మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఊయల’ కావాలి!

1 గంట క్రితం

baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆడబిడ్డ కన్ను తెరిచిన మరుక్షణమే ఉసురుతీసే పరిస్థితుల్లో మార్పు కోసం తమిళనాడు, కేరళంలో పురుడుపోసుకున్న ‘క్రేడిల్‌ ‌బేబీ స్కీమ్‌’ దేశమంతటా అవసరం. ‘ఆకాశంలో సగం, బేటీ బచావో.. బేటీ పఢావో..’ అంటూ ఎన్ని నినాదాలిస్తున్నా... ఆచరణలో పెద్దగా మార్పు లేదు. పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం నేటికీ ఆధిపత్యం చెలాయిస్తున్న సమాజంలో ఆడపిల్లలను పురిటిలోనే చిదిమేసే చర్యలను అడ్డుకోవడం కోసం కేంద్రం, రాష్ట్రాలు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ఆడ శిశువుల ప్రాణాలను కాపాడటం, వారిని అనాథలుగా మారకుండా సంరక్షించడం లక్ష్యాలుగా తమిళనాడు ప్రభుత్వం 1992లో 'క్రేడిల్ బేబీ స్కీమ్'ను ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సేలం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్లలను పెంచుకోలేని కుటుంబాలు వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక తొట్టెలో వదిలిపెట్టవచ్చు. అనంతరం వారిని దత్తత సంస్థలకు అప్పగిస్తారు. కాలక్రమేణా, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ కార్యాలయాల్లో తొట్టెలు ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఆరు వేల మందికి పైగా శిశువులు సంరక్షణ పొందారు.

కేరళంలో 2002లో ‘అమ్మ తొట్టె’ (అమ్మ ఊయల) పేరుతో ప్రారంభమైన పథకం పినరయి విజయన్‌ ‌ప్రభుత్వ హయాంలో విస్తరించింది. 14 నుంచి 30కి ‘అమ్మ తొట్టె’లు పెంచడం, ఆటోమేటిక్‌ అలారమ్‌, ఫొటో అప్లోడ్‌ ‌వ్యవస్థతో కూడిన హైటెక్‌ ఊయలల ఏర్పాటు, యునిసెఫ్‌ ‌ప్రశంసలు పొందే స్థాయికి ఈ పథకాన్ని తీసుకెళ్లిన ఘనత ఎల్‌‌డిఎఫ్‌ ప్రభుత్వానిదే. గత ఏడాది 70 మంది పిల్లలను సంతానం లేని దంపతులు దత్తత తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున తిరువనంతపురంలోని హైటెక్‌ ‌తొట్టెలో ఓ ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టారు. ఆ మరుక్షణమే జిల్లా వైద్య అధికారి, కేరళం రాష్ట్ర శిశు సంక్షేమ మండలి సిబ్బందికి ఆటోమేటిక్ అలర్ట్ అందింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ కేంద్రాలలో విడిచిపెట్టిన వెయ్యవ శిశువు కావడంతో ఆ ఐదు రోజుల పసికందుకు ‘సహస్ర’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకూ ఈ కేంద్రాలు సంరక్షించిన చిన్నారుల్లో 681 మంది ఆడపిల్లలు, 319 మంది మగపిల్లలు. కేరళంలోని ప్రతి జిల్లాలో ఉన్న ఈ తొట్టెలు, తమ పిల్లలను పెంచలేని తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సంరక్షణను అందిస్తుందనే నమ్మకాన్ని కలిగించి, ప్రజల నుండి తగినంత విశ్వాసాన్ని సంపాదించాయి. శిశు సంక్షేమ కమిటీ సంరక్షణలోకి తీసుకున్న తర్వాత, నిర్దేశించిన నిరీక్షణ కాలం ముగిశాక, ఆ బిడ్డ కేంద్ర దత్తత వనరుల అథారిటీ ద్వారా దత్తతకు చట్టబద్ధంగా అర్హత పొందుతుంది. ఆ తరువాత అర్హులకు దత్తత ఇస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలతో కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలను ప్రారంభించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లోని నల్గొండ జిల్లా దేవరకొండలో 2007లో ఇటువంటి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఆ రాష్ట్రంలో ‘ఊయల’ పేరుతో విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ తరహా పథకం కొనసాగించాల్సిన అవసరముందని నేటికీ కొనసాగుతున్న చిన్నారుల, భ్రూణ హత్యలను చూస్తే అర్థమవుతుంది.

ఆడపిల్లలను వదిలిపెట్టడాన్ని ఈ పథకాలు ప్రోత్సహిస్తున్నాయంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు అర్థరహితం. వైద్య విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అమ్మాయి పుట్టుకకు మహిళే కారణమన్న అజ్ఞానంతో విడిచిపెడుతున్న, ఇద్దరి ఉసురుతీస్తున్న మూర్ఖత్వం నేటికీ బుసలు కొడుతూనే ఉండటం శోచనీయం. పెళ్లి కోసం యువతులు దొరకని పరిస్థితిని నేడు చూస్తున్నాం. అవే కుటుంబాలు ఆడపిల్లలను కనడానికి ఇష్టపడని పరిస్థితులూ

కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ పరిస్థితులు మారేలా అందరినీ చైతన్యపరచడం అవసరం. స్ర్తీ, పురుష వివక్ష లేని, ఇద్దరూ సమానంగా ఉండే సమాజం ఆవిర్భవించేవరకూ ఇలాంటి పథకాలు ఆవశ్యకత ఉంది. ఆడ శిశువుల హత్య, గర్భస్రావాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మరింత దిగజారుతోందన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి.వి. నాగరత్న, మహిళా సంఘాల ఆందోళన యథార్థ పరిస్థితికి అద్దం పట్టేదే. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చిన్నారులను కాపాడేలా పథకాలను ప్రవేశపెట్టేలా నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. ఆడపిల్లలు తక్కువనే మనుధర్మశాస్ర్త భావనను తలకెత్తుకున్న మోడీ సర్కారు ఆ బాధ్యతలను నిర్వహించేలా మెడలు వంచడానికి విశాల ఉద్యమాలు సాగాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్