సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

51శాతం వాటా ప్రైవేటుకే...!

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 16 రంగాల్లో పిపిపి

- మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: పిపిపి విధానంలో ప్రాజెక్టులు చేపట్టినా అవి సర్కారీ ఆస్తులుగానే ఉంటాయంటూ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు భిన్నంగా ప్రైవేటు సంస్థలకు అత్యధిక వాటా కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పాలసీ–2026ను సోమవారం విడుదల చేసింది. దీనిలో ప్రైవేటు సంస్థలకు 51శాతం వాటా ఇవ్వనున్నట్లు పేర్కొంది. సగానికన్నా ఎక్కువ వాటా ఒక్కసారి అప్పగించిన తరువాత వాటిపై పెత్తనంకూడా ప్రైవేటు సంస్థలకు ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవ సరం లేదు. దీంతో అవి ప్రభుత్వ అస్తులుగానే ఉంటాయన్నది కూడా ఉత్త మాటగానే మారనుంది. ఒకవైపు సగానికన్నా ఎక్కువ వాటాను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూనే ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్వహణ, ప్రజా సేవలను నిర్ణీత కాలానికి మాత్రమే అందిస్తుందని, భూమి, ఆస్తుల యాజమాన్యం ప్రభుత్వం వద్దనే ఉంటుందని తాజా ఉత్తర్వుల్లోనూ పేర్కొన్నారు. అయితే, అనేకచోట్ల నామమాత్రపు ధరకు లేదా దీర్ఢకాలిక వ్యవధికి లీజు ప్రాతిపదికన భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రు 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులను పిపిపి విధానంలో అమలు చేస్తున్నట్టు తాజా ఉత్తర్వులలో పేర్కొంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలతో వయబిలిటీ గ్యాప్ ఫండ్ కల్పిస్తున్నట్టు పేర్కొంది. ప్రాజెక్టులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేం దుకు, ప్రైవేటు పెట్టుబడిదారులను మరింతగా ఆకర్షించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని వివరించింది. ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రవాణా, ఆరోగ్యం, వైద్య, విద్య, ఇంధనం వంటి రంగాలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొం ది. స్వర్ణాంధ్ర విజన్‌–2047లో భాగంగా మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధికి ప్రైవేటు రంగాన్ని భాగస్వామిగా చేసుకోవడమే పాలసీ ప్రధాన ఉద్దేశంగా ఈ ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.

ఏయే రంగాల్లో

రాష్ట్ర వ్యాప్తంగా 16 కీలక రంగాల్లో పిపిపి విధానాన్ని అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయంలో మౌలిక వసతులు, విద్య, ఇంధనం, ఆరోగ్యం, పారిశ్రామిక మౌలిక వసతులు, సాగునీరు, పర్యాటకం, రవాణా–లాజిస్టిక్స్, పట్టణ మౌలిక వసతులు, క్రీడలు, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్స్, నీటి సరఫరా–పారిశుద్ధ్యం తదితర రంగాలను పాలసీ పరిధిలోకి తీసుకొచ్చారు. రోడ్లు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, పట్టణ రవాణా వ్యవస్థలు వంటి కీలక మౌలిక వసతుల్లో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేసేందుకు నిర్ణయించారు.

పిపిపిలో భిన్న విధానాలు

. బీఓటి, టిఓటి, బిఓటి-యాన్యుటీ, బిఎల్టీ/ఆర్వోఎంటీ, లీజ్ విధానం, స్విస్ ఛాలెంజ్ విధానాల్లో పిపిపి ఒప్పందాలు ఉంటాయని తాజా విధానంలో పేర్కొన్నారు. ఆదాయాన్ని సమకూర్చే కొత్త ప్రాజెక్టులను బిఒటి ద్వారా, ఇప్పటికే ఉన్న ఆస్తుల నిర్వహణకు టిఓటి, ఆర్థికంగా కీలకమైనప్పటికీ వాణిజ్యపరంగా బలహీనమైన ప్రాజెక్టులకు బిఓటి - యాన్యుటీ వంటి విధానాలను అనుసరించవచ్చునని వివరించారు. పిపిపి ప్రాజెక్టుల ఎంపికలో పారదర్శత, పోటీ బిడ్డింగ్‌నే అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సాంకేతిక అర్హత అనంతరం ఒకే ఆర్థిక ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని బిడ్లను ఎంపిక చేసే విధానాన్ని కూడా పాలసీలో పొందుపరిచారు.

​ప్రతి శాఖలోనూ పిపిపి డెస్క్‌

​తాజా విధానాన్ని పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి పిపిపి సెల్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి పిపిపి సెల్ కు పైప్‌లైన్‌ ప్రాజెక్టుల నిర్వహణ, శాఖలకు సాంకేతిక సహకారం, పెట్టుబడిదారులతో అనుసంధానం, ఫిర్యాదుల పరిష్కారం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే ప్రతి శాఖలో పిపిపి డెస్క్‌, నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ​ప్రాజెక్టు గుర్తింపు–స్క్రీనింగ్, ప్రాజెక్టుల షెల్ఫ్‌, అభివృద్ధి, విజిఎఫ్ అంచనా, అనుమతుల దశల ద్వారా పిపిపి ప్రాజెక్టులను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి శాఖ ఐదేళ్ల ప్రణాళికను రూపొందించి, ఏటా అమలు చేయాల్సిన ప్రాజెక్టులను గుర్తించాలని,ఈ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన విలువ లభిస్తుందా లేదా అన్నది కూడా పరిశీలించాలని నిర్దేశించారు. పిపిపి ప్రాజెక్టుల అమలులో కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు, అంతర్‌శాఖల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 12 నెలలకు మించిన ప్రాజెక్టులను నెలకోసారి, తక్కువ వ్యవధి ప్రాజెక్టులను 15 రోజులకు ఒకసారి సమీక్షించనున్నారు. ఈ కొత్త పాలసీ తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తేయార్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్