రాష్ట్రంలో శాంతిభద్రతలు సురక్షితంగా వుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అసాంఘిక శక్తులను తుదికంటా నిర్మూలించుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు ఒక సారైనా చెబుతుంటారు. బహుశా ఆయన దృష్టిలో వివిధ సమస్యలపై రాజకీయ పార్టీలు పలు ప్రజాసంఘాలు నిర్వహిస్తున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాలే శాంతిభద్రతల సమస్యగా భావిస్తున్నట్లుంది. అందుకనుగుణంగా పోలీసు యంత్రాంగాన్ని మోహరిస్తున్నారు.
రాజకీయ పార్టీల కార్యక్రమాల అదుపునకు ప్రతిపక్షాల నేతలను జైళ్లకు, కోర్టులకు తీసుకుపోయి రావడంతోనే పోలీసు యంత్రాంగానికి సరిపోతోంది. రౌడీల, తాగుబోతుల దుశ్చర్యలు... ఫ్యాక్షనిస్టు గ్రామాలపై నిఘా... రాజమండ్రిలో డాక్టరును దుర్మార్గంగా కారుతో ఢీకొట్టి ప్రాణాలు తీయడం లాంటి ధన మధాందుల, రాజకీయ నేతల పైశాచిక వికృత క్రీడలను శాంతిభద్రతల కింద పరిగణిస్తున్నట్లు లేదు. తత్ఫలితంగా ఇవి పెచ్చు మీరిపోతున్నాయి. పైగా శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషించే పోలీసు యంత్రాంగం దుందుడుకుతనం, లోపాయికారీగా వివిధ కారణాలతో లొంగుబాటు విధానం వలన తలెత్తే అశాంతి, అభద్రతలను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇవన్నీ అటుంచి సహజంగా ఒక రాష్ట్రాధినేత నోట రాకూడని పదాలు రావడం కూడా ఇందుకు పరోక్షంగా ఆజ్యం పోయడాన్ని గుర్తించడం లేదు. "తోక కోస్తాము-చర్మాలు వలుస్తాం" లాంటి పద ప్రయోగం పరోక్షంగా రాష్ట్ర ప్రజల మనోభావాలు ఎంత కలుషితం అవుతున్నాయో అంచనా వేసేందుకు మనో వైజ్ఞానిక నిపుణులు కావాలి.
ఈ మధ్య తరచూ ఫ్యాక్షనిస్టు హత్యలు నిత్యకృత్యమైనాయి. ఈ మధ్య ఫ్యాక్షనిస్టు గ్రామాల్లో ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి. పోలీసు యంత్రాంగం నిఘా వుంటే కొన్నైనా నివారించవచ్చు. ఇవన్నీ శాంతిభద్రతల కిందకు రావా? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ చెబితే పాడిందే పాడినట్లవుంది. ఏ ప్రభుత్వంలోనైనా లాకప్ డెత్ లకు చట్టం అనుతించదు. ఈ దుస్సంఘటన మరీ భిన్నమైనది. ఏ వ్యక్తిగాని నిందితుడు హంతకుడే కావచ్చు, అతన్ని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా పోలీస్ అధికారి చేశారంటే పైనుండి బలీయమైన మద్దతు, ప్రేరణ, అండ వుండకపోతే సాధ్యం కాదు. ఈ దురాగతం చట్ట విరుద్ధమైనదే గాక గుండెలు పిండే అనూహ్యమైన ఆగడం సంభవించిందంటే ప్రభుత్వ స్వరూప స్వభావాలు ఎంతో కొంత సానుకూలంగా వుండి వుండాలి. ముఖ్యమంత్రి నిత్యం కోరుకొనే శాంతిభద్రతలను ఈ సానుకూలత మింగేయడం లేదా? కృష్ణలంక సంఘటన లాంటివి, లాకప్ డెత్ కావచ్చు, పోలీసు అధికారుల వేధింపులకు డెత్ వీడియో చేసి ఆత్మహత్యలు చేసుకున్నవి అర డజను వున్నాయంటున్నారు.
విజయవాడ ఎపిసోడ్ సమసి పోలేదు. వెనువెంటనే మరొక హృదయ విదారకమైన సంఘటన రాజమండ్రిలో జరిగింది. భవిష్యత్తులో ఎంతో మంది అనారోగ్య, అభాగ్యులకు ప్రాణ దాతగా వర్థిల్లాల్సిన పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న వైద్య విద్యార్థినిని నిర్దాక్షిణ్యంగా కారుతో ఢీ కొట్టి తలపైన కారు ఎక్కించి వెళ్లారంటే స్థానికంగా వాళ్లు ఎంత దుర్మార్గులు, రాజకీయంగా బలవంతులు అయివుండాలి. అంతవరకైతే ఫర్వాలేదు. మానవత్వానికే మాయని మచ్చ తెచ్చిన ఘోర దుస్సంఘటన సంభవిస్తే మూడు రోజులకుగాని ఘనత వహించిన కూటమి ప్రభుత్వం, పోలీసులు... అదీ సభ్య సమాజం ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసిన తర్వాతగాని...చురుకుగా రంగ ప్రవేశం చేయలేదు. అది కూడా రెండు దఫాలు సెక్షన్లు ఎందుకు మార్చవలసి వచ్చింది? ఇందులోనే లోపాయికారీతనం వుంది.
ముఖ్యమంత్రి నిత్యం చెప్పే శాంతిభద్రతలను రాజమండ్రి పోలీసులు శంకరగిరి మాన్యాలు పట్టించలేదా? ఇదే పోలీస్ యంత్రాంగం సీదిరి అప్పలరాజు, అతని కొడుకు విషయంలో ఇలా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించలేదు? ఈ రెండు సంఘటనల్లో పోలీసు యంత్రాంగం వైఖరి చూస్తే సాధారణ ప్రజలైనా ఏమని భావిస్తారు?
అసభ్య దూషణలతో వీడియోలు చేశారని హైదరాబాద్ లో రావణ్ ను అరెస్టు చేశారు. అతనిపై ‘ఉపా’ చట్టం ప్రయోగించడంపై ప్రజాస్వామ్య వాదులందరూ వ్యతిరేకించారు. అది అలా ఉంచుదాం! అతన్ని కోర్టుకు తీసుకొచ్చి తిరిగి తీసుకెళ్లే సందర్భంలో మొదట అరెస్టు చేసి తీసుకు వచ్చినపుడు జనసేన కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డగించి దానిపై డాడి చేయడం శాంతిభద్రతల కిందకి రాదా? జనసేన కార్యకర్తలు తుదకు పోలీస్ స్టేషన్లలో సృష్టించిన అల్లరికి ఎంత మందిపై కేసులు పెట్టారు? ఒకవేళ జనసేన పార్టీ అధికారంలో వుంటే వారికి ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా వున్నాయా? వారి వ్యవహార సరళి చూచిన ఇతర పార్టీల కార్యకర్తలు తుదకు సంఘ వ్యతిరేక శక్తులకు అవకాశం ఇవ్వదా? తరచూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోని తీసుకోవడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించదా?
వ్యాసకర్త : వి. శంకరయ్య , విశ్రాంత పాత్రికేయుడు







కామెంట్‌లు (0)