- స్పెయిన్ వ్యాప్తంగా నిరసనలు
- ప్రభుత్వం మద్దతిచ్చినా పార్లమెంట్‌లో ఓటమి
- దశాబ్ద కాలంలో రెట్టింపైన అద్దెలు
మాడ్రిడ్ : అద్దెకుండేవారి రక్షణలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన రెండు ప్రభుత్వ చర్యలను పార్లమెంట్ తిరస్కరించడంతో స్పెయిన్ వ్యాప్తంగా తాజాగా ఆందోళనలు తలెత్తాయి. రాజధాని మాడ్రిడ్ సహా పలు నగరాల్లో శనివారం వేలాదిగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 50 నగరాల్లో నిరసనలు జరిగాయి. మాడ్రిడ్‌లోజరిగిన నిరసన ప్రదర్శనలో 70వేల మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్నారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ మైనారిటీ సోషలిస్టు ప్రభుత్వం ఈ చర్యలకు మద్దతిచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ చర్యలు గనక ఆమోదం పొందినట్లైతే ఆద్దె కాంట్రాక్టులు ఆటోమేటిక్‌గా పునరద్ధరణ జరిగేవి. బలహీనులైన అద్దెదారులను ఖాళీ చేయించకుండా వుండేలా బలమైన రక్షణలు కల్పించేవి, తమ పెట్టుబడులతో చవకగా ఆస్తులను కొనుగోలు చేసి, వాటిని అద్దెలకు ఇవ్వడంపై ఆంక్షలు విధించబడేవి. కానీ పార్లమెంట్ వాటిని తిరస్కరించింది. మాడ్రిడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో మారికార్మెన్ అబస్కల్ (87) 70సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. అయితే ఆమె నివసిస్తున్న ఆ అపార్ట్‌మెంట్‌ను ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆమె ఇంటి అద్దెను 275శాతం పెంచడానికి సిద్ధమైంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహాందోళనలు పెల్లుబికాయి. ఈ నిరసనలతో కొత్త యజమానులు ఆమెను తక్కువ అద్దెకే నివసించేందుకు అనుమతించడానికి అంగీకరించారు.
ఈ సంఘటన నేపథ్యంలో టెనంట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు 50కి పైగా నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. రాజకీయ పార్టీలు ప్రజల డిమాండ్లను పట్టించుకోవడం లేదని వారు నిరసించారు. తాజాగా ప్రభుత్వం తలపెట్టిన చర్యలు కూడా పార్లమెంట్‌లో వీగిపోవడంతో సాంచెజ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సత్వర ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షనేత అల్బర్టో నూనెజ్ పిలుపిచ్చారు. స్పెయిన్‌లో ఇళ్ళ అద్దెలు ప్రధానమైన ఆందోళనగా వుంది. గత దశాబ్ద కాలంలో సగటున అద్దెలు రెట్టింపయ్యాయి. ఇళ్ళ ధరలు 90శాతం పెరుగుతున్నాయి.








కామెంట్‌లు (0)