వాషింగ్టన్ : మెయిల్-ఇన్ ఓటింగ్‌ను నియంత్రించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు ఫెడరల్ జడ్జి ఇందిరా తల్వానీ అడ్డుకట్ట వేశారు. నిబంధనలను అమలు చేయకుండా గతంలో విధించిన తాత్కాలిక నిషేధాన్ని శుక్రవారం పొడిగించారు. దీంతో నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు కొత్త నిబంధనలను అమలు చేయాలన్న ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ సర్వీస్ రూపొందించిన కొత్త నిబంధనలు ఎన్నికలకు సంబంధించిన మెయిల్‌కు మాత్రమే స్పష్టంగా వర్తిస్తాయని జడ్జి తల్వానీ ఉద్ఘాటించారు. ఈ నిబంధనలు సాధారణ పోస్టల్ మెయిల్‌కు కూడా వర్తిస్తాయని న్యాయ శాఖ చేసిన వాదనతో ఆమె విభేదించారు. ఎన్నికల నిబంధనల కింద మంజూరైన అధికారాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ యుఎస్‌పిఎస్‌కు అప్పగించలేదని జడ్జి పునరుద్ఘాటించారు.
ట్రంప్ మార్చిలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ఆధారంగా రూపొందించిన నిబంధనలను అమలు చేసేందుకు యుఎస్‌పిఎస్‌కు అనుమతించాలని న్యాయ శాఖ కోర్టును కోరింది. ఈ ఉత్తర్వు ప్రకారం మెయిల్ ద్వారా బ్యాలెట్లు పొందే అర్హత ఉన్న ఓటర్ల వివరాలను ఫెడరల్ స్థాయిలో సేకరించాలని ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాల పాత్రను తగ్గించే ఈ చర్యను పౌర హక్కుల సంస్థలు, 23 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, పెన్సిల్వేనియా గవర్నర్ సవాలు చేశారు. దీంతో ఓటర్ల వివరాలు, బ్యాలెట్ కవర్ల నమూనాలకు సంబంధించిన వివాదాస్పద నిబంధనలను యుఎస్‌పిఎస్ అమలు చేయడానికి వీలు లేకుండా కోర్టు అడ్డుకుంది. ఎన్నికల మోసాన్ని అరికట్టే పేరుతో ఓటు వేసే వయసున్న అమెరికా పౌరుల జాబితాలను రూపొందించాలని ట్రంప్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే మెయిల్ ద్వారా బ్యాలెట్లు పొందే అర్హులైన ఓటర్ల ప్రత్యేక జాబితాను రూపొందించాలని పోస్టల్ సర్వీస్‌ను ఆదేశించారు.








కామెంట్‌లు (0)