సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కీడెంచి మేలెంచాలి!

2 గంటల క్రితం

chinnari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక రోజు సాయంత్రం లచ్చవ్వ, ఆమె స్నేహితురాలు రామవ్వ ఇంటి అరుగుమీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. "రామవ్వా! నిన్న పెద్ద వీధిలో గొడవ జరిగిందట. ఏమైంది?" అని లచ్చవ్వ అడిగింది. "మా ఎదురింటి రామారావు కొడుకు కార్తీక్‌ బైక్‌తో ఎవరినో ఢీ కొట్టాడట! ఆయన తరఫున వారు వచ్చి కార్తీక్‌ వాళ్ల నాన్నతో గొడవపడ్డారు. కార్తీక్‌ చాలా చిన్నవాడు. 14 ఏళ్లు కూడా నిండలేదు. వాళ్ల నాన్న వద్దని ఎంత చెబుతున్నా వినకుండా బైక్‌ తీసుకుని బయటకు వెళ్లాడంట. అప్పుడే ప్రమాదం జరిగిందంట. పోలీసులు వచ్చి, మైనర్‌కు బైక్‌ ఇచ్చినందుకు రామారావుపై కేసు నమోదు చేశారు. గాయపడిన వ్యక్తి చికిత్సకు చాలా డబ్బు ఖర్చయింది. కొడుకు సరదా కోసం తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది" అని రామవ్వ చెప్పింది. ఆ మాటలు విన్న లచ్చవ్వ తల ఊపుతూ, "అందుకే పెద్దలు 'కీడెంచి మేలెంచాలి' అన్నారు," అంది.

అంతలో స్కూలు నుంచి వచ్చిన జున్నుబాబు వారి మాటలు విని, "అవ్వా! 'కీడెంచి మేలెంచాలి' అంటే ఏమిటి?" అని అడిగాడు. లచ్చవ్వ చిరునవ్వుతో, "ఏ పనైనా చేసే ముందు దాని వల్ల కలిగే కీడు లేదా నష్టం ఏమిటో ముందుగా బేరీజు వేసుకోవాలి. తర్వాత మేలైన నిర్ణయం తీసుకోవాలి. అదే 'కీడెంచి మేలెంచాలి' అనే సామెత అర్థం," అని వివరించింది. అప్పుడు జున్నుబాబు "అవ్వా! ఈరోజు మా ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వస్తువులు వాడటానికి సౌకర్యంగా, చవకగా ఉన్నప్పటికీ వాటిని విచ్చలవిడిగా ఉపయోగించడం వలన భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయని, జంతువులకు, మన ఆరోగ్యానికి హాని జరుగుతోందని చెప్పారు. అందుకే గుడ్డ సంచులు, జనపనార సంచులు, కాగితపు సంచులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. మన ఇంట్లో కూడా ఇక నుంచి పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా పర్యావరణహిత వస్తువులనే ఉపయోగిద్దాం. మన ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్నీ కాపాడుకుందాం" అన్నాడు. లచ్చవ్వ ఆనందంగా జున్నుబాబు తల నిమిరి, "శభాష్ జున్నూ! 'కీడెంచి మేలెంచాలి' అనే సామెతలోని పరమార్థాన్ని అర్థం చేసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టాలనే ఆలోచన కూడా గొప్పది," అంటూ మెచ్చుకుంది.


- కాశీ విశ్వనాథం పట్రాయుడు,

94945 24445.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్