సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

25 ఏళ్లుగా హారన్‌ కొట్టకుండా ప్రయాణం...

1 గంట క్రితం

no horm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 04:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

‘రోడ్డుపై వాహనదారులు హారన్ కొట్టకుండా వాహనం నడపడం ఎప్పుడైనా చూశారా?’ అంటే ‘లేదు’ అనే చాలామంది సమాధానం చెబుతారు. కోల్‌కతా వాసులు మాత్రం ‘అవును’ అంటారు. ఎందుకంటే అక్కడ దీపక్‌ దాస్‌ గత 25 ఏళ్లుగా నగరంలోని 
రద్దీ రహదారుల్లో ఒక్కసారి కూడా హారన్‌ కొట్టకుండా వాహనం నడుపుతున్నారు. 1990 నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్న దాస్‌ 
ఈ నిర్ణయం వెనుక సాహిత్యంపై ఆయనకున్న ప్రేమే ప్రధాన కారణం. ప్రముఖ బెంగాలీ కవి జీవనానంద దాస్‌ ప్రకృతి గురించి రాసిన ఓ కవిత ఆయన జీవితాన్నే మార్చేసింది.

​కెరీర్‌ ప్రారంభంలో కోల్‌కతా ప్రసిద్ధ పసుపురంగు ట్యాక్సీలను నడిపిన దాస్‌, ఆ తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌గా స్థిరపడ్డారు. రోజుకు 12 గంటల పాటు రద్దీ రహదారులపై వాహనం నడపడం ఆయన దినచర్య. పుస్తకాలు చదవడం హాబీ అయిన దాస్‌ కారులో ఎప్పుడూ కొన్ని పుస్తకాలు ఉంచుకుంటారు. వీలు దొరికినప్పుడల్లా వాటిని చదువుతుంటారు. ఒకసారి ఓ మర్రిచెట్టు కింద కూర్చొని జీవనానంద దాస్‌ ప్రకృతిపై రాసిన కవిత చదువుతున్నారు. చెట్లపై పక్షుల కిలకిలరావాలు, చల్లని గాలి సవ్వడితో నిండిన ఆ కవితలో పూర్తిగా లీనమయ్యారు. అంతలోనే హారన్ల కర్కశ శబ్దం ఆయనను ఒక్కసారిగా ఆ ఆహ్లాద ప్రపంచం నుంచి వాస్తవంలోకి తీసుకొచ్చింది. పక్కనే ఉన్న పాఠశాల వద్ద పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన కార్లు, బస్సులు విచ్చలవిడిగా హారన్లు మోగిస్తూ ఆ ప్రశాంత వాతావరణాన్ని భంగం చేశాయి. అదే రోజు నుంచి ఇకపై తన వాహనంలో హారన్‌ వాడకూడదని దాస్‌ నిర్ణయించుకున్నారు.

​ఇంటికి వెళ్లిన వెంటనే తన కారులోని హారన్‌ను తొలగించారు. దీని గురించి దాస్‌ మాట్లాడుతూ... ‘హారన్‌ కొట్టడం వల్ల ట్రాఫిక్‌ తగ్గదు. రోడ్డు వెడల్పు పెరగదు. కాస్త ఓపిక, పరస్పర గౌరవం ఉంటే చాలాసార్లు హారన్‌ అవసరమే ఉండదు’ అంటారు.

​డ్రైవింగ్‌ సంస్కృతి గురించి కూడా ఆయన ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ‘డ్రైవింగ్‌ శిక్షణలో రోడ్డు నియమాలు చెప్పడంతో సరిపోదు. రోడ్డుపై ఎలా ప్రవర్తించాలి? ఇతరులను ఎలా గౌరవించాలి? అనే విషయాలపైనా అవగాహన కల్పించాలి. రోడ్డు మర్యాదలు, పరస్పర గౌరవం వంటి విలువలను చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందిస్తే శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు’ అని ఆయన భావిస్తున్నారు.

​శబ్ద కాలుష్యంపై వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దాస్‌ అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. వైద్యుల ప్రకారం 85 డెసిబెల్స్‌కు మించిన ట్రాఫిక్‌ శబ్దానికి ఎక్కువకాలం గురికావడం వల్ల వినికిడి దెబ్బతినడమే కాకుండా అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది. చివరికి శాశ్వత అధిక-ఫ్రీక్వెన్సీ వినికిడి లోపానికీ దారితీయవచ్చు.

​దాస్‌ ఆలోచనలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆయన జీవన విధానమే చాలామందికి స్ఫూర్తిగా మారింది. అందుకు ఉదాహరణగా తనకు ఎదురైన ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకుంటారు. ‘నగరంలోని పెద్ద పాఠశాలలు “నో హారన్‌ డే” నిర్వహించడం చూశాను. కానీ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకున్న ఆ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన కార్లు, బస్సులు పెద్ద పెద్దగా హారన్లు మోగించాయి. అప్పుడు నాకు ఒకటే అనిపించింది. శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలంటే రోడ్లను మార్చడం కంటే మన దృక్పథాన్ని మార్చుకోవడమే ముఖ్యమని’ అంటారు.

​ప్రస్తుతం దాస్‌ డ్రైవర్‌ జీవితానికి విరామం ఇచ్చారు. అవసరమైనప్పుడు మాత్రమే కారు నడుపుతున్నారు. ఆయన కారు మీద ఒక చిన్న సందేశం కనిపిస్తుంది... ‘హారన్‌ సమస్యకు పరిష్కారం కాదు... అది కాలుష్యం.’ ఆ కారు ఎక్కడికి వెళ్లినా నిశ్శబ్దంగా అదే సందేశాన్ని అందరికీ చేరవేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్