఒమన్‌తో చర్చిస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఒమన్‌తో ఒప్పందం కుదిరినప్పటికీ జలమార్గాన్ని తెరిచేందుకు అది సరిపోదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగినంత కాలం పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన అన్నారు. ట్రంప్ అంతకుముందు ఓ ప్రకటన చేస్తూ ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. అయితే ఒప్పందానికి గడువును నిర్ణయించేందుకు ఆయన నిరాకరించారు. హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు త్వరగా ఒప్పందం కుదురుతుందని, టెహ్రాన్ అణు సామర్ధ్యాలపై నెలకొన్న వివాదం పరిష్కారం అవుతుందని ఆశించినందునే దాడులను నిలిపివేశానని చెప్పుకొచ్చారు. అయితే తాము ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై మరోసారి స్పష్టం చేశారు. హర్మూజ్‌ నిర్వహణపై ఒమన్‌తోనే చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే హర్మూజ్‌‌ను తెరవడంపై తాము చర్చించుకోవడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు దీనికి సంబంధం లేదన్నారు. కాగా హర్మూజ్‌ ‌జలసంధిపై ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్