- ఉభయ సభలు ఆమోదం
పారిస్ : పిల్లల్లో అధిక స్క్రీన్ వినియోగం, మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించే లక్ష్యంతో 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ కీలక చట్టాన్ని ఆమోదించింది. ఫ్రాన్స్ చరిత్రలోనే అతిపెద్ద విద్యా, డిజిటల్ సంస్కరణల్లో ఒకటిగా భావిస్తున్న ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఈ చట్టంతో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేస్తున్న యూరోపియన్ యూనియన్‌లోని తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హయాంలో అత్యంత కీలక విధాన నిర్ణయాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై కూడా ఈ చట్టం కఠిన ఆంక్షలు విధిస్తోంది.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సెప్టెంబర్ నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయానికి అధ్యక్షుడు మాక్రాన్ గట్టి మద్దతు ప్రకటిస్తూ "మన పిల్లల మెదళ్లు అమ్మకానికి కావు. వాటిని అమెరికన్ ప్లాట్‌ఫారమ్‌లకు లేదా చైనీస్ అల్గారిథమ్‌లకు వదిలివేయలేం" అని గతంలో వ్యాఖ్యానించారు. పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా వ్యసనాన్ని నియంత్రించడం, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ నిర్ణయం అవసరమని ఆయన పేర్కొన్నారు.
కొత్త చట్టం ప్రకారం, సెప్టెంబర్ నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు కొత్త సోషల్ మీడియా ఖాతాలను తెరవడానికి అనుమతి ఉండదు. అనంతరం వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ వయస్సు వర్గానికి చెందిన పిల్లల ప్రస్తుత సోషల్ మీడియా ఖాతాలను పూర్తిగా నిలిపివేయాలని సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ నిబంధనలు ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఎక్స్, స్నాప్‌చాట్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలకు వర్తిస్తాయి. అయితే, ఆన్‌లైన్ విద్యా అవసరాల కోసం ఉపయోగించే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించారు.








కామెంట్‌లు (0)